మ్యాంగో మురబ్బా

 

 

ఈ మామిడి సీజన్‌లో అందరూ మామిడిపళ్ళు తప్పనిసరిగా తింటారు. పచ్చి మామిడి కాయతో పప్పు వండుకోవడం అనేది మన తెలుగు ఇళ్ళలో కంపల్సరీ. పుల్లపుల్లగా వుండే పచ్చి మామిడి కాయతో తియ్యతియ్యగా వుండే మురబ్బా చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు మ్యాంగో మురబ్బా చేయడం ఎలాగో చూద్దాం.

 

కావలసినవి:-

పచ్చి మామిడి కాయలు - 2

పంచదార - 300 గ్రాములు

ఏలక్కాయలు - 5

లవంగాలు - 2

మిఠాయి రంగు - కొద్దిగా

 

 తయారుచేసే విధానం:-

మామిడి కాయల తోలు తీసేసిన తర్వాత సన్నగా తురుముకోవాలి. అలాగే యాలకులు, లవంగాలను పొడి చేసుకుని, అందులో మిఠాయి రంగును కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో మామిడి తురుము, పంచదార వేయాలి. వేడికి పంచదార కరుగుతుంది. పంచదార, మామిడి తురుము బాగా కలిసే విధంగా కలుపుతూ వుండాలి. ఈ ప్రక్రియ అంతా స్టవ్‌ను సిమ్‌లో పెట్టుకునే చేయాలి. పంచదార మొత్తం ద్రవ రూపంలోకి మారిపోయి మామిడి తురుము, పంచదార పాకం పూర్తిగా కలసిపోయేవరకూ కలుపుతూనే వుండాలి. పంచదార క్రిస్టల్స్‌ రూపంలో కనిపించకుండా వుండే వరకూ కలపాలి. అలాగే పంచదార గట్టిపడే వరకు స్టవ్ మీద పాన్ వుంచకూడదు. స్టవ్ మీద నుంచి పాన్ దించేసిన తర్వాత చల్లార్చాలి. పదార్ధం చల్లారిన తర్వాత సిద్ధంగా వుంచుకున్న యాలకులు, లవంగం, మిఠాయిరంగు మిక్స్‌ని చల్లి బాగా కలుపుకోవాలి. మిఠాయి రంగు మామిడి తురుము మొత్తానికీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ స్వీట్‌ని గాజు పాత్రలోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత తినాలి. ఈ మ్యాంగో మురబ్బాని తినేటప్పుడు ఎవరూ లొట్టలు వేయకుండా వుండలేరు.