Aam Ka Murabba

 

 

మురబ్బా అనగానే అల్లం మురబ్బా గుర్తుకొస్తుంది...కొంచం ఘాటుగా , మరి కొంచం తీపిగా భలే రుచిగా వుంటుంది అల్లం మురబ్బా...కాని మామిడి మురబ్బా పుల్లగా వుండి, పులుపు, తీపి కలయికతో మంచి రుచిగా వుంటుంది. చేయటం కూడా సులువే. కొంచం ఓపికగా గరిట తిప్పగలిగితే చాలు.

 

కావలసినవి :-

మామిడి కాయలు ..4

పంచదార 3 కప్పులు

ఏలకులు పొడి చిటికెడు.

 

  తయారీ విధానం:-

ముందుగా మామిడి కాయలని బాగా కడిగి, చెక్కు తీయాలి. ఆ తర్వాత సన్నగా కోరాలి. గ్రైండ్ చేస్తే నీరు, నీరుగా వుంటుంది, అందుకని సన్నగా కోరుకోవాలి. అలా కోరిన మామిడి కోరులో పంచదార కలిపి స్టవ్ మీద సన్నని మంటమీద ఉడికించాలి. పంచదార కరిగి మొదట నీరు, నీరు గా వస్తుంది. ఆ తర్వాత పాకం వచ్చి దగ్గరవుతుంది. దీనికి కొంచం టైం పడుతుంది. అందుకే ఓపికగా అడుగు అంటకుండా గరిటతో తిప్పుతూ వుండాలి. పాకంలో ఉడికి మామిడి కోరుకి మంచి రుచి వస్తుంది. మామిడి, పంచదార మిశ్రమం మరీ గట్టిపడకుండా ఆపేయాలి. చల్లారాక మరికొంచం గట్టి పడుతుంది కాబట్టి ...మూకుడు నుంచి మిశ్రమం వేరు పడుతుంటేనే ఆపేయాలి. చివరిలో యాలకుల పొడి వేసి దించితే మంచి సువాసన వస్తుంది మామిడి మురబ్బ కి..

 

టిప్స్ :

1. మామిడి కాయలు పుల్లగా వుండాలి. అప్పుడే మురబ్బ రుచిగా వస్తుంది.

2. మురబ్బ చేయటానికి మందపాటి మూకుడు తీసుకోవాలి. అడుగు అంటకుండా వుంటుంది.

3. ఈ మురబ్బ చపాతీల లోకి చాలా బావుంటుంది. కోరు వేస్తాం కాబట్టి ..మామిడి పుల్ల , పుల్ల గా నోటికి తగిలి మంచి రుచిగా అనిపిస్తుంది.

 

- రమ