RELATED EVENTS
EVENTS
డల్లాస్ లో ఆటా వారి సంగీత విభావరి

అలనాటి మేటి సంగీత దర్శకత్రయం కేవీ మహాదేవన్, సత్యం, ఇళయరాజాల ఆణిముత్యాలలాంటి పాటలను ఎంచుకొని "మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు - ట్రినిటీ కాన్సర్ట్" పేరిట అమెరికన్ తెలుగు అసోసియేషన్, పాతపాటల పర్ణశాలైన చిమటమ్యూజిక్ మరియు స్థానిక తెలుగు అసోసియేషన్ టాంటెక్స్ తో కలిసి వందలాది తెలుగు పాతపాటల సంగీతాభిమానుల మధ్య డాలస్ నగరంలోని కోపెల్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో జూన్ 4న కన్నుల పండుగగా నిర్వహించింది. గానగంధర్వుడు యస్పీ బాలు గారి జన్మదిన సందర్భంగా బాలు వీరాభిమానులందరూ కలిసి ఈ సంగీత విభావరిని జరపుకోవటం ఒక విశేషం.

మాజీ ఆటా అధ్యక్షురాలైన గవ్వ సంధ్య మరియు హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ జ్యోతి ప్రజ్వలన చేయగా, ఆటా ప్రతినిధి ముప్పిడి అరవింద్ రెడ్డి తన స్వాగతోపన్యాసంతో కార్యక్రమానికి శుభారంభం కావించారు. ఈ సంగీత విభావరి నిర్వహణలో కీలక పాత్ర వహించిన జువ్వాడి రమణ, చిమట శ్రీనివాస్ తమ ప్రారంభోపన్యాసాల్లో ఈ కార్యక్రమాన్ని ముగ్గురు సంగీత దర్శకుల పేరిట తమలాంటి సంగీతాభిమానులు చేసుకుంటున్న స్వరార్చనగా అభివర్ణించారు.

డల్లాస్ లో ఆటా వారి సంగీత విభావరి

ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసిన గాయకుడు రాముతో కలిసి అమెరికాలో ప్రముఖ గాయనీ గాయకులుగా పేరు గాంచిన ఆకునూరి శారద ,ఉప్పులూరి దీపిక మరియు నారాయణన్ రాజులు తమ గాన మాధుర్యంతో డాలస్ తెలుగువారిని సంగీత సాగరంలో ఓలలాడించారు. అమెరికాలోనే అత్యంత నాణ్యమైన చిమటమ్యూజిక్ ఆర్కెష్ట్రా అద్భుతంగా వాద్య సహకారం అందించడం ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులందరూ మంత్ర ముగ్దులై ఆద్యంతమూ ప్రతీ పాటను ఆస్వాదిస్తూ కరతాళ ధ్వనులతో గాయనీ గాయకులకు, వాద్యకారులకు తమ అభినందనలను తెలియ చేశారు. పలువురు పురప్రముఖులు ఇలాంటి అద్భుతమైన సంగీత విభావరి డాలస్ నగరంలోనే మొట్టమొదటిసారిగా జరిగిందంటూ నిర్వాహకులను కొనియాడారు.

కార్యక్రమానికి ముందుగా ముగ్గురి సంగీత దర్శకుల పాటల మీద ఒక పాటల పోటీని నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమం మధ్యలో గాయనీ గాయకులైన రాము, శారదలకు వారు గత 15 యేళ్ళగా చేస్తున్న సంగీత సేవకు గౌరవార్ధం నిర్వాహకులు ఘనంగా సన్మానం జరిపారు. తరువాత యస్పీ బాలు గారి జన్మదిన సందర్భంగా పెద్ద కేక్ ని కట్ చేసి "లాంగ్ లివ్ బాలు" అంటూ వందలాది అభిమానులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

కార్యక్రమాంతంలో ఆటా బోర్డ్ మెంబర్ సతీష్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, నిర్వహణలో జువ్వాడి రమణ, చిమట శ్రీనివాస్, అరవింద్ రెడ్డిలకు సహకరించిన స్పాన్సర్లకు, యువ మీడియా, ఏక్ నజర్ సంస్థలకు, ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా కాలిఫోర్నియా నుండి వచ్చిన చిమటమ్యూజిక్ ప్రతినిధులు ఈడూరి రమణ, మంత్రాల సురేష్ లకు, కార్యక్రమ నిర్వహణలో సహకరించిన తోటకూర ప్రసాద్, ఎన్ ఎం ఎస్ రెడ్డి, ఉప్పులపాటి కృష్ణా రెడ్డి, జూజారే రాజేశ్వరి, నసీం షేక్, రాజేంద్ర నారాయణ్ దాస్, చిలుకూరి రాజేష్ , అజయ్ రెడ్డి, అనంత్ పజ్జూర్, సురేష్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, భాను చౌదరి, మల్లవరపు అనంత్, తుమ్ములూరి శంకర్, మేరెడ్డి మహేశ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;