LATEST NEWS
  అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలని అధిగమించాలన్నా.. అక్కడి సమస్యల్ని పరిష్కరించాలన్నా అదంత సులభం కాదని అందరికి తెలిసిన విషయమే. ఈ సంగతి వైసిపి అధిష్టానానికి చాలా కొద్దిరోజులోనే అర్థమైంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా అభివృద్ధి మీద మూడు రివ్యూ లు జరిగాయి. అందులో ఒకటి జిల్లా మంత్రి శంకర నారాయణ ఆధ్వర్యంలో, మరొకటి పాత ఇంచార్జి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆధ్వర్యం లో, మూడవది ప్రస్తుత ఇన్ చార్జి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి.ఇలా ముచ్చటగా మూడు మీటింగ్ లు జరిగితే మూడు మీటింగ్లలోనూ సేమ్ సీన్. ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరించారు. అంతకుముందు జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో కూడా అంతే జరిగింది. నీటి విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా తగ్గడం లేదు.  అనంతపురం జిల్లాకు ఉన్న నీటి వనరుల్లో ప్రధానమైనవి రెండు. ఒకటి తుంగభద్ర ఎగువ కాలువ అయిన హెచ్చెల్సీ, రెండోది శ్రీశైలం బ్యాక్ వాటర్ మీదుగా ఏర్పడిన హంద్రి నీవా ప్రాజెక్టు. ఈ రెండే జిల్లాకు ప్రధానమైన ఆధారం. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు నీరు కావాలని డిమాండ్ పెట్టడంతో మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే కొత్త ఇన్ చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం వచ్చి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలంటే తమ నియోజకవర్గానికి కావాలంటూ మైకందుకుని అందరూ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలిచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వైసిపి నేతలే ఉండటంతో నేతల మధ్య పరస్పర సమన్వయం లేదని సమాచారం.దీంతో ఇన్ చార్జి మంత్రికి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోడంతో మంత్రి కొంత అసహనానికి గురయ్యారు. మొత్తం మీద అనంతపురం ఎమ్మెల్యేల తీరు పై వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.  
  సీఎం జగన్ స్థానిక ఎన్నికలకు సమర భేరిని మోగించారు. బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. విపక్షాలు ఎంత విమర్శించినా ఆంగ్ల మాధ్యమంపై అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదన్నారు. అక్రమ లేఅవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం సిద్ధంగా ఉండండి అంటూ మంత్రులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేశారు. క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన స్పష్టత ఇచ్చారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో అధికారిక అజెండా అంశాలు ముగిశాక రాజకీయ అంశాల పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులతో పలు అంశాలను ప్రస్తావించారు జగన్. అమ్మవడి కార్యక్రమాన్ని వాస్తవానికి జనవరి 26వ తేదీన నిర్వహిద్దామని అనుకున్నాం కానీ అదే నెల జనవరి 9వ తేదీన చేపడతామని అనుకోలేదన్నారు. తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేల నగదును అందింస్తామని ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిన వెంటనే రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించి పాలనపై ప్రజాభిప్రాయం కోరనున్నట్లు తెలిపారు. జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం అని వెల్లడించారు.మంత్రులు.. ఎమ్మెల్యేలు.. స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. ఈ నెలాఖరులోగా ఆలయ కమిటీ లు మార్కెట్ కమిటీలు వేయాలని మంత్రులను మరోసారి సీఎం ఆదేశించారు.గత కేబినెట్ భేటీలో ఇదే విషయాన్ని చెప్పిన సీఎం జగన్ బుధవారం నాటి మంత్రి వర్గ సమావేశంలోనూ దీని పై కర్తవ్య బోధ చేశారు. జిల్లా సమీక్షా సమావేశాలను త్వరగా పూర్తి చేయాలని ఇన్ చార్జి మంత్రులను ఆదేశించారు. ఆలయ కమిటీ లు మార్కెట్ కమిటీలను వేయాలని చెప్పారు. ఇందులో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించాలని ఈ మొత్తం లోనూ యాభై శాతం మహిళలు ఉండేలా చూడాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.ఇన్ చార్జ్ మంత్రులు వారికి కేటాయించిన జిల్లాలో నాలుగు రోజులు ఉంటారో, అయిదురోజులూ ఉంటారో తనకు తెలియదని ఈ నెలాఖరులోగా జిల్లాలోని ఆలయ కమిటీ లను, మార్కెట్ కమిటీల భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 34 శాతం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలులో ఉందని.. మిగిలిన 66 శాతం పాఠశాలల్లోనూ అమలు చెయ్యాలని తీర్మానించింది. ఈ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. పోటీ ప్రపంచంలో ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల భాషను అందరూ నేర్చుకుంటున్నారని కొందరు ఎనిమిదవ తరగతి, కొందరు ఇంటర్, డిగ్రీ, మరికొందరు పీజీ ఇలా ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలోకి వెళుతున్నారన్నారు. అయితే సంగ్రహణ సామర్థ్యం బాల్యం నుంచే ఎక్కువగా ఉంటుంది గనుక ఒకటో తరగతి నుంచి పెడితే పేదపిల్లలు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అని మంత్రి వివరించారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. పిల్లలు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాతృభాష తెలుగు లేక ఉర్దూ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందని మిగతా సబ్జెక్టుల మాత్రం ఆంగ్ల భాషలో బోధిస్తారని తెలిపారు.
  ఏపీలో సర్కారు బడులకు మహర్దశ వచ్చింది, మరో బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నాడు నేడుతో విద్యారంగంలో సమూల మార్పులు, తొమ్మిది రకాల కనీస వసతులతో సర్కారు బడులకు మహర్దశ, తొలి దశలో 15715 పాఠశాలల్లో అమలు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీలోని సర్కారు బడుల రూపురేఖలు మారిపోనున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేరువ చేసేందుకు జగన్ సర్కార్ మూడు విడతల్లో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నడుం బిగించింది. