పొట్లకాయ మసాలా రోల్స్

 

 

 

కావలసినవి:

పొట్లకాయ - ఒకటి 
ఉల్లిపాయలు - రెండు 
బంగాళాదుంపలు - రెండు 
క్యారెట్ - ఒకటి 
పచ్చి బఠాణీలు - అర కప్పు 
వెల్లుల్లి రెబ్బలు - రెండు
నిమ్మకాయ - ఒకటి 
పచ్చిమిర్చి - మూడు 
కొత్తిమీర - కొద్దిగా 
లవంగాలు - రెండు 
పసుపు - చిటికెడు 
గరంమసాలా - ఒక స్పూను 
కారం - తగినంత 
బియ్యపుపిండి - అరకప్పు 
శనగపిండి - అరకప్పు 
నునె, ఉప్పు - తగినంత

 

తయారుచేసే విధానం:
ముందుగా పొట్లకాయను శుభ్రంగా కడిగి రింగులు రింగులుగా కట్ చేసుకోవాలి. పొట్లకాయలో వున్న గింజలు తీసివేసి, ఉప్పు రాసుకోవాలి.వాటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన వుంచుకోవాలి. ఇప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరిగి ఉంచుకోవాలి. తర్వాత బఠాణీలు, క్యారెట్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని, పొట్లకాయ ముక్కలను మరొక గిన్నెలో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. అలాగే  బంగాళాదుంపలను కూడా కట్ చేసి కుక్కర్‌లోనే ఉడికించాలి. బంగాళాదుంపల ముక్కలు చల్లారిన తరువాత వాటి తోలు తీసి మెత్తగా ముద్ద చేసుకోవాలి. బియ్యపుపిండి, శనగపిండిలో తగినన్ని నీళ్ళు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో నునె పోసి కాగిన తరువాత ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరవాత గరంమసాలా, లవంగాలు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో బంగాళాదుంప ముద్ద వేసి బాగా కలిపిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. చివరికి కొత్తిమీర వేసి దించేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలలో ఈ కూర ముద్దను కూర్చి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ మసాలా రోల్స్ రెడీ.