RELATED NEWS
NEWS
అత్యంత వైభవంగా కెనడాలో ఉగాది ఉత్సవాలు..

 

అత్యంత వైభవంగా కెనడాలో  ఉగాది ఉత్సవాలు


గ్రేటర్ తెలుగు టొరొంటొ, మర్ఖం, బ్రాంప్‌టన్, మిస్సిసాగ, ఓక్‌విల్లె, వాటర్ డౌన్, కిచెనెర్, వాటర్లూ , కేంబ్రిడ్జ్, హమిల్టన్, మిల్టన్ నగరాల నుంచి వచ్చిన వందలాది మంది తెలుగు వారు ఎంతో వైభవంగా ఉగాది వేడుకలు చేసుకున్నారు. సంగీతం, నాట్యం, నాటకం, హాస్యం కలబోసిన నవరసాల వినోద కార్యక్రమాలతో ఆద్యంతం కార్యక్రమం ఆనందంగా సాగింది. అందమైన రంగవల్లులతో సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దారు, తెలుగు కల్చరల్ అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరొంటో సభ్యులు. జాతీయ గీతాలాపన తరువాత, ముఖ్య అతిధులు గా విచ్చేసిన  Dr. Cyril Tahtadjian, Dentistry in Streetsville, Bharat Batra, Vice President & SBI Branch Head, Hon. R.K. Perindia, Consul-Commercial, Consular, Passport & Visa from Consulate General of India Toronto, TCAGT ఫౌండర్ మెంబర్స్, ఎగ్జిక్యుటివ్ మెంబర్స్ మరియు ట్రస్టీలు  జ్యోతి ప్రకాశనం తో కార్యక్రమం ప్రారంభించి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, టొరొంటోలోని తెలుగు వారి విజయాలను ప్రశంసించారు.

ఇటీవల తిరుమల గురించి నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ లో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం,   తెలుగు రాష్ట్రాలైన అమరావతి అభివృద్ధి, తెలంగాణలోని ఐటీ హబ్ ల పై  ప్రత్యేక కార్యక్రమాల వీడియోల ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమైంది.  పండిత్ సనత్ శ్రీరాంభట్ల పంచాంగ పఠనం చేయగా, ప్రఖ్యాత గాయని హన్సిక పొలిమెర శాస్త్రీయ సంగీతం, సినీ గీతాలతో అలరించింది. అన్నమాచార్య కీర్తనలు, శ్లోకాలు, వేణునాద విన్యాసం, కర్ణాటక సంగీతం, సినీ గీతాలు, మృదంగ వాద్య విన్యాసం, హాస్య గల్పికలు, కెనడాలో తెలుగు బడి నాటిక, వంటి కార్యక్రమాలతో కెనడా తెలుగు పిల్లలు, కళాకారులు దాదాపు 6 గంటలు అద్భుతమైన ప్రదర్శనలు చేసారు.

 


TCAGT పూర్వాద్యక్షులు, ప్రస్తుత ట్రస్టీ సూర్య బెజవాడ అతిధులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, గత 20 యేళ్ళుగా TCAGT చేస్తున్న కార్యక్రమాలను సభకు తెలియజేసారు, కవులు,కళాకారులు, క్రీడాకారులు, రాజకీయనాయకులకు TAGT ద్వార అందీన సహాయ సహకారాలను వివరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చెసిన సిలికానాంధ్ర సంస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, మాతృ భూమి ఋణాన్ని, మాతృభాష ఋణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. ఆనంద్ మాట్లాడుతూ, సంస్కృతి వేరు, వినోదం వేరు, మన సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయం అర్ధం కావాలంటే మాతృభాష నేర్చుకోవడమొక్కటే మార్గమని, అందుకే తరువాతి తరాలకు తెలుగు భాష అందించడానికి సిలికానాంధ్ర మనబడి ప్రారంభించి ఇప్పటివరకు దాదాపు 27 వేలమందికి పైగా విద్యార్ధులకు తెలుగు నేర్పామని తెలిపారు. మాతృ భూమికి ఎంతో దూరాన ఉన్నా కెనడా లోని తెలుగు పిల్లలు ఇంత చక్కని ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, నేటి యువతే రేపటి భవిత అనే ఒక భద్రతా భావం కలుగుతోందని, ప్రవాస బాలలను ఇలా తీర్చిదిద్దుతున్న గ్రేటర్ టొరొంటో తెలుగు సభ్యుల చేస్తున్న సేవను ప్రశంసించారు. తెలుగు వారి గుండె సవ్వడి 'కూచిపూడి ' గురించి ప్రపంచానికి చాటడానికి, అన్నమయ్య కీర్తనలను ఇంటింటా వినిపించాలని అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం, అన్నమయ్య లక్షగళార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించి గిన్నిస్ రికార్డులు సైతం సాధించామని, తెలుగు వాడు తలుచుకుంటే సాధించలేనిది లేదని అన్నారు. కూచిపూడి గ్రామం దత్తత తీసుకుని జయకూచిపూడి అన్న నినాదంతో భారతదేశంలోనే తలమానికమైన ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నామని, ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రవాస భారతీయులు చేయూతనిస్తున్నారని అన్నారు. కూచిపూడి లో నిర్మించ తలపెట్టిన 'సంజీవని ' మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి తమవంతు విరాళాలు అందించి, తద్వారా దాదాపు 100 గ్రామాలకు ఆరోగ్య దానం చేయాలని పిలుపునిచ్చారు. జయహో కూచిపూడి కెనడా కార్యకర్త సుధ వేమూరి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్ టొరొంటో తెలుగు ఎగ్జిక్యుటివ్ సభ్యులు, ట్రస్టీలు, సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.


అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, అతిధులకు, మనబడి బృందానికి , కళాకారులకు సత్కారం, కోశాధికారి దేవి  చౌదరి వందన సమర్పణ, ఉగాది పచ్చడి, సంప్రదాయ తెలుగు భోజనం, జాతీయ గీతం తో కార్యక్రమం కన్నులపండుగ గా ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;