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మార్పు తరవాత అదే పాఠశాలల పరిస్థితిని కళ్లకు కట్టేలా ఫొటోలు తీసి మరీ ప్రజల ముందు ప్రదర్శిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం ద్వారా ఈ కార్యక్రమంపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల లేమి అనే మాట వినిపించకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్, మునిసిపల్, పాఠశాల విద్య, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జువైనల్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 44512 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 33797 ప్రాథమిక, 4215 ప్రాథమికోన్నత, 6510 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. తొలి దశలో రాష్ట్రంలోని 17715 పాఠశాలలను ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇందులో 9795 ప్రాథమిక, 3110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2810 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో అధికంగా విద్యార్థులున్న పాఠశాలలను నాడు నేడు కార్యక్రమంలోని మొదటి దశలో ఎంపిక చేశారు. వీటితో పాటు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, నూతనంగా నిర్మించాల్సిన పాఠశాలలు అసంపూర్తిగా ఉన్న పాఠశాలలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా ఉన్నత పాఠశాలల్లో 250 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు కూడా మొదటి దశలో అవకాశం కల్పించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకు రావడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా తీర్చి దిద్దాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విద్యతో పాటు ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లు ప్రాధాన్యతగా తీసుకోవాలని, అలాగే జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
  చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాంటి భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక ఫండ్ ను ఏర్పాటు చేసి ఆ ఫండ్ ద్వారా ఏ కుటుంబానికైనా ఆపద వస్తే ఆదుకోవటం ఏ రంగానికైనా ఇబ్బంది వస్తే ఆ రంగాన్ని ఆదుకోవటం, అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దురదష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. అనారోగ్యంతో చనిపోతే రెండు లక్షలు, ప్రమాదవశాత్తూ చనిపోతే అయిదు లక్షల రూపాయలు అందించటం వల్ల పేద వర్గాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఏ ఇబ్బందులూ లేకుండా ఉన్నాయి.ఇంట్లో తల్లి లాంటి ప్రభుత్వాన్ని వదులుకొని ఏదో కొత్త పెళ్లి కూతురు కోసం కొత్త పెళ్ళాం కోసం మోజు పడినట్టుగా ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఇవాళ అదే భస్మాసురహస్తంలాగా మానెత్తి మీద చేయిపెట్టాడు అని ఒక కార్మికుడు కడుపు మంటతో మాట్లాడుతున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె రాజుగారు ఒక్క భవన నిర్మాణ రంగం అంటే ఒక తాపీ మేస్త్రి, ప్లంబరో, ఒక కార్పెంటరో ఒకటైల్స్ వేసేవాళ్లో ఒక  ఎలక్ట్రిషన్ ఏ కాదు,దాదాపు అనేక వంద సంస్థలపై నా ఈ రంగం మీద ఆధారపడి వుంటాయని దాంట్లో ఒకటి పెయింటర్స్ రంగం ఇలా ఎన్నో సోషల్ యూనియన్లు  కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కష్టాల కూడ చెప్పుంటారు. వీళ్లందరూ ఈ సమస్యలు సుడిగుండంలో పడటానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి  మరియు ఒకే ఒక్క ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అని ఆరోపించారు.తాన తప్పు వల్ల ఇవ్వాల అందరూ ఒక పెయింట్ షాప్ అంటే కేవలం ఆయన ఒక్కడే కాదు బతికేది ఆయన దగ్గర ముఠావాళ్ళు కూడా బతుకుతారు, గుమస్తాలు,మేస్త్రీలు బతుకుతారు. ఎన్నో రంగాల్లో ఎంతమంది వ్యక్తులు ఆ పెయింట్ షాప్ మీద ఆధారపడి బతికే పరిస్థితులో దాదాపు ఏడు నెలల నుంచి ఇవాళ వాళ్ళు ఏ వ్యాపారం లేకుండా పోయిందంటే కనీసం భవిష్యత్తులో అయిన బావుండదంటే అది కూడా లేకుండా ఇష్టారీతిన పరిపాలన కొనసాగుతోందని పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజుగారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
  డంపింగ్ యార్డుల్లో ఇసుక ఉంది. కానీ ప్రభుత్వ వెబ్ సైట్ లో మాత్రం ఇసుక లేదు. కృత్రిమ ఇసుక కొరతకు బ్లూఫ్రాగ్ సంస్థ కారణమా ? బ్లూఫ్రాగ్ సంస్థ వెనుక ఎవరైనా ఉన్నారా? వీటిని వెలికి తీసే పనిలో ఉంది సిఐడి. ఇసుక సరఫరా పారదర్శకంగా జరగాలని ఏపీ సర్కారు ప్రయత్నిస్తుంది. అక్రమ మార్గాలు అనుసరిస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇసుక కొరత వల్ల లక్షల మంది ఎదుర్కుంటున్న ఇబ్బందుల పై గురి పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఈ సమయంలో వెబ్ సైట్ హ్యాకింగ్ ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్న వ్యవహారం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.  వరదల ప్రభావంతో డిమాండ్ కు సరిపడా ఇసుక సరఫరా జరగటం లేదని ప్రభుత్వం అంగీకరిస్తోంది. అదే సమయంలో యార్డుల్లో ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ ఆన్ లైన్ పోర్టల్ లోకి ఎందుకు లభ్యం కావడం లేదని డౌట్ ఆధారంగా సీఐడీ దర్యాప్తు మొదలెట్టింది. బ్లూఫ్రాగ్ పై వరుస ఫిర్యాదులు అందుకున్న సీఐడీ ఏక కాలంలో సంస్థలపై దాడులు జరిపింది. డేటా స్టోర్ చేసే విభాగాలనూ తెరిచి కీలకమైన సమాచారం సేకరించారు. అదే విధంగా బ్లూఫ్రాగ్ సంస్థ ఐదారేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న సమాచారాన్ని సీఐడీ రాబట్టింది. ఇసుక కృత్రిమ కొరత వెనుకున్న మాయాజాలం బయటపెట్టేందుకు బ్లూఫ్రాగ్ సంస్థల్లో సేకరించిన డేటాను ఐటీ సైబర్ క్రైం విభాగాలతో విశ్లేషించనున్నాయి. సంస్థ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయంటున్నారు సీఐడీ అధికారులు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి.. వ్యవసాయ రంగాలకు సంబంధించిన డేటా సేకరణ క్రోడీకరణ బ్లూఫ్రాగ్ సంస్థల్లో జరుగుతోంది. కంపెనీ సర్వర్ లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సీఐడీ అధికారులు సేకరించారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టనుంది సీఐడీ. కృత్రిమ ఇసుక కొరత వెనుక బ్లూఫ్రాగ్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నప్పటికీ విచారణ తర్వాతే వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.
ALSO ON TELUGUONE N E W S
  మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టనే లేదు. అయినా ఆ మూవీ క్రేజ్ అసాధారణ స్థాయిలో ఉంది. ఒక్క కర్ణాటక ఏరియా మినహా మిగతా అన్ని ఏరియాల ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటికీ అయిపోవడం విశేషం. సంక్రాంతికి విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో 'సరిలేరు నీకెవ్వరు' ముందంజలో ఉంది. అంతే కాదు, హిందీ శాటిలైట్ రైట్స్ కూడా 15 కోట్ల 25 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. మహేశ్ సినిమాలకు సంబంధించి హిందీ రైట్స్ విషయంలో ఈ మూవీది రెండో స్థానం. మహేశ్ మునుపటి సినిమా 'మహర్షి' హిందీ రైట్స్ 20 కోట్లు పలికాయి. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ కేరళలో నడుస్తోంది. కాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేశ్ ఏ డైరెక్టర్‌తో చేస్తాడనే విషయంలో భిన్న ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరోసారి జట్టు కట్టబోతున్నడనే ప్రచారం, 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం.. రెండూ జోరుగా సాగుతున్నాయి. 