స్వీట్ కార్న్ చాట్

 

 

ఒకోసారి అనుకోకుండా అతిధులు ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ..ఏదో ఒకటి చేసి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళతో మాట్లాడుతూనే ఫాస్ట్ గా , సింపుల్ గా చేయగలిగే ఐటమ్స్ టక్కున గుర్తుకు రావు ఒకోసారి . ఇకప్పుడు ఇంట్లో అందుబాటులో వున్నవాటితో రుచి కరమయిన ఐటమ్స్ చేయటం లోనే మన గొప్పతనం వుంది అంటారు మా అత్తగారు. ఆమె అలా చక చకా కొత్త వంటలు కనిపెట్టటం లో మాస్టర్ . మరి ఆమె కోడలిగా మనం కూడా అలా ఉండక పోతే ఎలా చెప్పండి. వీలు చిక్కినప్పుడల్లా నేను కూడా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటా..అదిగో అలా చేసిన ఓ ప్రయోగమే ఈ స్వీట్ కార్న్ చాట్ . ఫాస్ట్ గా అయిపోతుంది . వరైటి గా వుంటుంది .

కావలసిన పదార్థాలు

స్వీట్ కార్న్       -  ఒక కప్పు

ఉల్లి పాయలు    -   ఒకటి

టమాటా           -  ఒకటి

కాప్సికం           -  ఒకటి

కొత్తి మీర          -  ఒక కట్ట

పచ్చి మిర్చి       -  రెండు

నిమ్మరసం        -  పావు చెంచా

ఉప్పు               -  రుచికి తగినంత

చాట్ మసాలా    -  పావు చెంచా

కుకింగ్ బటర్     -  అర చెంచా

తయారి విధానం

ముందుగా స్వీట్ కార్న్ ని బాణలి లో కొంచం కుకింగ్ బటర్ వేసి మగ్గించాలి . ఒక అయిదు నిముషాలు వుంచి తే చాలు ..స్వీట్ కార్న్ మెత్త బటుతుంది. ఆ తర్వాత అందులోనే సన్నగా తరిగిన కాప్సికం కూడా వేసి మరో అయిదు నిముషాలు మూత పెట్టి మగ్గించాలి.  కాప్సికం ముక్కలలో పచ్చిదనం పోవాలి ..అంతే కాని మరి మెత్త బడకూడదు . ఇప్పడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ , టమాటా , పచ్చి మిర్చి, చాట్ మసాలా ,ఉప్పు నిమ్మరసం చేర్చి బాగా కలపాలి . వడ్డించే ముందు కొత్తి మీర పయిన వేసి వడ్డిస్తే చాలు.

ఈ చాట్ లో కాప్సికం ఇష్టం లేనివాళ్ళు ఒక్క ఉల్లిపాయ , టమాటా వేసినా చాలు . అలాగే నిమ్మరసం బదులు మాంగో పౌడర్ , పచ్చి మిర్చి బదులు కొంచం మిరియాల పొడి వేసుకోవచ్చు .

 

..రమ