RELATED NEWS
NEWS
సిలికానాంధ్ర మనబడి వార్షిక సదస్సు 2014.

 

గత ఏడేళ్ళుగా ఒక నగరంనుంచి విశ్వసరిహద్దులకి ఎదిగిన సిలికానాంధ్ర మనబడి ఇప్పుడు అమెరికాలో 30 రాష్ట్రాలలో , మొత్తం పది విదేశాలలో దాదాపు మూడువేల మంది బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఏకైన తెలుగు బోధనా వేదిక. ఇలా ప్రపంచాన్ని తెలుగుమయం చేస్తూ, మనప్రాచీన భాషని ప్రపంచభాష చేస్తూ, ఒక అంతర్జాతీయ తెలుగుబోధనా యంత్రాంగంగా కొనసాగాలి అంటే ఎన్నో వందలమంది మేధస్సు, కృషి, శ్రమ, అన్నిటికంటే విలువైన సమయం జోడవ్వాలి. వేసవిలో మనబడి పిల్లలకు సెలవులైనా, అందులో స్వచ్చంద సేవచేసేవారు రాబోయే విద్యా సంవత్సరానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యడంలో తలమునుకలై ఉన్నారు.

 

అందులో ముఖ్యమైన ప్రక్రియగా మనబడి గురువులు, సమన్వయ కర్తలు, సంధానకర్తలు అందరూ తమ తమ కుటుంబాలనుంచి విలువైన సమయాన్ని కేటాయించి, ఈ రాబోయే వారాంతం బే ఏరియాలో. శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే "మనబడి సదస్సు"లో పాల్గొంటున్నారు! దాదాపు 200 మంది పాల్గొనే ఈ సదస్సులో గత విద్యాసంవత్సరం సాధించిన ఫలితాల విశ్లేషణ, తల్లితండ్రుల అభిప్రాయ సేకరణలో (సర్వే) తెలిసిన విషయాలు, భవిష్యత్ ప్రగతికోసం క్రియాశీలక వ్యూహ రచన, వివిధ కార్యక్రమాలని మెరుగులు దిద్దుకోవడానికి మేధోమథనాలు నిర్వహిస్తారు. అచ్చమైన తెలుగుదనంతో జరిగే ఈ సదస్సులో విలువైన సమయాన్ని పాఠ్యపుస్తకములలో వివిధ కీలక అంశాలని పిల్లలకు నేర్పే పద్దతుల గురించి వివరణ, చర్చలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ గేయ రచయిత, మనబడి "అభిమాన అధిపతి" (బ్రాండ్ అంబాసిడర్) సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు మనబడి జట్టుని ఉద్దేశ్యించి కీలక ప్రసంగం ఇచ్చి, ముఖ్య అతిథిగా వ్యవహరిస్తారు. ఇంకా ప్రముఖ తెలుగు భాష పరిశోధకులు డాక్టర్ రావి రంగారావు గారు, మనబడి సదస్సుకి మరొక విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు. "పిల్లలలో సృజన" అనే అంశం మీద కీలక ప్రసంగం కూడా, మనబడిలో చదువు చెప్పేవారికి భాషాశాస్త్రపరిజ్ఞాన వికాసానికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.



ప్రతి సంవత్సరం మెరుగులు దిద్దుకుంటూ మనబడి కార్యక్రమం అత్యంత విజయవంతంగా నడవడానికి మూలకారణాల్లో ఈ "మనబడి సదస్సు" ఒకటని, మనబడి డీన్/కులపతి చమర్తి రాజు గారు తెలిపారు. అందుకు హాజరవుతున్న జట్టు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. జయంతి కొట్ని, మరియి శ్రీరాం కొట్ని ఈ మనబడి సదస్సుకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా, ఎందరో వివేకవంతులు, ప్రతిభావంతులైన నాయకులు కలిసికట్టుగా పనిచేసే తీరుతో స్ఫూర్తి పొంది, ఈ ఏడాది 5000 మంది పిల్లలకి తెలుగు నేర్పాలనే లక్ష్యసాధనకి జట్టుకట్టవలసినదిగా మనబడి ప్రాచుర్యం ప్రతినిధి రాయవరం భాస్కర్ తోటి తెలుగువారందరికీ పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ మూలనైనా మనబడి మొదలు  పెట్టగలిగే సౌకర్యం ఉంది. మరిన్ని వివరాలకోసం manabadi.siliconandhra.org.

TeluguOne For Your Business
About TeluguOne
;