RELATED ARTICLES
ARTICLES
నాట్స్ పై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రశంసల వర్షం



భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ ఇస్తున్న మద్దతు అభినందనీయమన్నారు. తెలుగునాట కూడా నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగుసంబరాలకు ఆహ్వానం పలికేందుకు నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ టి.జి. విశ్వప్రసాద్, సి.టి ఏ. నాట్స్ ప్రతినిధి శ్రీధర్ ముంగండి తదితరులు ఢిల్లీలో అశోక్ గజపతిరాజును కలిసి సంబరాలకు ఆహ్వానించారు.. సేవాపథంలో నడిచే నాట్స్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. అమెరికాలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను భారత్ కు రప్పించడంలో నాట్స్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా విమానాల ద్వారానే తాము  అమెరికా నుంచి ఇండియాకు పార్థీవ దేహాలను తరలిస్తున్నామని .. అయితే దీనికి అయ్యే ఖర్చులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నాట్స్ ప్రతినిధులు కేంద్రమంత్రిని కోరారు. ఈ విషయంలో తన పూర్తి మద్దతు ఉంటుందని  అశోక్ గజపతి రాజు హామీ ఇచ్చారు. ఇక ముందు ప్రయివేట్ ఎయిర్ లైన్స్ ద్వారా కూడా పార్థీవ దేహాలను తరలించేందుకు తన వంతు సాయం చేస్తానని అశోక్ గజపతిరాజు హామీ ఇచ్చారు.

 

నాట్స్ సంబరాలకు రావాలన్న ఆహ్వానంపై కూడా అశోక్ గజపతి రాజు సానుకూలంగా స్పందించారు.ఆ తర్వాత నాట్స్ ప్రతినిధులు సుప్రీం కోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావును కలిశారు. తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్నందుకు తమకు ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా నాట్స్ ప్రతినిధులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అటు న్యాయవాద వృత్తితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే లావు నాగేశ్వరరావు నాట్స్ సేవాపథాన్ని ప్రశంసించారు. సంబరాలకు రమ్మంటూ నాట్స్ ఇచ్చిన ఆహ్వానం పై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;