ARTICLES
నైజీరియాలో ప్రవాసాంధ్రుల సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ సంబరాలు

 

‘ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అనే హితవచనాన్ని నైజీరియాలో ఉన్న ప్రవాసాంధ్రులు అక్షరాల పాటిస్తూ సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నైజీరియాలో తెలుగు వారందరూ కలిసి స్థాపించుకొన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా (టాన్) అద్వర్యంలో జనవరి 26న అపాప లాగోస్ లోగల హోటల్ కర్మలో వేడుకగా జరుపుకొన్నారు. టాన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ శ్రీకాంత్ వసిష్ఠ, శ్రీమతి సుచరిత వసిష్ఠ మరియు టాన్ ఉపాధ్యక్షులు శ్రీ చెరువు శ్రీనివాస్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి.

 

టాన్ చైర్మన్ మరియు ట్రస్టీ అయిన శ్రీ యం.యన్. రావు దంపతులు సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనం చేసి ఆరంభించారు. తరువాత వినాయక ప్రార్ధన, వందేమాతరం ఆలపనతో సభా కార్యక్రమాలు మొదలయ్యాయి. టాన్ అధ్యక్షులు శ్రీ పీ. శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తూ నైజీరియాలో కూడా తెలుగు వారందరూ కలిసి ఈవిధంగా సంక్రాంతి, గణతంత్రదినోత్సవ వేడుకలను జరుపుకోవడం తనకి చాలా ఆనందం కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించే ముందుగా తన నటనతో, వ్యక్తిత్వంతో తెలుగు సినిమాకు కొత్త వన్నెలద్దిన ప్రముఖనటుడు  డా.అక్కినేని నాగేశ్వర రావుగారి మరణానికి సభ్యులందరూ సంతాపం తెలుపుతూ శ్రద్దాంజలి ఘటించారు. తరువాత మాస్టర్ తన్మయ్ కీ బోర్డుపై “సారే జహాసే అచ్చా..’ దేశభక్తి గీతం వాయిస్తుంటే మువన్నెల జెండాలు చేత పట్టుకొని చిన్నారులు స్టేజిపై డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించారు.

 


 

ఆ తరువాత టాన్ లోగోను, సభ్యత్వ కార్డులను విడుదల చేసి, టాన్ అధికారిక వెబ్ సైట్- www.tan.com.ng ను కూడా ప్రారంబించారు. టాన్ లోగోను టాన్ ట్రస్టీ శ్రీ పీ.వీ.యస్. సాగర్ దంపతులు విడుదల చేయగా, వెబ్ సైటుని టాన్ ట్రస్టీ శ్రీ వి.యస్. రెడ్డి దంపతులు ప్రారంభించారు. శ్రీ శ్రీనివాస రెడ్డి దంపతులు సభ్యత్వ కార్డులు విడుదల చేసారు.
 

సంక్రాంతి సందర్భంగా జనవరి 19న జరిగిన డ్రాయింగ్ మరియు ముగ్గుల పోటీలో విజేతలకు శ్రీ పీ.యస్. బాలు మరియు శేషగిరి రావు బహుమతులు అందజేయడంతో సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. ఆ తరువాత పిల్లలు, మహిళలు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, పాటలు, ఏకాపాత్రభినయం మరియు అనేక రకాల వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. ఆ తరువాత టాన్ వేడుకలకి హాజరయిన వారి కోసం పసందయిన విందు భోజనం ఏర్పాటు చేసింది.

 


 

ఈ వేడుకల ముగింపు సందర్భంగా ప్రసంగించిన టాన్ జనరల్ సెక్రెటరీ శ్రీ ప్రవీణ్ కుమార్ ఈ వేడుకలకు కుటుంబాలతో సహా హాజరయిన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొంటూ, మున్ముందు టాన్ ఇటువంటి కార్యక్రమాలను మరిన్నినిర్వహించి నైజీరియాలో తెలుగువారినందరినీ ఒకరితో మరొకరిని అనుసంధానం చేస్తుందని అన్నారు. అనంతరం జాతీయ గీతం జనగణమన ఆలపనతో సభ, వేడుకలు ఘనంగా ముగిసాయి.
 

ఈ సందర్భంగా టాన్ అధ్యక్షులు శ్రీ పీ. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంత చక్కగా నిర్వహించిన కమిటీ సభ్యులు శ్రీ ఈ.శివ కృష్ణా రెడ్డి, శ్రీ. అప్పాజీ, శ్రీ డీ. శ్రీనివాసరావు, శ్రీ పీ.వెంకటేష్, శ్రీ.సురేష్, శ్రీ.నాగిరెడ్డి, శ్రీ. ప్రవీణ్, శ్రీ. ప్రవీణ్ అట్లూరి, శ్రీ.పవన్ కుమార్, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి కీర్తి, శ్రీమతి వర్ధినిలను అభినందించారు.  

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;