'మహర్షి'కి పని చేస్తున్న సందర్భంలో మహేశ్, వంశీ మధ్య స్నేహం కుదిరి, క్రమేణా బలపడుతూ వచ్చింది. వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. మహేశ్ కుమార్తె సితార, వంశీ కుమార్తె ఆద్య క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే వంశీ చెప్పిన కథకు మహేశ్ ఇంప్రెస్ అయ్యాడనీ, వెంటనే అతడితో పనిచేయడానికి ఉత్సాహం చూపించాడనీ ప్రచారంలోకి వచ్చింది. అలాగే ఆమధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో 'కేజీఎఫ్ 2' షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేశ్‌ని కలిసిన ప్రశాంత్ నీల్.. ఆయనకు ఒక యాక్షన్ డ్రామా స్క్రిప్టును వినిపించాడనీ, అది మహేశ్‌కు బాగా నచ్చిందనే విషయం బయటకు వచ్చింది. ఆ విషయం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. లేటెస్టుగా వినిపిస్తున్నదేమంటే.. ప్రశాంత్‌తో సినిమా చెయ్యడానికే మహేశ్ మొగ్గు చూపుతున్నాడని. వంశీ స్క్రిప్ట్ మోర్ ఎమోషనల్ కంటెంట్‌తో ఉన్నప్పటికీ, 'కేజీఎఫ్'ను ప్రశాంత్ రూపొందించిన విధానం, అతని టేకింగ్ స్కిల్స్ మహేశ్‌ను బాగా ఇంప్రెస్ చేశాయి. అలాంటి డైరెక్టర్ అయితే కొత్తగా తనను తాను ఆవిష్కరించుకొనే ఛాన్స్ కూడా ఉంటుందని మహేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ప్రశాంత్ నీల్‌తో మూవీ చెయ్యడానికి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సైతం డిసైడ్ అయ్యాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ సినిమా నిర్మించడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రంగంలోకి వచ్చింది. ఆ ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీతో వచ్చే ఏడాది జూన్ దాకా బిజీగా ఉండనున్నాడు. ముందుగా లాక్ చేసిన జూలై 30న ఆ సినిమా విడుదలైతే, ఆగస్టు నుంచి ఆయన తర్వాతి సినిమా మొదలుపెడతాడు. అయితే వివిధ కారణాల వల్ల ఆ మూవీ షూటింగ్‌లో జాప్యం జరుగుతూ వస్తుండటం వల్ల 2020 జూలైలో విడుదలయ్యే చాన్సులు చాలా తక్కువగా ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు నెక్స్ట్ మూవీకి అందుబాటులో ఉంటాడనే విషయంలో క్లారిటీ లేదు. దానికి భిన్నంగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ జనవరి 12న విడుదలవడం ఖాయం కాబట్టి ఆ వెంటనే తన తదుపరి సినిమాని మొదలుపెట్టడానికి మహేశ్ రెడీగా ఉన్నట్లే. ఈలోగా 'కేజీఎఫ్ 2'ను ప్రశాంత్ పూర్తి చేయనున్నాడు. దాంతో ఆ ఇద్దరూ కలిసి పనిచెయ్యడం ఖాయమనే విషయం బలంగా వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి మహేశ్ సొంత నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించే అవకాశాలున్నాయి. మరి వంశీతో మహేశ్ ఆ తర్వాతైనా చేస్తాడా? అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే.. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తర్వాత మహేశ్‌తో సినిమా చెయ్యాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. మహేశ్ సైతం ఆయనతో కలిసి వర్క్ చెయ్యడానికి ఈగర్‌గా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత రాజమౌళికే మహేశ్ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఆ తర్వాతే వంశీ పైడిపల్లితో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే. టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి కాబట్టి.. ఇప్పటికి అనేకసార్లు మహేశ్ తన ప్లాన్స్‌ని మార్చాడు కాబట్టి.. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఆయన ఏ డైరెక్టర్‌తో పనిచేస్తాడనే విషయం ఒకరికి మాత్రమే కచ్చితంగా తెలుసు. ఆ ఒక్కరు.. మహేశ్!
  ప్రతిష్ఠాత్మక అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకు ప్రఖ్యాత తారలు రేఖ, దివంగత శ్రీదేవి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని గురువారం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కమిటీ చైర్మన్ టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 2018 సంవత్సరానికి శ్రీదేవికీ, 2019 సంవత్సరానికి రేఖకూ ఈ అవార్డులు అందజేస్తారు. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వి, ఖుషి అవార్డును స్వీకరిస్తారని సుబ్బరామిరెడ్డి తెలిపారు. "ఈ అవార్డును ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన గొప్ప గొప్ప వ్యక్తులకు ఇస్తూ వస్తున్నాం. లతా మంగేష్కర్, దేవానంద్, వైజయంతీ మాల, హేమమాలిని, బాలచందర్, శ్యాం బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తులకు ఇచ్చాం. శ్రీదేవికి ఈ అవార్డును అందజేయాలన్నది నాగేశ్వరరావుగారి కోరిక. తండ్రి తర్వాత ఏఎన్నార్ అవార్డును కొనసాగిస్తున్న నాగార్జునకు అభినందనలు" ఆయన చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ "నాన్నగారి పేరు ఉన్నంతవరకూ ఈ అవార్డును కొనసాగిస్తూనే ఉంటాం. నాన్న వెళ్లిపోయాక సుబ్బరామిరెడ్డిగారు మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కార్యక్రమాన్ని కూడా ఈ అవార్డు వేడుకకు జోడిస్తూ వస్తున్నాం. ఈసారి ఆ కాలేజీ నుంచి 70 మంది విద్యార్థులకు రేఖగారి చేతుల మీదుగా డిగ్రీలను అందజేయనున్నాం. ఈ అవార్డుకు ఎంపిక చేశామని రేఖగారికి ఫోన్ చేసి చెప్పగానే నాన్నతో తనకు చాలా అనుబంధం ఉందని, కెరీర్ తొలినాళ్లలో ఆయన నుంచి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకున్నానని ఆమె చెప్పారు. నాన్నగారు మొదలుపెట్టినప్పటి లాగే అవార్డు గ్రహీతలకు రూ. 5 లక్షలు నగదు బహుమానం కూడా ఇస్తాం" అని చెప్పారు.
  'లక లక లక' అంటూ 'చంద్రముఖి'లో రజనీకాంత్ నట విశ్వరూపాన్ని చూపించారు. జ్యోతిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు తెలుగులో గానీ... అటు తమిళంలో గానీ... 'చంద్రముఖి'కి సీక్వెల్ తీయడం లేదు. హిందీలో తీస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం 'చంద్రముఖి'ని హిందీలో 'భూల్‌ భులైయా' పేరుతో అక్షయ్ కుమార్ రీమేక్ చేశారు. అందులో జ్యోతిక పాత్రను విద్యా బాలన్ పోషించారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'భూల్‌ భులైయా 2' తీస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరో. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' ఫేమ్ కియారా అడ్వాణీ హీరోయిన్. ఇందులో కీలక పాత్రలో నటించడానికి టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జనవరి నుండి ఆమె షూటింగులో జాయిన్ కానున్నారు.  'భూల్‌ భులైయా 2'లో టబు క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే హారర్ కామెడీలో నటించడం ఆమెకు కొత్తేమీ కాదు. హిట్ ఫ్రాంచైజీ 'గోల్ మాల్' సిరీస్ లో రోహిత్ శెట్టి తీసిన హారర్ కామెడీ 'గోల్ మాల్ అగైన్'లో టబు ఆత్మలతో మాట్లాడే పాత్రలో నటించారు. 'భూల్‌ భులైయా 2'లో 'చంద్రముఖి'లో జ్యోతిక తరహా పాత్ర చేస్తున్నారా? అనేది కొందరి సందేహం. హిందీ సినిమాలు పక్కన పెడితే... తెలుగులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'అల... వైకుంఠపురములో' సినిమాలో టబు నటిస్తున్న సంగతి తెలిసిందే.
