RELATED NEWS
NEWS
ఇల్లినాయిస్‌లో మనబడి ద్వితీయ వార్షికోత్సవం



అమెరికాలోని ఇల్లినాయిస్  సిలికానాంధ్ర మనబడి ద్వితీయ వార్షిక సాంస్కృతికోత్సవాలు లెమాంట్ హిందూ దేవాలయం ఆడిటోరియంలో 14 మార్చ్  2015, శనివారంనాడు తెలుగు వారి సాంస్కృతిక, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎంతో వేడుకగా, సంబరంగా జరిగాయి.  మనబడి విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని మన ఊరిని,పాత రోజులని గుర్తుకు తెచ్చారు. సిలికానాంధ్ర  మనబడి అంతర్జాతీయ విభాగం నుండి కొండుభట్ల దీనబాబు, కడియాల మాధవి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం చికాగో విచ్చేశారు.

విద్యార్థుల శోభాయాత్రతో కార్యక్రమం ప్రారంభించగా, తెలుగు భాషాజ్యోతిని పెద్దతరం వారు భావితరాలకు అందించారు. ఆచార్య ధర్మారావు వేదప్రవచనంతో అందరినీ ఆశీర్వదించారు.



ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అరోరా, షాంబర్గ్, వెస్ట్ మాంట్, వెస్ట్ డండి, బోల్లింగ్ బ్రూక్, బఫెలో గ్రోవ్, బ్లూమింగ్టన్ కేంద్రాల మనబడి విద్యార్థులు 150 మందికి పైగా ఈ సాంస్కృతికోత్సవాలలో పాల్గొని తమ తెలుగు భాష ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. 500 మందికి పైగా విచ్చేసిన తెలుగు భాషాభిమానులు, మనబడి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఆయా సాంస్కృతిక కార్యక్రమాలకి చిన్నారులే వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

 



 అక్బర్-బీర్బల్, అక్షయపాత్ర, అత్యాశకు పోతే అంతా నష్టమే,అమ్మా నొప్పులే, ఇరుగు పొరుగు, ఐకమత్యమే మహాబలం, భక్త పోతన, భువనవిజయం, మనబడిలో ఒక రోజు, మిత్రలాభం, రంగుల కలహం, రాజుగారి ఏడుగురు కొడుకులు, రామాయణం, సత్యమేవ జయతే లాంటివి మచ్చుకకు కొన్ని నాటికలు. ఇంకా తెలుగు సాంస్కృతిక పాటలు, భారతదేశపు ఉనికి, గుర్తింపుకు మూలమైన గొప్ప వ్యక్తుల యొక్క పలుకులను మళ్ళీ మనకు గుర్తుచేశారు.

 



తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో (TAGC), ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ (TTA), చికాగో తెలుగు అసోసియేషన్ (CTA), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA), తెలుగు అసోసియేషన్  అఫ్ బ్లూమింగ్టన్-నార్మల్  (TAB) వారు మనబడి విద్యార్థులను,  ఉపాధ్యాయులను, సమన్వయకర్తలను, కార్యకర్తలను అభినందించి తెలుగు బాషను భావి తరాల వారికి అందిస్తున్న సిలికానాంధ్రవారికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు.

 



అతిథులందరికి కరైకూడి రెస్టారెంట్ వారు  పసందైన విందుభోజనం అందించారు. వందన సమర్పనతో కార్యక్రమం సుసంపన్నం అయింది.

TeluguOne For Your Business
About TeluguOne
;