రంజాన్ స్పెషల్స్

 

 

దమ్ చికెన్ బిర్యాని

 

 


కావలసినవి :

చికెన్ - 1  కేజీ
బాస్మతీ బియ్యం - 1 కేజీ
ఉల్లిపాయలు - అరకేజీ
పెరుగు - అర లీటర్.
పచ్చిమిర్చి - 3
పసుపు - 1/4 టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్
ఏలకులు - 6
అల్లం-వెల్లుల్లి ముద్ద - 3 టీస్పూన్స్
కొత్తిమీర - 1/2 కప్పు
పుదీన - 1/2 కప్పు
గులాబీ రేకులు - 3 టీస్పూన్స్
లవంగాలు - 10
పాలు - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
దాల్చిన చెక్క - 2 ముక్కలు
షాజీరా - 2 టీస్పూన్స్
గరంమసాలా పొడి - 1 టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
కుంకుమ పువ్వు - చిటికెడు

తయారీ:

ముందుగా నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా కరకరలాడేటట్టుగా వేయించి పెట్టుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమీర, పుదీనా, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా వేయిచుకోవాలి. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కారంపొడి, పసుపు, నిమ్మరసం, ఎండిన గులాబీ రేకులు,  ఉప్పు వేసి గ్రైండర్లో మెత్తగా ముద్ద చేసుకోవాలి. ఒక గిన్నెలో కి   చికెన్ వేసి నూరిన ముద్ద, పచ్చి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరంమసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి... బియ్యం కడిగి అరగంట నాననిస్తే చాలు. తరువాత స్టవ్ వెలిగించుకుని మందపాటి గిన్నె తీసుకుని  నూనె  వేసి ముందు  వేయించిన ఉల్లిపాయలు ముక్కలు వేసి దానిమీద నానబెట్టిన చికెన్ మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి. పక్క స్టవ్ మీద ఇంకో గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేయాలి. మరుగుతున్న ఈ బియ్యం వేసి సగం ఉడకగానే త్వరత్వరగా జల్లెడలో వడకట్టి చికెన్ పై సమానంగా పరవాలి...దానిపై ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, యాలకుల పొడి,  పాలల్లో నానబెట్టిన కేసర్ రంగు అక్కడక్కడ వేసి,  దానిమీద  మూత పెట్టి అరగంట సన్నని మంట మీద ఉడకనివ్వాలి.

 

*****

 

షీర్ కుర్మా

 


 

కావలసినవి :

పాలు - 1 లీటర్
పంచదార -  కప్పు
నెయ్యి - సరిపడా
సన్నని సేమ్యా - 1/2 కప్పు (వేయించినది)
యాలకుల పొడి - 1.స్పూన్
బాదాం , పిస్తా, కాజూ - అరకప్పు
ఖర్జూరం - అరకప్పు
సారపప్పు, కర్బూజా గింజలు - పావు కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
కండెన్స్డ్ మిల్క్ -పావు కప్పు

తయారీ :
ముందుగా కుంకుమ పువ్వుని రెండు చెంచాల వేడి పాలల్లో వేసి నాననివ్వాలి. ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి బాదాం, పిస్తా, జీడిపప్పు, సారపప్పు, కర్బూజా గింజలు, సన్నగా ముక్కలు చేసుకున్న ఖర్జూరాన్ని వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నేతిలో సేమ్యా కూడా వేయించుకోవాలి. మరో ప్యాన్‌లో పాలు మరిగించాలి. అవి బాగా కాగి చిక్కబడుతుండగా పంచదార వేసి కలపాలి. అది కరిగిన తర్వాత వేయించిన పలుకులు, ఖర్జూరం, సేమ్యా, యాలకుల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించి కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి కలిపి దింపేయాలి. అతిథులకు వేడిగా సర్వ్ చేయాలి.