రష్యన్ సలాడ్

 

 

వేసవికాలం వచ్చేసింది. మంచినీళ్లు, కూల్ డ్రింక్స్ లాంటివి ఎన్ని తాగినా దాహం తగ్గదు. ఇలాంటి సమయంలో సలాడ్స్ చాలా మేలు చేస్తాయి. భానుడి ప్రతాపం నుండి ఈ సలాడ్స్ తో మనల్ని మనం కాపాడుకోవచ్చు. కానీ సలాడ్స్ లో ఎన్నోరకాలు ఉన్నాయి. మరి వీటిలో ఏది తినాలి అన్న సందేహానికి సమాధానంగా రష్యన్ సలాడ్ గురించి చెప్పుకోవచ్చు. మిగిలిన సలాడ్స్ తో పోలిస్తే కాస్త విభిన్నంగా అనిపించే ఈ సలాడ్ ను ఎలా చేయాలో చూద్దాం రండి.

కావాల్సిన పదార్థాలు:

బంగాళదుంప, బీన్స్, క్యారెట్ ముక్కలు -అన్ని కలిపి 1 కప్పు

బొప్పాయి, చెర్రీ, దానిమ్మ గింజలు,ద్రాక్ష పళ్ళు  -  అన్నీ కలిపి 2 కప్పులు

పెరుగు -  1 కప్పు

మైదా, వెన్న - 1/2 టీస్పూన్ చొప్పున

మిరియాల పొడి - 1 టీ స్పూన్

పంచదార - 2 స్పూన్స్

ఉప్పు - రుచికి తగినంత

తయారి విధానం:

ముందుగా సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఒక గిన్నెలో పెరుగు, పంచదార, మిరియాల పొడి, ఉప్పు వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కల్ని ఉడికించి ఉంచుకోవాలి. పళ్ళని చిన్న ముక్కలుగా తరుగుకుని ఉంచుకోవాలి.వీటన్నిటిని ఒక పెద్ద బౌల్ లో వేసి మంచిగా కలపాలి. అలా కలిపిన వాటి మీద ముందుగా తయారుచేసి పెట్టుకున్న డ్రెస్సింగ్ వేసి అటు ఇటు కదుపుకోవాలి. మంచి సువాసన కోసం పుదినా ఆకులు కూడా వేసుకోవచ్చు. పెరుగు చిక్కగా ఉంటే సలాడ్ ఇంకా రుచిగా వస్తుంది. ఇది పూర్తిగా పళ్ళు, కూరగాయలు, పెరుగుతో తయారుచేస్తాం కాబట్టి వేసవిలో మన  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా తయారయిన రష్యన్ సలాడ్ ని గంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేస్తే బాగుంటుంది.

..కళ్యాణి