RELATED EVENTS
EVENTS
TANTEX Sankranthi Sambaraalu 2012

ఉత్తర టెక్షాస్ తెలుగు సంఘం వారు స్థానిక కాప్పెల్ మిడిల్ స్కూల్ వెస్ట్ లో నిర్వహించిన "సంక్రాంతి సంబరాలు" ఆహ్లాద భరితమైన వాతావరణంలో, చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో కనుల పండువగా జరిగాయి. టాంటెక్స్ నూతన అధ్యక్షురాలు శ్రీమతి గీత దమ్మన గారి ఆద్వర్యంలో, సాంస్కృతిక కార్యదర్శి శ్రీ రాజేష్ చిలుకూరి ఈ కార్యక్రమాలని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ జానపద గేయ కళాకారిణి శ్రీమతి అరుణ సుబ్బారావు భారత దేశం నుండి ముఖ్య అతిదిగా విచ్చేశారు. ప్యారడైస్ బిర్యాని పాయింట్ భోజన శాల వారు షడ్రసోపేతమైన  విందు భోజనాన్ని  అందజేశారు.

 

 

మొదటగా అభినయ కూచిపూడి అకాడెమి వారు కళ్యాణి ఆవుల దర్శకత్వంలో ప్రదర్శించిన "సంక్రాంతి" నృత్య రూపకం సూర్య భగవానుని ప్రార్థన తో ప్రారంభమై, గొబ్బిళ్ళ పాటలు, గంగిరెద్దుల వాడు, నెమలి నృత్యాలు, రంగవల్లుల పాటలు, శివ తాండవం, కోలాటం తో సంక్రాంతి పండుగను కళ్ళ ముందు ఆవిష్కరించారు. తదుపరి విద్యావికాస్ బాలలు ప్రదర్శించిన "తెలుగు మాసముల ప్రాముఖ్యత" అనే రూపకం ఆకట్టుకుంది. డల్లాస్ లిటిల్ మ్యుజిసియన్ అకాడెమీ పిల్లలు ఆలపించిన "సరిగమ పదని స్వరాలే", "చిలుకా పద పద" గేయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

 

పారడి లేడి, జాన పద గాన కోకిల శ్రీమతి అరుణ సుబ్బారావు గారు మిర్చి బజ్జి, ఇడ్లి సాంబారు, పూరి, దోశ, దోమ ల మీద పాడిన పారడి గీతాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. వర్షం సినిమాలోని "ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన" పాటను బుర్ర కథలాగా, హరి కథ లాగా, ఒగ్గు కథలాగా పాడి విన్పించడం అందరిని ఆకట్టుకుంది. తరువాత ప్రదర్శించిన మైం స్కిట్ అందరిని నవ్వుల్లో ముంచేసింది.

 

 

చివరగా రాజేష్ చిలుకూరి, కస్తూరి ఇనగంటి కలిసి నిర్వహించిన "సందడి" అనే ప్రత్యేక నృత్య కార్యక్రమం మన సంస్కృతి గురించి, కుటుంబ సంబందాల గురించి, ఒక వైపు అన్నాచెల్లెళ్ళ అనుబంధాలు ఆత్మీయతను కురిపిస్తుంటే, మరో వైపు బావామరదళ్ల సరస సల్లాపాలు వినిపిస్తూ, పెళ్లి వేడుకలను, షష్టి పూర్తి ఉత్సవాలను ఆటపాటలతో కళ్ళకు కట్టినట్లు  చూపించి  ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచెత్తారు.

 

టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షుడు శ్రీ. ఎన్.ఎం.ఎస్ రెడ్డి తన   సుదూర  ప్రయాణంలొ ప్రత్యక్షంగా  మరియు  పరోక్షంగా   దోహద పడిన సభ్యులకు, మిత్రులకు,  పోషక దాతలకు కృతఙ్ఞతలు తెలిపారు.  శ్రీమతి గీత దమ్మన్న మరియు సురేష్ మండువ, శ్రీ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ఎన్.ఎం.ఎస్ రెడ్డి దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. టాంటెక్స్  అధ్యక్షురాలు శ్రీమతి గీత దమ్మన తమ సందేశంలో ఎంతో ఉత్సాహంతో సేవచేయడానికి ముందుకు వచ్చిన నూతన కార్యవర్గ సభ్యులకు కృతఙ్ఞతలు తెలియ జేస్తూ 2012 కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు. ఈ సందర్భముగా 2012 వ సంవత్సరంలో చేయబోయే తెలుగు భాషా భోదన, సుఖీ భవః కార్యక్రమాల గురించి వివరించారు. పెద్ద సంఖ్యలో పాల్గొని వైవిధ్యమైన కార్యక్రమాలను ప్రదర్శించిన స్థానిక కళాకారులకు కృతజ్ఞతలు తెలియచేశారు.

 

 

ఈ సందర్భముగా ఎన్నో సంవత్సరాల నుండి సంస్థకు సేవలందిస్తున్న పూర్వ కార్యవర్గ సభ్యులు శేషారావు బొడ్డు, సుబ్బారావు పొన్నూరు, కృష్ణ కోరాడ లను జ్ఞాపికలతో సత్కరించారు. పాలకమండలి అధిపతి ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి నూతన సభ్యులను సభకు పరిచయం చేశారు. సంస్థకు సేవ చేసిన పాలకమండలి సభ్యులు శ్రీ. శ్రీధర్ కోడెల, శ్రీ. రాం యలమంచిలి మరియు ఎన్నికల సమితి అగ్రాసనాధిపతి శ్రీ. కృష్ణ బాపట్ల గారిని పుష్పగుచ్ఛం, దుశ్శాలువ మరియు ఙ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

 

 

కార్యక్రమ సమన్వయకర్త శ్రీ. ఉరిమిండి నరసింహా రెడ్డి ఎంతో ఓపికగా ఐదుగంటల వినోదాన్ని చివరివరకు ఉండి ఓపికగా కార్యక్రమాన్ని తిలకించి ఆస్వాదించిన అతిదులకు, రుచికరమైన విందు భోజనాన్ని వడ్డించిన ప్యారడైస్ బిర్యాని పాయింట్ వారికి, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు, స్వచ్చంద కార్యకర్తలకు, కార్యక్రమ పోషక దాత లందరికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో, అట్టహాసంగా సాగిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది.

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;