RELATED NEWS
NEWS
6000 మంది విద్యార్ధులతో సరికొత్త అధ్యాయం సృష్టించిన సిలికానాంధ్ర మనబడి !


కాలిఫోర్నియా : అక్టోబర్ 14: ప్రవాసాంధ్రుల చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది సిలికానాంధ్ర మనబడి. 2015- 16 విద్యాసంవత్సర ప్రవేశాలు ముగిసే నాటికి, అమెరికా దేశ వ్యాప్తంగా 275 కి పైగా కేంద్రాలలో 6000 కు పైగా విద్యార్ధులు మనబడి లో చేరారు అని సిలికానాంధ్ర మనబడి డీన్ చమర్తి రాజు హర్షం వ్యక్తం చేసారు. మనబడి డీన్ చమర్తి రాజు మాట్లాడుతూ, 333 మంది విద్యార్ధులతో 2007 లో ప్రారంభమైన మనబడిలో , వేలాది భాషా సైనికుల సహకారంతో ఎదుగుతూ, గత సంవత్సరం కంటే 50 శాతం ఎక్కువ మంది విద్యార్ధుల నమోదు జరిగిందని, ఇందుకు కృషి చేసిన భాషా సైనికులకు, తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించేందుకు ప్రోత్సహిస్తున్న తల్లి తండ్రులకు తమ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త రాజధాని నిర్మాణం జరుగుతున్న ఈ శుభ సందర్భంగా రేపటి తరానికి తెలుగు భాష అందిస్తున్న మనబడి తరఫున శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా మనబడి కార్యనిర్వాహక సభ్యులు, శరత్ వేట మాట్లాడుతూ, ఈ సంవత్సరం దక్షిణాఫ్రికా, స్విజ్జర్ లాండ్ వంటి దేశాలతో పాటు అమెరికాలోని మరి కొన్ని  రాష్ట్రాలలో సహా 25కు పైగా కొత్త కేంద్రాలు ప్రారంభమైనాయని, తెలిపారు.  మనబడి ప్రణాళికా సంఘం అద్యక్షులు శాంతి కూఛిభొట్ల ఆధ్వర్యం లో మనబడి అందిస్తున్న నాణ్యమైన విద్యా విధానమే ఇందుకు కారణమని తెలిపారు. ఆర్ధిక శాఖ అధికారి దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ, మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వ విద్యాలయం ఆమోదించిన బోధనా ప్రణాళికను అనుసరించి స్వీయ ముద్రణ చేసిన మనబడి పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని, ప్రతి సంవత్సరం, వారికి తెలుగు సంస్కృతి, కళల పట్ల అవగాహన కలిగించడానికి మనబడి సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నామని, రేడియోలో బాలరంజని వంటి కార్యక్రమాలు, తెలుగు మాట్లాట వంటి భాషా పటిమ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిలికానాంధ్ర మనబడి కార్యనిర్వహణ బృందసభ్యులు  శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, వేణు ఓరుగంటి, శిరీష చమర్తి, శ్రీ వల్లి కొండుభట్ల, అనిల్ అన్నం, ఫణి మాధవ్ కస్తూరి, మనబడి సాధించిన ఈ అభివృద్ధి పట్ల తమ సంతోషం వ్యక్తం చేసారు, మనబడి గురించిన మరిన్ని వివరాలకు http://manabadi.siliconandhra.org చూడవచ్చని, 5 సంవత్సరాల లోపు పిల్లలు సంవత్సరం లో ఎప్పుడైనా,  బాలబడి లో చేరవచ్చని తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;