ఫటాఫట్ చాట్ 

 

 

 

పిల్లలు ఇంట్లో వుంటే అమ్మ వంటింట్లో ప్రయోగాలూ చేయాల్సిందే. ఆకలి అనగానే వెంటనే ఏదో ఒకటి పెట్టాల్సిందే. అమెరికాలో వున్న మా ఫ్రెండ్స్ కొంతమంది 'మంచు బాగా పడటంతో పిల్లలు ఇంట్లోనే వుంటున్నారువారంలో నాలుగు రోజులు. వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ ఏవో ఒకటి చేయాలి... కొంచం ఫాస్ట్‌గా అయ్యేవి ఏంటని చూస్తున్నాం' అని ఈ మధ్య అనటం విన్నాక ఈ చాట్ చేసి చూశా. త్వరగా అయపోయింది. టేస్ట్‌గా కూడా వచ్చింది. సో మీరు పిల్లలు ఆకలి అనగానే ఈ చాట్‌ని చేసిపెట్టేయండి.

 

పిల్లలు ఇంట్లో వున్నప్పుడు... ముందుగానే అమ్మ కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవాలి. ఎలా అంటే.. శనగలు, బఠానీలు,పెసలు వంటివి ముందే నాన బెట్టుకుని వుంచుకుంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి టక్కున చేసేయచ్చు. సరే మరి  ఈ ఫటాఫట్ చాట్ చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా.

 

కావలసిన పదార్థాలు:
1. తెల్ల శనగలు - పావు కేజి
2. ఆలూ - మూడు 
3. టొమేటో - రెండు 
4. ఉల్లిపాయలు - రెండు 
5. అమ్చూర్ పౌడర్ - ఒక చెంచా
6. మిరియాల పొడి - చిటికెడు  
7. ఉప్పు, కారం - తగినంత 
8. కసూరి మేతి - అర చెంచా 
9. గరం మసాలా - అర చెంచా
10. శనగపిండి - రెండు చెంచాలు
11. నూనె - ఒక చెంచా

 

 

తయారుచేసే విధానం:
ముందుగా నానబెట్టిన బఠానీలని, ఆలూ, టొమేటోలతో కలిపి కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆలూ చెక్కు తీసి.. మరీ చిన్న ముక్కలు కాకుండా, మరి పెద్దవి కాకుండా, మీడియం సైజులో కట్ చేయాలి. టొమాటోని చిన్న ముక్కలుగా చేయాలి. అలా ఉడికిన బఠానీమిశ్రమాన్ని తీసి మెదిపి (అంటే కొన్నిటిని మెత్తగా చేయటం)  పక్కన పెట్టుకోవాలి.

 

ఇప్పుడు బాణలిలో నూనె వేసి కొంచం వేడి కాగానే శనగపిండి వేసి వేయించాలి. నూనెలో వేయగానే సెనగపిండి ముద్దగా అవుతుంది. అయనాపచ్చి వాసన పోయేదాకా అంటే సుమారు 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత బఠానీ ఉడికించిన నీటిని కొంచం శనగపిండిలో వేస్తే అది  ఉడుకుతుంది. అలా రెండు నిమిషాలు అయ్యాక, మెదిపి పక్కన పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని అందులో వేయాలి. ఇప్పుడు ఉప్పు, కారం, కసూరి మేతి, అమ్చూర్ పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు సన్న మంట మీద ఉంచాలి. 

 

వడ్డించే ముందు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని  పైన వేయాలి, ఇష్టపడే
వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్ట్‌గా కూడా వుండి... పిల్లలు ఇష్టంగా తింటారు.

 

టిప్: ఎప్పుడు అయినా కూర ముద్దగా రావాలి, కానీ శనగపిండి రుచి తెలియకూడదు అనుకుంటే. శనగపిండిని ముందుగా నూనెలో వేయించి నీళ్ళు పోస్తే గ్రేవీ వస్తుంది.

 

 

-రమ