RELATED EVENTS
EVENTS
57th Nela Nela Telugu Vennela Sadassu held on 15th Apl

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( టాంటెక్స్) సాహిత్య వేదిక నిర్వహించిన 57 వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఏప్రిల్ 15, 2012 నాడు, డాలస్ లోని రుచి పాలెస్ రెస్టారెంటులో, సంయుక్త కార్యదర్శి మరియు సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరినది. కార్యక్రమం ప్రారంభంలో జరిగిన స్వీయరచన విభాగంలో పలువురు సాహితీ ప్రియులు ప్రసంగించారు. మొదట డా. జువ్వాడి రమణ "ష్ గుప్ చుప్" చిత్రంలోని ఒక దండకాన్ని చదువుతూ అసభ్యపదజాలం ఏ మాత్రం వాడకుండా ఒక మనిషిని ఎలా తిట్టాలో చెప్పి సభికులని నవ్వించారు. మల్లవరపు అనంత్, తియ్యగూర సీతారామిరెడ్డి రచించిన "ధర్మ చేతన" అనే లోతైన కవితని వినిపించారు. సాజీ గోపాల్, బాల గంగాధర్ తిలక్ రాసిన కొన్ని కవితలని విశ్లేషించారు. తదనంతరం నసీం షేక్ వచన కవితకు ఆద్యుడైన కుందుర్తి ఆంజనేయులు కవితా విశేషాలు, జీవిత విశేషాలని సభికులతో పంచుకున్నారు.

 

Nela nela telugu vennela, tantex telugu nataka rangam day, north texas telugu association, telugu nri news

 

ఇటీవల ప్రముఖ సినీ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే బహుమతి గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 75 సంవత్సరాల నాటక మరియు నటనా జీవితం సన్మాన సభా విశేషాలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( టాంటెక్స్) పాలక మండలి ఉపాధిపతి సి ఆర్ రావు సభకు వివరించారు. తరువాత మద్దుకూరి చంద్రహాస్, బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే జీవిత విశేషాలను వేదికకు పరిచయం చేసి “సమైక్య భారతి” సత్యనారాయణ గారు దర్శకత్వం వహించి, నిర్మించిన సత్యజిత్ రే మీద తీసిన ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఏప్రిల్ 23 తేది సత్యజిత్ రే గారి 20 వ వర్ధంతి అవ్వడం విశేషం. కార్యక్రమం రెండవ భాగం మల్లవరపు అనంత్ ముఖ్య అతిథి సమైక్య భారతి సంస్థాపకులు గంజి సత్యనారాయణ గారిని సభకు పరిచయం చెయ్యడంతో ప్రారంభం అయింది.

 

Nela nela telugu vennela, tantex telugu nataka rangam day, north texas telugu association, telugu nri news

 

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వాధ్యక్షులు రుమాళ్ళ శ్యామల ముఖ్య అతిథిని పుష్పగుచ్ఛంతో వేదిక మీదకు ఆహ్వానించారు. తెలుగు నాటక రంగ పరిణామం మీద ‘సమైక్య భారతి’‘ సత్యనారాయణ గారి “తెలుగు నాటకం-నాడు, నేడు” ప్రసంగాన్నిఅందరు ఆసక్తికరంగా విన్నారు. మొదట ఆయన సంస్కృత నాటక పరిణామాన్ని ప్రస్తావిస్తూ తెలుగు నాటకం మీద వాటి ప్రభావాన్నిగురించి ప్రస్తావించారు. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, తిరుపతి వేంకట కవులు, కాళ్ళకూరి నారాయణరావు, వేదం వెంకటరాయశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పానుగంటి లక్ష్మీ నరసింహ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచర్యులు రాసిన నాటకాల గురించి క్లుప్తంగా వివరించారు. తొలి నాటక సమాజాలు, నాటకాలని ప్రదర్శించడంలో ఏర్పడిన దళారీ వ్యవస్థ, నాటక పరిషత్తులు, రేడియో నాటకాలు వంటి పలు అంశాల గురించి ఆహూతులకు వివరించారు. చివరిగా ఆధునిక నాటక రంగ విశేషాల వివరణతో సత్యనారాయణ గారి ప్రసంగం ముగిసింది.

 

Nela nela telugu vennela, tantex telugu nataka rangam day, north texas telugu association, telugu nri news

 

తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( టాంటెక్స్) అధ్యక్షులు గీత దమ్మన్న, తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్ ముఖ్య అతిథిని శాలువతో సత్కరించారు. టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ,మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, డా.ఊరిమిండి నరసింహా రెడ్డి, మద్దుకూరి చంద్రహాస్, ప్రవీణ్ బిల్లా, నసీం షేక్ లు ముఖ్య అతిథి ‘సమైక్య భారతి’ సత్యనారాయణగారికి జ్ఞాపిక సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పాలక మండలి సభ్యులు మరియు కార్య నిర్వాహక సభ్యులు హాజరయ్యారు. 

 

Nela nela telugu vennela, tantex telugu nataka rangam day, north texas telugu association, telugu nri news

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;