మినప గారెలు

 

 

కావలసినవి :

మినపపప్పు                            - అరకేజీ
పచ్చిమిర్చి                               - 5
ఉల్లిపాయలు                             - 1
ఉప్పు                                      - సరిపడ
నూనె                                       - అరకేజీ
అల్లం                                       - చిన్నముక్క
జీలకర్ర                                    - 2 స్పూన్స్

తయారుచేసే విధానం :

ముందుగా మినప్పప్పును రాళ్ళూ, మట్టి బెడ్డలు లేకుండా శుభ్రం చేసుకోండి. ఒక పాత్రలో తగినన్ని నీళ్ళు పోసి కనీసం నాలుగు గంటలు నానబెట్టండి. బాగా నానిన మినప్పప్పును నీరులేకుండా వడగట్టి మిక్సీలో వేసి  బరకగా, గట్టిగా  ఉండేలా  గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పును మిక్సీలో వేసినప్పుడు తొందరగా నలగడం కోసం నీళ్ళు పొయ్యవద్దు. నీళ్ళు ఎక్కువగా పోస్తే పిండి పలుచనై అట్లపిండిలా తయారయ్యే ప్రమాదం ఉంది. పిండి జారుగా ఉండకూడదు. ఎంత గట్టి ముద్దలా ఉంటే అంత బాగుంటుంది. గారెలు అంత రుచిగా వస్తాయి.అల్లం, పచ్చిమిర్చి,  ఉప్పు,  జీలకర్రలను  మిక్సీచేసి  పై  మిశ్రమంలో  కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి  పెట్టి  నూనె  పోసి  వేడిచేయాలి. పాల కవర్ లేదా అరిటాకు తీసుకుని, దానిమీద ఓ పావువంతు టీస్పూను నూనె రాయండి. దానిపై సిద్ధంగా ఉంచుకున్న గారె పిండి కొద్దిగా వేసి. దళసరి బిళ్ళగా చెయ్యండి. దానిని బాగా కాగుతున్న నూనెలో పేసి గోధుమ రంగు వచ్చేలా వేయించండి. ఒకదాని తర్వాత ఒకటిగా గారెలు వేయించేటప్పుడు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా చూసుకోండి. వీటిని కొబ్బరి పచ్చడితో గాని, వేరుశనగ పప్పు పచ్చడితో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది.