చిక్కీ

 

చిక్కీ.. ఈ మాట వినగానే నోరూరుతోంది కదూ. చిక్కీని పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఇష్టపడతారు. చిక్కీ రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. బయట బజార్లో అమ్మే చిక్కీలు దాదాపుగా ఒకే ఫార్ములాతో వుంటాయి. బెల్లం పాకం.. వేరుశనగపప్పు... అంతే..! కానీ అవే చిక్కీలను మనం ఇంట్లో చేసుకుంటే మరింత రుచికరంగా, మరింత బలవర్ధకంగా తయారుచేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

 

కావలసిన పదార్థాలు:
బాదంపప్పు - ఒక కప్పు 
వేరుశనగపప్పు - ఒక కప్పు
పిస్తా - కొద్దిగా
కిస్‌మిస్ - కొద్దిగా 
జీడిపప్పు - ఒక కప్పు 
పంచదార - రెండు కప్పులు

 

 

తయారుచేసే విధానము:
ముందుగా ఒక బాణలీ తీసుకొని వేరుశనగపప్పు వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత వేరుశనగ పప్పు పైన వున్న పొట్టును శుభ్రం చేసుకోవాలి.  బాదంపప్పు, పిస్తా, కిసిమిస్, జీడిపప్పులను కూడా వేయించాలి. ఇప్పుడు పంచదారలో చాలాకొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. ముదురు పాకం వచ్చాక వేరుశనగపప్పు వేసి బాగా కలిపి, ఆ తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న బాదంపప్పు, పిస్తా, కిస్‌మిస్, జీడిపప్పులను కూడా  కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత రొట్టెల పీట మీద వేసి రొట్టెల కర్రతో గట్టిగా వత్తి, కత్తితో కోసుకుంటే చిక్కీలు వస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక రుచి సంగతంటారా.. ప్రత్యేకంగా చెప్పేదేముంది?
ఈ చిక్కీలు చేసేటప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. పాకం పట్టేటప్పుడు పంచదారకి కేవలం పంచదార కరగడానికి అవసరమైనంత నీరు మాత్రమే కలపాలి. ఎక్కువ నీరు పోస్తే పాకం పలచబడిపోతుంది. అలాగే పాకం మరీ ముదరకుండా చూసుకోవాలి. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తపడితే చక్కని చిక్కీ ఇంట్లో చేసుకోవడం పెద్ద కష్టం కాదు.