RELATED NEWS
NEWS
అమెరికా నాలుగు దిక్కులా మనబడి విద్యార్ధుల పద్యనాటకం

 

అమెరికా నాలుగు దిక్కులా మనబడి విద్యార్ధుల పద్యనాటకం



సిలికానాంధ్ర మనబడి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి సారథ్యంలో అమెరికాలో నాలుగు నగరాలలో "పద్యనాటకం" కార్యక్రమం అద్భుతంగా జరిగింది. గుమ్మడి గారి శిక్షణతో తర్ఫీదయిన 50+ మంది మనబడి విద్యార్థులు నాలుగు ప్రధాన నగరాలలో నాలుగు పద్యనాటకాలు ప్రదర్శించి, తెలుగు పద్యనాటక పతాకాన్ని అమెరికా నాలుగు మూలలా ఎగురవేసారు.

 



మొదటగా డాలస్ లో గౌతమ్ కస్తూరి, రామారావు పాలూరి గార్ల ఆధ్వర్యంలో పిల్లలు శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం వేశారు. ఇండియన్ ఫ్రెండ్-షిప్ కౌన్సిల్ తరఫున గుమ్మడి గారికి “నట విరాట్” బిరుదునివ్వగా, పిల్లలు గుమ్మడి గారికి గురుదక్షిణగా పుష్పాలతో పాదపూజ చేసారు. ఆ తరవాత వారం న్యూ జెర్సీ నగరంలో శ్రీధర్ & మాధురి కొండుగుంట గార్ల నిర్వాహణలో శ్రీ కృష్ణ తులాభారం నాటకం చూసి ఆక్కడికి విచ్చేసిన పూర్వోక్త న్యూ జెర్సీ అసెంబ్లీ స్పీకర్ శ్రీ చివుకుల ఉపేంద్ర గారు మనబడి పిల్లల సమర్థతకి సంభ్రమాశ్చర్యాలకు గురైనానని చెప్పారు. 

 

 

మరుసటి వారాంతం లాస్ ఎంజేలీస్ నగరంలో సుధా దావులూరి గారు సంధానకర్తగా మనబడి పిల్లలు గయోపాఖ్యానం పద్యనాటకంలోని శ్రీ కృష్ణ అర్జున శపథం ఉపకథని ప్రదర్శించారు. చిలకమర్తి లక్ష్మి నరసింహంగారు పుట్టిన 150వ సంవత్సరంలో తాను వ్రాసిన గయోపాఖ్యానం నాటకం సునాయాసంగా ప్రదర్శించి తెలుగు భాషకి నిజమైన వారసులమన్నట్టుగా మనబడి పిల్లలు ప్రేక్షకులనందరినీ మెప్పించారు.

 



ఆఖరుగా ఉత్తర కరోలినాలోని కేరి నగరంలో శ్రీ కృష్ణ రాయబారం నాటకం సుబ్రహ్మణ్యేశ్వర దాసరి గారి నేతృత్వంలో ప్రదర్శించబడింది. కేరీ నగర మేయర్ మార్క్ స్టోల్‌మన్  పద్యనాటకానికి ముగ్ధులై బాలకృష్ణుడి పాత్ర ధరించిన పాత్రధారికి అభివాదం చేశారు. మనబడి విద్యార్ధుల రాగయుక్త పద్యగానం తో పాటు నేపథ్యంలో మంచి సంగీతం, కంప్యూటర్ గ్రాఫిక్స్, పాత్రోచితంగా అలంకరణ, వేషధారణలతో  - చూసేవారిని మైమరిపించే విధంగా మనబడి పద్యనాటకం కార్యక్రమం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. మనోరంజకమైన ఈ పద్యనాటకం కార్యక్రమం రవీంద్ర కూచిభొట్ల గారు ప్రధాన సంధానకర్తగా వ్యవహరించగా, ఫణి మాధవ్ గారు సృజనాత్మక నిర్దేశకునిగా, డాంజి తోటపల్లి గారు కార్యక్రమ సమన్వయకర్తగా వివిధ నగరాలలో జరిగిన కార్యక్రమాలను పర్యవేక్షించారు.


 

పద్యనాటకం తో పాటుగా, మనబడి 2016-17 విద్యాసంవత్సరం  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులైన 800+  మనబడి పిల్లల స్నాతకోత్సవ కార్యక్రమాలు ఇవే వేదికలపై జరిగాయి. పిల్లలు ఒక్కొక్కరు వచ్చి వారి వారి యోగ్యతాపత్రాలు అందుకుంటుంటే చప్పట్లతో ప్రతి చోటా ఆడిటోరియమ్ ప్రతిధ్వనించింది! డాలస్లో నాట్యవిద్యాచార్యులు దీక్షిత్ మాష్టారు గారు, కందిమళ్ల సాంబశివరావు గారు, న్యూ జెర్సీలో అసెంబ్లీమాన్ శ్రీ చివుకుల ఉపేంద్ర గారు, లాస్ ఎంజేలీస్లో గురు కొండవీటి జ్యోతిర్మయి గారు, కేరిలో నగర మేయర్ మార్క్ స్టోల్‌మన్ గారు ముఖ్య అతిధులుగా విచ్చేసి యోగ్యతాపత్రాలు అందజేశారు. పిల్లల సాఫల్యత గురించి మాట్లాడుతూ, "మీ పిల్లల్ని మనబడికి పంపడం వల్ల వాళ్ళు ఎటువంటి అద్భుతాలు సాధించగలరో తెలుసుకోవటానికి ఈ మా పద్యనాటకం కార్యక్రమం ఓ మచ్చు తునక!!" అని గుమ్మడి గోపాలకృష్ణ గారు అన్నారు.

 

 

 

ప్రవాస చిన్నారుల ద్వారా పద్యనాటకం అత్యున్నత స్థాయిని అందుకోవడం సంతృప్తిగా ఉందని, తన వారసులు అమెరికాలోనే ఉన్నారని చాటిచెపుతానని పేర్కొన్నారు. శిలికానాంధ్ర దశాబ్ది కాలంలో 27000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు నేర్పించడమే కాకుండా, మన కళలు, సంప్రదాయల పట్ల విద్యార్ధులకు అవగాహన కల్పించి, అభిరుచిని పెంచడం చేస్తోందని, మనబడిలో తెలుగు నేర్చుకునే విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణతా పత్రాలు అందించడమే కాకుండా, పలు స్కూల్ డిస్ట్రిక్ట్ లలో ఫారిన్ లాంగ్వేజ్ అర్హత సాధించడం, అమెరికా వ్యాప్తంగా ఉన్న 250 మనబడి కేంద్రాలకు ప్రతిష్టాత్మక Western Association of Schools and Colleges గుర్తింపు లభించడం మనబడి విజయాలలో ముఖ్యమైనావి అని మనబడి అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు. మనబడి 2017-18 విద్యా సంవత్సరం తరగతులు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమౌతున్నాయని, manabadi.siliconandhra.org  ద్వార మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;