  ఇప్పటికే రెండు పాటలతో సెన్సేషనల్ క్రేజ్ తెచ్చుకున్న 'అల.. వైకుంఠపురములో' మూవీకి సంబంధించిన మూడో పాట శాంపిల్.. అంటే టీజర్‌ను.. ఆదిత్యా మ్యూజిక్ సంస్థ గురువారం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. నవంబర్ 14 చిల్డ్రెన్స్ డే కావడంతో దానికి రిలేటెడ్‌గా ఉన్న 'ఓ మై గాడ్ డాడీ' అనే సాంగ్‌ను కొద్దిగా రుచి చూపించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమాలోని పాటలకు తమన్ సమకూర్చిన ట్యూన్స్ ఏ రేంజిలో ఉన్నాయో తొలి రెండు పాటలు చాలా గ్రాండ్‌గా తెలియజేశాయి. మొదట రిలీజ్ చేసిన సీతారామశాస్త్రి పాట 'సామజవరగమన' ఇప్పటిదాకా 81 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించగా, కాసర్ల శ్యామ్ రాసిన రెండో పాట 'రాములో రాములా' సైతం తొలి పాటను అనుసరిస్తూ ఇంతవరకూ 48 మిలియన్ వ్యూస్ సాధించింది. తొలి పాటను సిద్ శ్రీరామ్, రెండో పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు.  ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. కృష్ణ చైతన్య రాసిన ఈ పాటను ఒకరిద్దరు కాకుండా ఐదుగురు సింగర్స్ ఆలపించడం గమనార్హం. 'బిగ్ బాస్ 3' విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు రోల్ రిడా, బ్లేజీ, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్ కలిసి ఈ సాంగ్ పాడారు. "ఓ మైగాడ్ డాడీ.. జస్ట్ డోంట్ బి మై బాడీ.. డోంట్ బి సో హార్డీ.. దట్ విల్ మేక్ మి శాడీ.." అంటూ ఇంగ్లీషులో ర్యాప్ స్టైల్లో సాగే ఈ పాట పాశ్చాత్య సంగీతాన్ని ఇష్టపడే వాళ్లను అలరించే విధంగా ఉంది. ఈ సాంగ్ టీజర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే.. అందులో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ కనిపించడం. "ఓ మైగాడ్ డాడీ.." అంటూ పాట వినిపిస్తుంటే, దానికి తగ్గట్లుగా తండ్రి బిగ్ సైజ్ ఫొటోను చూస్తూ అయాన్ యాక్షన్ చేస్తూ కనిపించడం, తల కొట్టుకోవడం ముచ్చట గొలుపుతోంది. అన్నను చూసి అర్హ కూడా అలాగే చేత్తో నుదిటిని కొట్టుకోవడం.. సో క్యూట్. టీజర్ మొదట్లోనే 'అయాన్ ఎబౌట్ అల్లు అర్జున్' అంటూ వేశారు. 'లలలలాల్లా లలలల్లలాల్లా' అంటూ పాట మొదలవగా ఇంటి లాన్‌లో పరిగెత్తుకుంటూ వచ్చాడు అయాన్. ఈ సినిమాకి సంబంధించిన, నవ్వుతూ ఉన్న తండ్రి బిగ్ సైజ్ వినైల్ ఫొటోను చూసి, "ఓ మైగాడ్ డాడీ" అంటూ నుదుటిని కొట్టుకున్నాడు. అన్న అలా చేస్తుంటే, వైట్ గౌనులో ఉన్న అర్హ.. తండ్రి ఫొటోను ఆనుకొని అందంగా సిగ్గుపడుతూ నిల్చొంది. తన పక్కకు అయాన్ చేరగానే, అర్హ కళ్లు మూసుకుంది. అయాన్ నుదుటిపై చేయి పెట్టుకున్నాడు. తండి ఫొటోపై చేతులుపెట్టి డాన్స్ కూడా చేశాడు. ఆ తర్వాత అన్నా చెల్లెళ్లిద్దరూ ఇంట్లోకి పరుగులు తీశారు. మొత్తానికి ఒక క్యూట్ కాన్సెప్టుతో ఈ సాంగ్ టీజర్‌ను రూపొందించారు. నవంబర్ 14 బాలల దినోత్సవం కాబట్టి, పిల్లలతో ఈ టీజర్‌ను రూపొందించడం సందర్భోచితంగా ఉంది. సినిమాలో ఏ సందర్భంలో ఈ సాంగ్ వస్తుందో చూడాలి. 'ఓ మై గాడ్ డాడీ' ఫుల్ సాంగ్‌ను నవంబర్ 22న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ప్రకటించాయి. కాగా ఈ చిల్డ్రెన్స్ డేకి తన పిల్లల్ని మిస్సవుతున్నానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు బన్నీ. "ఓ మై గాడ్ డాడీ సాంగ్ కిక్ స్టార్ట్స్. చిల్డ్రెన్స్ డేకి నా పిల్లల నుంచి అందుకున్న స్వీటెస్ట్ గిఫ్ట్. థాంక్యూ అయాన్, అర్హా.. నాన్న మిసెస్ యు అండ్ లవ్స్ యూ సో మచ్.. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రెన్స్ డే" అని ఆయన ట్వీట్ చేశాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిసోన్న ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత పేరుపొందిన బాలీవుడ్ యాక్ట్రెస్ టబు టాలీవుడ్‌లోకి మళ్లీ వస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ ఒక జంటగా కనిపిస్తారు. జయరాం, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, సముద్రకని, తనికెళ్ల భరణి, సునీల్, నవదీప్, ఈశ్వరీరావు, బ్రహ్మాజీ, అజయ్, రాహుల్ రామకృష్ణ, రోహిణి వంటి పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ అనే విషయం ఇప్పటికే తేలిపోయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతున్న 'అల వైకుంఠపురములో' మూవీ ఏ రేంజి బ్లాక్‌బస్టర్ అవుతుందనేది అల్లు అర్జున్ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్ మీద ఆధారపడి ఉంది.
  తెలుగులో కామ కథలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అవేనండీ 'లస్ట్ స్టోరీస్'. అమలా పాల్ ప్రధాన పాత్రలో దర్శకురాలు నందినీరెడ్డి ఒక లస్ట్ స్టోరీ షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు మరో లస్ట్ స్టోరీ 'ఘాజి', 'అంతరిక్షం' సినిమాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తోంది. ఈ కథలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు ఆషిమా నర్వాల్. సాధారణంగా ఈ పేరు చెప్తే గుర్తు పట్టడం కష్టమే. కానీ, 'నాటకం'లో నటించిన హీరోయిన్ అంటే కొంతమంది గుర్తుపట్టే ఛాన్స్ ఉంది.  'అర్జున్ రెడ్డి' తర్వాత ఆ హ్యాంగోవర్ లో వచ్చిన తెలుగు సినిమాల్లో 'నాటకం' ఒక్కటి. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఫుల్ రొమాన్స్ తో తీశారు. ఆషిమా అందాలు ఆరబోసింది. కానీ, సినిమా ఆడలేదు. ఆ తర్వాత ఆషిమా నర్వాల్ నటించిన హారర్ సినిమా 'జెస్సి' కూడా ప్లాప్ అయింది. తమిళ డబ్బింగ్ 'కిల్లర్'తో ఓ హిట్ ఆమె ఖాతాలో పడింది. కానీ, కొత్త సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇప్పుడీ 'లస్ట్ స్టోరీస్' ఆమెకు పేరు తీసుకొస్తాయని ఆశిస్తున్నట్టు ఉంది.
  మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కలిగిన ఫస్ట్ ఫీలింగ్... రవితేజ నేల చూపులు మానేశాడు. సీరియస్ స్ట్రయిట్ లుక్‌లో అభిమానులకు కిక్ ఇచ్చాడు. 'రాజా ది గ్రేట్'లో రవితేజ అంధుడిగా నటించాడు. క్యారెక్టర్ కి తగ్గట్టు నటించాడు. అందులో అతడి నటనకు మంచి పేరొచ్చింది. అయితే, ఆ తర్వాత నటించిన సినిమాల్లో 'రాజా ది గ్రేట్' హ్యాంగోవర్‌లో నటిస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నేల చూపులు చూస్తున్నాడని చాలామంది కామెంట్ చేశారు. అందుకు తగ్గట్టు ఆయా సినిమాల ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి.  'టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్‌లో రవితేజ ఎంత స్టయిలిష్ గా ఉన్నపటికీ, అతడి లుక్ మాత్రం కిందకు ఉంటుంది. 'నేల టికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', విడుదల కావలసిన 'డిస్కో రాజా'... ప్రతి సినిమా నుండి విడుదలైన ఏదో ఒక పోస్టర్లో రవితేజ డిఫరెంట్ డిఫరెంట్ కళ్లజోళ్లు పెట్టుకుని కనిపించాడు. అటువంటి ప్రయోగాలు చేయకుండా దర్శకుడు గోపీచంద్ మలినేని 'క్రాక్' ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. రవితేజ కళ్ళల్లో సీరియస్‌నెస్ మాత్రమే చూపించాడు. రవితేజ కూడా మీసం పెంచి, గడ్డం కొంచెం తగ్గించి తన లుక్‌లో కొత్తదనం చూపించాడు. దాంతో అభిమానులు ఫుల్ హ్యాపీ.  'డాన్ శీను', 'బలుపు' తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా 'క్రాక్'. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేస్తామని తెలిపారు. సో... 2020లో రవితేజ డబుల్ ధమాకా ఖాయం అన్నమాట. ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన 'డిస్కో రాజా' వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. ఆ సినిమా విడుదలైన నాలుగు నెలల్లో 'క్రాక్' విడుదల అవుతుంది. 
  రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్యం బాగోలేదు. ఆయన ఐదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరానికి తోడు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో బుధవారం కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన్ను ఐసీయులో జాయిన్ చేశారు. అనుభవజ్ఞులైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఉన్నట్టుండి కృషంరాజుకు ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో కుటంబ సభ్యులు కొంచెం ఆందోళనకు గురయ్యారట. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు భరోసా ఇచ్చినట్టు సమాచారం. కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలిసిన ప్రభాస్ అభిమానులు, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రభాస్ కు కృష్ణంరాజు పెదనాన్న అన్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం ముంబైలో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
  మంగళవారం అర్ధ రాత్రి దాటాక ఔటర్ రింగ్‌రోడ్‌పై కారు యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలతో బయటపడ్డ సీనియర్ హీరో రాజశేఖర్ బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. తనకు ముక్కుపై అతి చిన్న గాయమవడం మినహా మరెలాంటి గాయాలూ కాలేదని చెప్పారు. తన క్షేమం కోరుకున్న వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజశేఖర్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే... "పెద్ద యాక్సిడెంట్‌కు గురైనా అదృష్టవశాతూ ఆ దేవుడి దయవల్ల, ఎలాంటి గాయాలకూ గురి కాకుండా బయటపడ్డాను. బండి పల్టీలు కొట్టింది కాబట్టి బాడీ పెయిన్స్ ఉన్నాయి. ముక్కుపైన చిన్న దెబ్బ తగిలి రెండు వైపులా కొంచెం బ్లీడింగ్ అయింది. ముందు ఆ బ్లీడింగ్ ఎక్కడ్నుంచి వచ్చిందా.. అని అనుకున్నాం. అది తప్ప వేరే దెబ్బలు తగల్లేదు. ఇలాంటి ఘటన జరిగాక మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు.. మనమంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు.. ఎంతమంది లవ్ చేస్తున్నారు.. ఎంతమంది కంగారు పడుతున్నారు.. ఎంతమంది చూడాలని ఇంటికి వస్తున్నారు.. ఎంతమంది మెసేజ్‌లు పంపిస్తున్నారు.. అనేది తెలిసింది. ఇవన్నీ చూస్తుంటే.. నేను ఏదో కొంత సాధించానని తెలిసింది. వీళ్లందరి అభిమానం చూసి సంతోషమేసింది. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలోని వాళ్లమంతా ఒక ఫ్యామిలీ అని ఫీలవుతాం. కొంతమంది వయసై పోవడం వల్లనో, యాక్సిడెంట్ల మూలంగానో చనిపోతున్నారు. తాము చనిపోయిన తర్వాతైనా నలుగురూ వచ్చి తమని చూడాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఎవరూ వచ్చి చూడకపోతే వాళ్ల ఆత్మలు ఘోషిస్తాయి. తెలిసినవాళ్లు ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే వెళ్లి పరామర్శించండి. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ల దినకర్మకైనా వెళ్లండని కోరుకుంటున్నా. ఎందుకంటే మనం రానురానూ పెద్దల్ని గౌరవించడం మర్చిపోతున్నాం. నేను బాగుండాలని కోరుకున్నవాళ్లకందరికీ నా నమస్కారం."
  అనారోగ్య వదంతుల మధ్య అమెరికా నుంచి వచ్చిన, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన రానా దగ్గుబాటి.. కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న మూవీ లాంచ్ ప్రోగ్రాంలో దర్శనమిచ్చాడు. జూన్ 15న తన సినిమా 'విరాట పర్వం 1992' మూవీ ఓపెనింగ్‌లో కనిపించాక మళ్లీ అతడు పబ్లిక్‌లోకి వచ్చింది ఇప్పుడే. ఫుల్ బియర్డ్ లుక్‌లో నవ్వుతూ కనిపించాడు రానా. మనిషి బాగా సన్నబడిపోయాడనేది వాస్తవం. అయితే అనారోగ్య ఛాయలేమీ ఉన్నట్లు అతను కనిపించలేదు. హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ గల్లాను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నట్లు హుషారుగా చెప్పాడు. రానా కనిపించిన తీరు చూస్తే, అతడి హెల్త్‌పై వచ్చిన ప్రచారమంతా గాసిప్పేనని అనిపించింది. ఆ ఈవెంట్ తర్వాత అతను తన సినిమాల గురించి ఆయా డైరెక్టర్లతో చర్చలు జరిపాడు. జూన్‌లో 'విరాట పర్వం' మూవీ ఓపెనింగ్ జరిగాక, ఆ సినిమా షూటింగ్‌లో ఇంతవరకు రానా పాల్గొనలేదు. ఈ లోగా రానా కాంబినేషన్ లేని సీన్స్ తీస్తూ వచ్చాడు డైరెక్టర్ వేణు ఊడుగుల. ఆమధ్య పరకాల బస్ స్టేషన్‌లో హీరోయిన్ సాయిపల్లవిపై వేణు సన్నివేశాలు చిత్రీకరించిన విషయం సోషల్ మీడియాలో లీకైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంతకీ.. 'విరాటపర్వం' సెట్స్ పైకి రానా ఎప్పుడు వస్తాడు? డిసెంబర్ నెలలో అనేది సమాధానం. అప్పట్నుంచి వరుసగా అతడు పాల్గొనే సీన్స్ తియ్యడానికి డైరెక్షన్, ప్రొడక్షన్ టీమ్స్ రెండూ ప్లాన్ చేస్తున్నాయి. మానవ హక్కుల నేపథ్యంలో, 1990 తొలినాళ్ల కాలానికి సంబంధించిన కథతో తయారయ్యే ఈ సినిమాలో రానా విప్లవ భావాలున్న యువకుడిగా కనిపించనుండగా, డిగ్రీ స్టూడెంట్‌గా సాయిపల్లవి నటిస్తోంది. ఆ మూవీని 2020 సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది ప్రొడ్యూసర్ సురేశ్‌బాబు ప్లాన్. ఆ వెంటనే 'హిరణ్యకశిప' షూటింగ్ మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. మనకు తెలిసిన ప్రహ్లాదుడి కథను హిరణ్యకశిపుడి నేపథ్యం నుంచి రూపొందించేందుకు డైరెక్టర్ గుణశేఖర్ సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్‌తో, సౌత్-నార్త్ యాక్టర్లతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించేందుకు సురేశ్‌బాబు సన్నాహాలు చేస్తున్నారు. హిరణ్యకశిపుడిగా రానా నటించనున్నాడు. 'బాహుబలి'లో భల్లాలదేవాగా రానా ప్రదర్శించిన నటనకు ఇంప్రెస్ అయిన గుణశేఖర్.. అతనిని దృష్టిలో పెట్టుకొని తను ఎప్పట్నుంచో అనుకుంటున్న 'హిరణ్యకశిప' స్క్రిప్టును బయటకు తెచ్చారు. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఆ సినిమాకి అవసరమైన సెట్ డిజైనింగ్ ఇప్పటికే పూర్తయిందనీ, ఆ సెట్లను నిర్మించే పనులు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. పౌరాణిక చిత్రం కాబట్టి సన్నివేశాలన్నీ దాదాపుగా ఇండోర్‌లోనే సెట్లలో తీయాల్సి ఉంది. నానక్‌రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. హిరణకశిపుని పాత్ర కోసం రానా బరువు పెరగాల్సి ఉంది. 'విరాట పర్వం' కోసం సన్నబడ్డ అతను, ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక, బరువు పెరిగే పనిని చేపట్టనున్నాడు. అంతే కాదు.. ఇప్పటికే అతను, తెలుగు సహా వివిధ భారతీయ భాషల్లో హిరణ్యకశిపుడిపై వచ్చిన సినిమాలు చూసి, ఆ పాత్ర గురించిన అవగాహనను పెంచుకున్నాడు. అవన్నీ దశాబ్దాల క్రితం వచ్చినవే. అన్నింటిలోనూ పద్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి జనరేషన్‌కు అవి అర్థమవడం కష్టం కాబట్టి అందరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ సరళమైన భాషలో రాయిస్తున్నట్లు సమాచారం. పౌరాణిక సినిమా అంటే షూటింగ్‌కు చాలా రోజులు పడుతుందని మనం ఊహిస్తాం. ఇంతకు ముందు వచ్చిన కాస్ట్యూం డ్రామాలు.. 