RELATED NEWS
NEWS
దక్షిణ టెక్సాస్ మనబడి రెండవ సాంస్కృతికోత్సవం



శాన్ అంటోనియో సిలికానాంధ్ర మనబడి నిర్వాహకులు శ్రీమతి ఉషా గోవిందరాజులు ఆధ్వర్యంలో  దక్షిణ టెక్సాస్ రెండవ సాంస్కృతికోత్సవం మార్చ్ 7 శనివారం టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ అంటోనియో హిందూ ఆలయంలో ఘనంగా, అద్భుతంగా, ఒక పండగలా జరిగింది. చుట్టు పక్కల ఊర్ల నుంచి చాలా మంది విద్యార్థుల తల్లితండ్రులు వ్యయ ప్రయాసలకి వెరవకుండా దీనికి హాజరవ్వడం విశేషం. కార్యక్రమ ప్రాంగణం మొత్తం తెలుగు వాతావరణం ప్రతిబించేటట్టు నిర్వాహకులు అలంకరించారు.  సిలికానాంధ్ర మనబడి అభివృద్ధి విభాగ ప్రతినిధి గోపాల గూడపాటి కార్యక్రమ సంధానకర్త గా వ్యవహరించారు. వందలాది ఆహూతుల నడుమ హ్యుస్టన్, ఆస్టిన్, శాన్ అంటోనియో నుంచి వచ్చిన మనబడి  పిల్లల శోభ యాత్రతో ఘనంగా ప్రారంభం అయింది.

తదుపరి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు అందరు కలిసి తెలుగు భాషాజ్యోతిని వేదిక పైకి తీసుకువచ్చి బాల గురువులకి అందించారు. భాషా సేవయే భావి తరాల సేవ అని నినాదంతో సిలికానాంధ్ర మనబడి అమెరికా సంయుక్త రాష్టాలలో  30 కి పైగా రాష్టాలలో మనబడి నిర్వహిస్తున్నదని గోపాల గూడపాటి  ప్రారంభ ఉపన్యాసం చేశారు.


రెండవ దక్షిణ టెక్సాస్ సాంస్కృతికోత్సవంలో శాన్ ఆంటోనియో, హ్యుస్టన్ నగరంలోని క్లియర్ లేక్, కేటీ, పియర్ ల్యాండ్, షుగర్ ల్యాండ్, ఆస్టిన్ నగరంలోని సిడార్ పార్క్, రౌండ్ రాక్, స్టైనేర్ రాంచ్, టెంపుల్‌కి చెందిన దాదాపు 200 మంది మనబడి పిల్లలు పాల్గొన్నారు. లక్ష్మి ముక్కవిల్లి, సత్యం దొడ్డ వేదికపై సమన్వయం చేసుకుంటూ  సాంస్కృతికోత్సవకార్యక్రమాల్ని రక్తి కట్టించారు. శ్రీదేవి అల్లం బృందం సాంకేతిక సహకారం అందించారు


ఈ సందర్భంగా మనబడి చిన్నారులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. దాదాపు 5 గంటలు సాగిన ఈ సాంస్కృతికోత్సవంలో తాతయ్య-తెలుగు, లటుకు చిటుకు , కోతి ఢాం ఢాం ఢాం, సంక్రాంతి సంబరాలు, భూకైలాసం, రేడియో తరంగాలు, తెనాలి రామకృష్ణ, బామ్మగారి ఆవకాయ రభస, తెలుగు వెలుగులు లాంటి నాటికలు, చక్కటి తెలుగు పద్యాలు, పాటలు, కూచిపూడి,  భరతనాట్యం, జానపద సృత్య రీతులతో కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నారు. మనబడి విద్యార్థుల తెలుగు ఉచ్ఛారణకి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావటం కనిపించింది.


సాంస్కృతికోత్సవంలో భాగంగా దక్షిణ టెక్సాస్ మొట్టమొదటి స్నాతకోత్సవం  సిలికానాంధ్ర మనబడి అభివృద్ధి విభాగ ప్రతినిధి గోపాల గూడపాటి ఆధ్వర్యం లో  జరిగింది. విశిష్ట అతిధులుగా  అమెరికా హాస్య బ్రహ్మ బిరుదాంకితులు, ప్రముఖ రచయిత వంగూరి చిట్టెన్ రాజు, సాహితీవేత్త దేవగుప్తపు శేషగిరిరావు విచ్చేసారు. వారి చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు గత సంవత్సరం నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు అయిన ఇద్దరు విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు అందుకున్నారు. మనబడి గురువులు ఉషా గోవిందరాజులు, ప్రసన్న మేడిశెట్టి గారు కూడా ఈ స్నాతకోత్సవంలో పాలు పంచుకున్నారు.

ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన దాతలని వేదిక పైన గౌరవించి, నిర్వాహకులు వారి దాతృత్వాన్ని వేనోళ్ళ కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా టెక్సాస్ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు అఫ్సర్ విచ్చేసి మనబడి చేస్తున్న కార్యక్రమాలని గురించి  తెలిపారు.

 



శాన్ అంటోనియో మనబడి నుంచి శ్రీమతి ఉషా గోవిందరాజులు, శ్రీదేవి అల్లం, విజయ గోసాల  ఆద్యంతం కార్యక్రమాన్ని ఆటంకం లేకుండా నిర్వహించారు.  కృష్ణవేణి భాగవతుల,  వేణుగోపాల్ బుర్ల, రమేష్ మొక్కల, సుమ పోకల, సుబ్బారెడ్డి తదితర మనబడి నాయకుల సహకారంతో కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. కార్యక్రమ ప్రాంగణం అంతా ఆహూతులతో, మనబడి చిన్నారుల తల్లితండ్రులతో కిక్కిరిసిపోయింది. చప్పట్లతో, కేరింతలతో మనబడి పిల్లలని ఉత్సాపరచటం కనిపించింది.

జనగణమన తో​దక్షిణ టెక్సాస్ సిలికానాంధ్ర మనబడి రెండవ సాంస్కృతికోత్సవం పూర్తి అయినట్లుగా కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించారు. పావని రెస్టారెంట్ వారు అందించిన రుచికరమైన విందు భోజనంతో కార్యక్రమం  ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;