RELATED EVENTS
EVENTS
ఘనంగా టాంటెక్స్ రియూనియన్ బాంక్వెట్ - అలరించిన సునీత సంగీత విభావరి

 

 

ఇర్వింగ్ లోని స్థానిక లాస్ కొలినాస్ స్టూడియోస్ లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రస్తుత, పూర్వ అధ్యక్షుల, కార్యవర్గ సభ్యుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యదర్శులు జ్యోతి వనం , కృష్ణవేణి శీలం సారధ్యం వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ గారి చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక డల్లాస్ లిటిల్ మ్యుజిసియన్స్ చిన్నారులు ఆలాపించిన "తెలుగు భాష తీయదనం" పాటకి ఇతర చిన్నారులు నాట్యం చేయటంతో కార్యక్రమం శుభారంబం జరిగింది. ఆ తదుపరి టాంటెక్స్ ఉపాధ్యక్షులు ఉరిమిండి నరసింహారెడ్డి సంస్థ 27 మంది పూర్వ అధ్యక్షుల గురించి, వారి హయాంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల గురించి సొదాహరణముగా సభకు వివరించారు. ఆ తరువాత టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సురేష్ మండువ పూర్వ అధ్యక్షులందరినీ వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. తదుపరి తన హయాంలో ఈ సంవత్సరం చేపట్టిన వినూత్న కార్యక్రమాల గురించి సవివరముగా తెలియచేశారు. జాతీయ తెలుగు సంస్థలైన తానా, ఆటా, నాట్స్ మరియు నాటా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే సిలికానాంధ్ర, టిప్స్, టీ, టిడిఎఫ్ తరపున సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 



సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ నేపధ్య గాయని సునీత ఆధ్వర్యంలో గాయని గాయకులు సునీత, శ్రీకృష్ణ, సాయి శిల్ప, సాయి చరణ్ మరియి మిమిక్రి కళాకారుడు వెంకీ ఆహుతులను ఆద్యంతం అలరించారు. ఈటివి జబర్దస్త్ కార్యక్రమం నటుడు రాకేశ్ మరియు మిమిక్రీ కళాకారుడు త్రినాధ్ వారి హాస్యభరిత కార్యక్రమాలతో అందరినీ వినోద పరిచారు. తదుపరి అధ్యక్షులు సురేశ్ మండువ అధ్వర్యంలో , ప్రస్తుత కార్యవర్గ సభ్యులనందరిని వేదిక మీదకు ఆహ్వానించి టాంటెక్స్ సంస్థకు ఉన్న ప్రతిష్ట గురించి వివరించి, సంస్థ కార్యకలాపాల కోసం ఒక శాశ్వత భవనం యొక్క అవసరాన్ని తెలియచేశారు. దాతలందరినీ సంస్థ భవనం కోసం విరాళాలు సమకూర్చవలసింది గా విజ్ఞప్తి చేశారు. తదుపరి చివరవరకు మధురమైన పాటలతో సాగిన సునీత , శ్రీకృష్ణల సంగీత విభావరి ప్రేక్షకులను మైమరపింప చేసింది. వెంకీ సరదా పాటల మిమిక్రీ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అతిధులందరూ చివరివరకు ఉండి కార్యక్రమాన్ని ఆస్వాదించారు!

 

 




స్థానిక బావార్చి బిర్యాని పాయింట్ వారు నోరూరించే వంటకాలతో చక్కని విందు భోజనం వడ్డించారు. దాదాపు 600 వందల మంది హాజరైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది.టాంటెక్స్ సంస్థ మొట్టమొదటి సారి నిర్వహించిన ఈ బాంక్వెట్ కి హాజరైన ప్రతి ఒక్కరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రస్తుత కార్యవర్గాన్ని అభినందించారు. చివరగా టాంటెక్స్ పాలక మండలి అధ్యక్షులు రామకృష్ణ లావు గారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు, పోషక దాతలకు పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియచేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;