'బాహుబలి', 'రుద్రమదేవి', 'సైరా' సినిమాల షూటింగ్‌కు ఎక్కువ రోజులే పట్టింది. అలా కాకుండా వీలైనంత తక్కువ పనిదినాల్లో 'హిరణ్యకశిప' షూటింగ్‌ను పూర్తి చెయ్యాలని సంకల్పించారు. ప్రి ప్రొడక్షన్ పనుల్ని పక్కాగా జరిపి, సరైన ప్లానింగ్‌తో షూటింగ్‌కు వెళ్లాలని యూనిట్ భావిస్తోంది. కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఉండే కథ కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. మరోవైపు తను చేస్తున్న త్రిభాషా చిత్రం 'హాథీ మేరే సాథీ'కి తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశాడు పూర్తి చేశాడు రానా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆ సినిమా విడుదలవుతోంది. అంటే మూడు భాషల్లో అతను డబ్బింగ్ చెప్పాడన్న మాట. 'హాథీ మేరే సాథీ', 'విరాటపర్వం 1992' సినిమాల విడుదలలు, 'హిరణ్యకశిప' షూటింగ్‌తో 2020లో యమ బిజీ కానున్నాడు రానా.
సందీప్ కిషన్ తమిళ సినిమాలకు దూరం కానున్నాడు. తెలుగు సినిమాలపై ఫోకస్ చేయనున్నాడు. ఇకపై తమిళ సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాడు. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. సందీప్ కిషన్ నటించిన మూడు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరిస్థితి. 'డి 16' ఫేమ్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించిన 'నరగసూరన్'లో అరవింద్ స్వామి, శ్రియతో కలిసి సుందీప్ కిషన్ నటించాడు. గౌతమ్ మీనన్ ఆర్థిక సమస్యల వల్ల ఆ సినిమా విడుదల ఆగింది. అలాగే, తెలుగులో సందీప్ కిషన్ నిర్మించిన నిను వీడని నీడను నేనే' తమిళ వెర్షన్ 'కన్నాడి' కూడా ఇంకా విడుదల కాలేదు. ఆ సినిమా నిర్మాతలలో ఒకరైన విజి సుబ్రహ్మణ్యానికి ఫైనాన్షియర్లతో ఏవో సమస్యలు ఉన్నాయి. అలాగే, మరో సినిమా ఉంది. అందుకని, తమిళ సినిమాలు మానేసి పూర్తిగా తెలుగుపై దృష్టి పెట్టాలని సందీప్ కిషన్ ఫిక్సయ్యాడు. "తమిళ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు బాగోలేదు. కోలీవుడ్ బ్యాడ్ ఫేజ్ లో ఉంది. పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని సినిమాల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం తమిళ సినిమా మంచి పొజిషన్ లో లేదు. తమిళంలో కొంచెం గుర్తింపు ఉంది కనుక సినిమాలు చేశా. ఇకపై తెలుగుపై ఫోకస్ చేస్తా" అని సందీప్ కిషన్ తెలిపాడు. పైగా తమిళ సినిమాలు చేస్తుంటే తెలుగు సినిమాలను వదిలేశానని అంటున్నారనీ, తాను ఎక్కడికి వెళ్లిన తెలుగు అబ్బాయినేననీ, తన ఫోకస్ అంతా తెలుగుపైనే ఉంటుందనీ సందీప్ కిషన్ చెప్పాడు.      
  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
  ప్రస్తుతం మనం జనాలకి పెద్దగా తెలియదు కదా అని నోటికి ఏదొస్తే అది వాగకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలి అనుకునేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు.. అబ్బే, ఇప్పుడు మనం పెద్దగా ఎవ్వరికి తెలీదు కదా అని రెచ్చిపోయి.. వారి కులపోళ్ళని పొగుడుతూ ఓ నాలుగు ట్వీట్లు.. మిగతా వ్యక్తుల్ని, మిగతా కులాల్ని నీచంగా కించపరుస్తూ మరో నాలుగు ట్వీట్లు చేస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటారు. ఎవరైనా.. అయ్యా అప్పట్లో మీరు ఇలా వాగారంటూ సాక్ష్యాలతో సహా బయటపడితే.. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థంగాక ఆకులు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఇదే.     ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కి టీడీపీ, బీజేపీ మద్దతు కూడా కోరారు. పవన్ తలపెట్టిన ఈ మార్చ్ కి ఇరు పార్టీల అధినేతలు సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడం.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఇంకేముంది పవన్ తలపెట్టిన ఆందోళనలో కన్నా పాల్గొనాల్సిన అవసరంలేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విష్ణు పేరుకి బీజేపీలో ఉన్నా.. ఆయన కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడతారని, ఆయనకు కులపిచ్చి అని విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేవో సాధారణ రాజకీయ విమర్శలు కాదు. జనసైనికులు ఎంతో శ్రమించి దాదాపు పదేళ్ల క్రితం నాటి సాక్ష్యాలను వెలికి తీసి.. విష్ణుకి కులపిచ్చి ఉందని రుజువుచేసారు.     దాదాపు పదేళ్ల క్రితం.. విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే తెలియకపోవడమే మంచిది అనుకుంటారు. ఆయన ట్వీట్లు చూస్తే ఆయనకు ఎంత కులపిచ్చి ఉందో అర్ధమవుతుంది. ఆయన కులానికి చెందిన వారిని పేరుపేరునా పొగుడుతూ ట్వీట్ చేయడం. మిగతా కులాల్ని కించపరచడం. అంతేకాదు ఆడవారి అందాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం. ఇలా ఆయన పదేళ్ల క్రితం చేసిన ఏ ట్వీట్ చూసినా చండాలమే. ఛీ ఛీ ఈయన ఓ జాతీయ పార్టీ నాయకుడా అనుకునేలా ఉన్నాయి ఆయన ట్వీట్స్. రాజకీయ నాయకుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా.. అందర్నీ కలుపుకొని పోతూ ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈయన నరనరాల్లో కులపిచ్చి నింపుకొని ప్రజాసేవ అర్థాన్నే మార్చేశారు. దీంతో ప్రస్తుతం విష్ణుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.     కాగా, పదేళ్ల క్రితం ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవ్వడం, విమర్శలు రావడంతో.. విష్ణు మొదట ఆ ట్వీట్లను డిలీట్ చేసే ప్రయత్నం చేసారు. ఆ ట్వీట్లు వందల్లో ఉండటంతో ఇక చేసేది లేక అకౌంట్ నే తీసేసారు. అయినా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుండటంతో.. ఇక చేసేదేమి లేక.. అబ్బే ఆ ట్వీట్లకు నాకేం సంబంధం లేదు, అప్పట్లో ఆ అకౌంట్ ని థర్డ్ పార్టీ చూసేది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. ఒకవేళ నిజంగానే ఆయనకు ఆ ట్వీట్లకు సంబంధం లేకపోతే.. విమర్శలు రాగానే కొన్ని ట్వీట్లు ఎలా డిలీట్ అయ్యాయి? తర్వాత ఏకంగా అకౌంటే ఎందుకు డిలీట్ అయింది?. అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు.. ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి అని. మరి ఇప్పటి ప్రభుత్వాలు.. ఎవరైనా సామాన్యులు చిన్న ట్వీట్ చేస్తే చాలు.. కేసులు, అరెస్ట్ లు అంటున్నాయి.. మరి ఈయన గారు కులాల్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లపై ఎలా స్పందిస్తాయి?. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకునే సాహసం చేస్తాయా? చూడాలి.
  అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది. పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.
  కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... ఈ ముగ్గురూ మంచి స్నేహితులంటారు... ఈ ముగ్గురూ పార్టీలో ఉన్నా... పార్టీలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడో కొత్త సంగతి బయటికొచ్చింది. గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా... ఈ ముగ్గురికీ చిరకాల మిత్రుడని తెలిసింది. ఈ నలుగురూ మంచి స్నేహితులని, తరచూ కలిసికుని మాట్లాడుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... స్నేహితులని అందరికీ తెలిసినా... యార్లగడ్డ సంగతే కొత్తగా ఉంది. అయితే, తన స్నేహితుడైన వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు పోటీకి దిగడానికి కొడాలి నానేయే కారణమనే మాట వినిపిస్తోంది. ప్రవాస భారతీయుడుగా ఉన్న యార్లగడ్డను కొడాలి నానినే... ఆంధ్రాకి రప్పించి... జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా.... వల్లభనేని వంశీపై పోటీకి దింపారని అంటున్నారు. ఈ మాట... వల్లభనేని వంశీ కూడా చాలాసార్లు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరు ఎత్తులు వాళ్లు వేసుకున్నా... వీళ్ల మధ్య మాత్రం స్నేహం... మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే, గన్నవరంలో ముఖాముఖిగా తలపడిన వంశీ, యార్లగడ్డ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇక, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.   తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని... ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉన్నా... ఆ తర్వాత కొడాలి... వైసీపీలో చేరారు. వంశీ మాత్రం టీడీపీలో కొనసాగారు. వంగవీటి రాధా కూడా కొన్నాళ్లూ వైసీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా... వీళ్ల మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. అయితే, మొన్నటివరకు అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీకి ఎంట్రీ ఇచ్చి... గన్నవరం నుంచి బరిలోకి దిగి ఏకంగా స్నేహితుడైన వంశీనే ఢీకొట్టారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల టైమ్ లో ఈ ఇద్దరికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అది వ్యక్తిగత వైరంగానూ మారింది. అయితే, గెలిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ఆర్ధిక సమస్యలు, కేసులు చుట్టుముట్టడంతో... తన స్నేహితుడైన కొడాలి నానితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొడాలి... వల్లభనేని వంశీని జగన్ దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, 2014 ఎన్నికల సందర్భంగా బెజవాడ బెంజ్ సర్కిల్ లో జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడంతో... వీళ్లిదరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ జరిగింది. అంతేకాదు వంశీ వైసీపీలో చేరతానే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ నలుగురు చిరకాల స్నేహితుల్లో వంగవీటి రాధాకృష్ణ... మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా... కొడాలి నాని సూపర్ విక్టరీ కొట్టి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు... ఇక వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల ముందు స్నేహితుడినే ఢీకొట్టి వ్యక్తిగత వైరం తెచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితే ఇరకాటంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. మరి, నలుగురి స్నేహితుల రాజకీయ అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయోనన్న చర్చ కృష్ణాజిల్లాలో జరుగుతోంది.  
కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాల వేదన హృదయవిదారంగా ఉంది. ప్రమాదం జరిగాక దఫాదఫాలుగా 39 మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగించిన అధికారులు.... ఇంకా 13మంది ఆచూకీ కోసం 39రోజులు ఆగాల్సి వచ్చింది. 38రోజుల తర్వాత ఎట్టకేలకు బోటును బయటికి తీయడంతో తమవాళ్ల మృతదేహాలు దొరుకుతాయని ఆశపడ్డ బాధిత కుటుంబాల్లో కొందరికి నిరాశే ఎదురైంది. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డ ఆత్మీయులు ఆశలు గల్లంతయ్యాయి. బోటు నుంచి 8మృతదేహాలు వెలికితీయగా... ఐదుగురిని మాత్రమే గుర్తించారు. అయితే, బోటు నుంచి వెలికితీసిన మృతదేహాలన్నీ కుళ్లిపోయి ఛిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఐదుగురిని గుర్తించగలిగారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అయితే, రాయల్ వశిష్ట బోటును శుభ్రం చేయడంతో మరికొన్ని ఎముకులు, అవయవాలు, వస్త్రాలు దొరికాయి. దాంతో వాటిని కూడా మూటలుగా కట్టి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాంతో మొత్తం మృతదేహాలు దొరికినట్లేనని అంటున్నారు. అయితే, పలువురి మృతదేహాలు ఛిద్రమైపోవడం... అలాగే అవయవాలు తెగిపోయి కొన్ని భాగాలు మాత్రమే దొరకడంతో వాళ్లను గుర్తుపట్టడం కష్టంగా మారిందని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. మృతదేహాలన్నీ మట్టితో నిండిపోయి ఉండటం... అలాగే కొన్ని డెడ్ బాడీస్ కు కాళ్లూచేతులు తెగిపోయి ఉండటం... మరికొన్ని మృతదేహాలైతే కేవలం ఎముకలు, మాంసపు ముద్దలు మాత్రం దొరకడంతో... డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ పంపుతున్నట్లు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతని కుమారుడు గుర్తించాడు. టీషర్ట్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపాడు. అలాగే, వరంగల్ వాసులైన కొమ్ముల రవీంద్ర, ధర్మరాజు మృతదేహాలను వాళ్ల జేబుల్లో దొరికిన ఐడీ కార్డుల ఆధారంగా మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. ఇక, మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మిగిలిన మూడు మృతదేహాల్లో... ఆ తర్వాత బోటు నుంచి తీసుకొచ్చిన ఎముకలు, మాంసపు ముద్దల్లో రమ్యశ్రీ డెడ్‌బాడీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం ఇంకా దొరక్కపోవడంతో రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన రమ్యశ్రీ తల్లిదండ్రులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన రాయల్ వశిష్ట బోటు బయటికొచ్చినా... బాధిత కుటుంబాల్లో కొందరికి మాత్రమే కొంతలో కొంత ఊరట లభించలేదు. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం లభించింది. అయితే, మిగతా మృతదేహాలన్నీ ఏ రకంగానూ గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో ఆయా బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. ఇక, ఆచూకీ దొరకాల్సిన, గుర్తించాల్సిన ఆరేడు మంది వివరాలు డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే తేలే అవకాశం కనిపిస్తోంది.
