RELATED EVENTS
EVENTS
తెలుగు భాషాభివృద్దికి టెక్సాస్ లో తానా వేసిన గట్టి పునాది

శనివారం,అక్టోబరు 09,2011

డాల్లస్,టెక్సాస్

అమెరికాలో సంగీత సాహిత్య సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన డాల్లస్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సహాయ సహకారాలతో పద్మవిభూషణ్ డా. మంగళం పల్లి బాల మురళీకృష్ణ గారి సంగీత లహరి కార్యక్ర మం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబడింది.. అత్యంత ఆహ్లాదంగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు వేయి మందికి తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని మాతృభూమికి దూరంగా ఉన్న లోటును మరచిపోయారు. శ్రీమతి. రాజేశ్వరి చల్లా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. 

 

పద్మవిభూషణ్ డా. మంగళం పల్లి బాల మురళీకృష్ణ గారి గానామృతంతో యూలెస్ లోని ట్రినిటీ ఉన్నత పాఠశాల సభాభవనం పులకించింది. అంతకు ముందు వేద మంత్రోచ్చారణ మరియు పూర్ణకుంభస్వాగతంతో సభాభవనం ప్రాంగణం నుండి వేదిక వరకు తానా మరియు టాంటెక్స్ కార్యవర్గ సభ్యుల నడుమ ఘన స్వాగతం పలికారు. తనువూ, మనసు పులకరించి పోయేవిధంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషినీ సంగీతంతో పునీతం చేయడానికి అవతరించిన గాన గంధర్వులు డా. శ్రీ మంగళం పల్లి అని సభకు పరిచయం చేస్తూ తానా తెలుగు భాషాభివృద్ది అధినేత శ్రీ కెసి చేకూరి అన్నారు. 

 

దాదాపు వేయి మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో తిల్లానా, మోహన రాగం, హిందోళ రాగం, పహాడీ రాగం, కుంతల వరాళి, లాంటి పాటలను బాల మురళీ కృష్ణ తనదైన శైలిలో పాడి ఆహూతులను అలరించారు. తెలుగు సహా ఇతర భాషాభిమానులు ఎందరో హాజరైనఈ కార్యక్రమం సంగీతానికి భాష తో పని లేదని నిరూపించింది. తన సంగీతంతో మూడు గంటల పాటు బాల మురళీ కార్యక్రమానికి వచ్చిన అందర్నీ కదల కుండా చేశారు. తానా ప్రాంతీయ ప్రతినిధి శ్రీమతి మంజుల కన్నెగంటి రాబోవు రెండు సంవత్సరాలలో సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు చేయూత నివ్వాలని పిలుపు ఇచ్చారు. శ్రీ రాంకీ చేబ్రోలు టెక్సస్ విశ్వవిద్యాలంలో తెలుగు బోధనకు తానా చేపట్టిన బృహత్కార్యానికి గట్టి పునాది వేయాలని అందుకు సహకరిస్తున్న తెలుగు వారికి కృతఙ్ఞతలు తెలియ జేసారు.

 

మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రవాసంలో పెద్ద పీట వేసి, ఆత్యవసర పరిస్తితులలో తెలుగువారిని ఆదుకొంటూ తూర్పు పశ్చిమాలకు వారధిగా వ్యవరిస్తున్న తానా కార్యక్రమాలను తెలుగు వారు అభినందుస్తున్నారని సంస్థ అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ తోటకూర అన్నారు. డల్లాస్‌లో 2013 జులై 4-6 వరకు నిర్వహిస్తున్న 19 వ తానా మహాసభలకు సన్నహాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలుపుతూ తెలుగువారంతో ఈ కార్యక్రమానికి చేయూత నివ్వాలని కోరారు. తానా ఫౌండేషన్ ద్వారా మాతృదేశంలో ప్రతి సంవత్సరం మిలియన్ డాలర్ల వ్యయంతో ఎన్నో సేవాకార్యక్రమాలను చేపడు తున్న విషయాన్ని సభకు తెలియ జేసారు. ఈనాటి గాన కచ్చేరి ద్వారా సేకరించిన విరాళాలను టెక్సాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష పాఠ్యక్రమానికి ఉపయోగించనున్నట్లు  శ్రీ తోటకూర సభకు తెలియ జేసారు. టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ ఎన్‌ఎమ్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ 2013 లో డల్లాస్‌లో జరగబోవు 19 వ తానా మహాసభలకు సంస్థ సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.

 

తానా అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ తోటకూర, కార్య దర్శి శ్రీ రాం యలమంచిలి, 19వ తానా మహాసభల సమన్వయ కర్త శ్రీ మురళి వెన్నం, ప్రాంతీయ ప్రతినిధి శ్రీమతి మంజుల కన్నెగంటి, టెక్సాస్ విశ్వవిధ్యాలం తెలుగు పాఠ్యక్రమాధినేత శ్రీ రాంకీ చేబ్రోలు, తెలుగు భాషాభి వృద్ది అధినేత శ్రీ కెసి చేకూరి, సభ్యత్వం ప్రతినిధి శ్రీ చలపతి రావ్ కొండ్రకుంట, టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ. ఎన్‌ఎమ్‌ఎస్ రెడ్డి, ఉత్తరాధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న, ఉపాధ్యక్షుడు శ్రీ సురేష మండువ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు డా. మంగళంపల్లిని ఘనంగా సన్మానించారు. డా. వేదాల శ్రీనివాసాచార్యులు ప్రత్యేకంగా సమర్పించిన సన్మాన పత్రం గత ఏడు దశాబ్దాలుగా డా. మంగళంపల్లి సంగీత కళకు చేసిన సేవను కొనియాడింది.

 

తానా కార్యదర్శి శ్రీ. రాం యలమంచిలి ఎంతో ఓపికగా సంగీత విభావరిని ఆస్వాదించి చివరి క్షణం వరకు సహకరించిన ప్రేక్షకులకు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నసంగీత కళాకారులకు, ముఖ్య అతిథులకు ప్రేమ పూర్వక కృతఙ్ఞతాభివందనాలు తెలియ జేసారు. కార్యక్రమానికి పోషక దాతలైన ఎ‌ఐ‌టి‌సి, హొరైజన్ ట్రావెల్స్, విందు ఇండియన్ క్విజీన్, ఒమెగా ట్రావెల్స్, ఎక్స్‌టీ గ్లోబల్, మై డీల్స్ హబ్, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్, డిస్కవర్ ట్రావెల్స్, శోభాయమానంగా వేదిక అలంకరణకు సహకరించిన సిరి ఇవెంట్స్, రేడియో ఖుషిమరియు రుచికరమైన భోజనంఅందించినందుకు విందు యాజమాన్యానికి, ట్రినిటీ ఉన్నత పాఠశాల యాజమాన్యానికి, ఆతిథ్యం అందించిన శ్రీమతి కళ్యాణి తడిమేటి కి, ప్రసార మాధ్యంలో భాగస్వాములైన ఏక్‌నజర్, టివి9, ఫన్‌ఏషియా, యువ తెలుగు రేడియో, దేసి సిటీ గైడ్, రేడియో ఖుషి లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేయడంతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన సంగీత కచ్చేరికి తెరపడింది.

TeluguOne For Your Business
About TeluguOne
;