  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం తన సత్తా నిరూపించుకుందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం గతంతో కంటే తగ్గినా ఇక్కడి ఓటర్లు మాత్రం మరోసారి అధికార పార్టీకే అనుకూలంగా ఓటు వేసినట్టు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి మరోసారి ఓటర్లు అవకాశమిచ్చినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నూట అరవై నాలుగు, శివసేన నూట ఇరవై ఆరు సీట్లలో పోటీ చేశాయి.  వివిధ జాతీయ సంస్థల అంచనాలు చూస్తే.. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం బీజేపీ, శివసేన కూటమి రెండు వందల ముప్పై స్థానాలు గెలుచుకుంటోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నలభై ఎనిమిది, ఇతరులు పది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తారు. న్యూస్ సర్వే ప్రకారం బీజేపీ నూట నలభై ఒకటి, శివసేన నూట రెండు, కాంగ్రెస్ పదిహెడు, ఎన్సీపీ ఇరవై రెండు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారు. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి ఓటరు నాడి పట్టిన ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో బీజేపీకే నూట తొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు, శివసేనకు యాభై ఏడు నుంచి డెబ్బై, కాంగ్రెస్ కు ముప్పై రెండు నుంచి నలభై, ఎన్సిపికి నలభై నుంచి యాభై, ఇతరులు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమి రెండు వందల నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అరవై తొమ్మిది సీట్లలో ఇతరులు పదిహేను సీట్లను గెలుచుకుంటారు. న్యూస్ఎక్స్ చేసిన సర్వేలో బీజేపీకి నూట నలభై నాలుగు నుంచి నూట యాభై, శివసేనకు నలభై నాలుగు నుంచి ఎనభై, కాంగ్రెస్ నలభై నుంచి యాభై, ఎన్సీపీ ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది, ఇతరులు ఆరు నుంచి పది సీట్లు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హర్యానాలోనూ మరోసారి బీజేపీకే జై కొట్టారు అక్కడి ఓటర్లు. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం హర్యానాలో బీజేపీ డెబ్బై ఒకటి, కాంగ్రెస్ పదకొండు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశముంది. బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు కైవసం చేసుకొంటుందని ఇండియన్ న్యూస్ ఛానల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు తొమ్మిది నుంచి పన్నెండు, అకాలీ కూటమి ఒకటి, ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలూ గెలుచుకోవచ్చు. న్యూస్ఎక్స్ సర్వే ప్రకారం బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాల్లో, కాంగ్రెస్ తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు, ఐఎన్ఎల్డీ అకాడమీ కూటమి ఒక సీటు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఏబీపీసీ ఓటర్ అంచనాల ప్రకారం బీజేపీ డెబ్బై రెండు, కాంగ్రెస్ కి ఎనిమిది, ఇతరులు పది స్థానాలనూ గెలుచుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పై వ్యతిరేకత కనిపించకపోగా ఓటర్లల్లో మద్దతు పెరిగినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్ధమౌతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.ఇక ఈ సర్వే లెక్కలు నిజమౌతాయే లేదో అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ఏపీలో సీఎం ఆర్ఎఫ్ బాధితుల పరిస్థితి. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్ల తో సొమ్ము ఆదా చేసినట్టు ప్రజల ఆరోగ్య విషయంలోనూ అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది. పాత వారికి డబ్బులు జమ చేయకుండా కొత్త వారికి దరఖాస్తులు చూడకుండా ప్రభుత్వం వారితో ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి నామ మాత్రం గానే బాధితులకు సొమ్ము విడుదల చేస్తోంది. ఇతర ప్రాజెక్టుల మాదిరిగా ఇక్కడ కూడా రివర్స్ పద్ధతిని పాటిస్తున్నట్లు కనబడుతుంది. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను మళ్లీ తనిఖీ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో రిలీఫ్ పండ్ సెక్షన్ లో సుమారు ముప్పై మూడు వేల దరఖాస్తులు నూట యాభై కోట్ల బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. గత ప్రభుత్వం తన మన అని చూడకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్వోసీలోని ఉదారంగా అందించింది. కొత్త ప్రభుత్వం అంత కంటే ఎక్కువే చేస్తుందని ప్రజలు ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి నాలుగు నెలలుగా ప్రతి రోజూ మూడు వందల నుంచి నాలుగు వందల దరఖాస్తుల సీఎంఆర్ఎఫ్ వస్తున్నాయి. అధికారులు వాటి అన్నింటినీ పక్కన పడేస్తున్నారు. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ వరకు పదమూడు వేల సీఎం ఆర్ కు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి విలువ సుమారు డెబ్బై కోట్లని అంచనా. ఇవి కాకుండా టీడీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన పద్దెనిమిది వేల దరఖాస్తులను కొత్త ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది. వీటి విలువ కూడా అరవై ఐదు కోట్ల పైనే ఉంటుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు వెయ్యి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేస్తుంది.వీటిలో ఐదు వందల నుంచి ఆరు వందల దరఖాస్తులకు మాత్రమే చెక్కులు అందించింది.ఆ చెక్కులు కూడా బాధితుల అకౌంట్ లలో జమ కాలేదని తెలుస్తోంది. దరఖాస్తులను ఇంకా వాయిదాలో ఉండటంతో  బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది జిల్లాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే లు సీఎం కార్యాలయం పై ఒత్తిడి తెస్తున్నారు ఫలితంగా నియోజకవర్గాని కి యాభై దరఖాస్తుల చొప్పున క్లియర్ చేసేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు పేద ప్రజలను వదిలేసి తమ బంధువుల అనుంగు సహచరులు దరఖాస్తులు మాత్రమే నిశ్చితం చేయించుకుంటున్నారు. డబ్బుల్లేక నిధులు విడుదల చేయడం లేదా అంటే ప్రస్తుతం సుమారు ఎనభై కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం. వీటిని విడుదల చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఐదు వేల మందికి ఇచ్చిన చెక్కు లను కూడా ఇప్పటి వరకు క్లియిర్ చేయకుండా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. చెక్కులు చేతికి వచ్చిన బ్యాంకుల్లో డబ్బు లు జమ కాకపోవడం తో కొంత మంది బాధితులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రస్తుత వాతావరణం చూసి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యా లు భయపడుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నాయి. అందుకే రోగులకు లెటర్ లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో ముప్పై నుంచి అరవై లక్షల వరకు ఎల్ వోసీలు బకాయిలున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టుకొని కొత్తగా రోగుల కు ఎల్ వోసీ నుంచి తాము అప్పులపాలు కాలేమని ప్రైవేటు ఆసుపత్రుల చేతులెత్తేస్తున్నాయి. ఇదే విషయాన్ని రోగులకు స్పష్టంగా వివరిస్తున్నాయి డబ్బులుంటే బిల్లు కట్టే వైద్యం చేయించుకోండి లేదంటే వెళ్లిపొమ్మని కటువుగా చెప్పేస్తున్నారు విధిలేక కొందరు రోగులు లక్షల్లో అప్పు లు చేసి వైద్యం చేయించుకుంటున్నారు ఇంకొంతమంది అనారోగ్యం తో యుద్ధం చేస్తున్నారు.ఇక జగర్ సర్కార్ ఏమి చేయ్యబోతోందో వేచి చూడాలి.
  అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  చలికాలం. పైగా ఆ రోజు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ఉదయం ఎనిమిదిగంటలైనా కూడా వెలుగు జాడ కనిపించడం లేదు. జనం ఇళ్లలోంచి అడుగుపెట్టే సాహసమే చేయడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు అలా వెచ్చగా ఉండగా ఒక నడివయసు మనిషి మాత్రం వీధి పక్కనే కూర్చుని వణుకుతూ ఉన్నాడు. ఇంతలో... ఎక్కడి నుంచో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి ఒక యువతి బయటకు దిగింది. ఆ నడివయసు మనిషి వంక చూడగానే ఆమె మనసు కరిగిపోయినట్లుంది. నిదానంగా అతని దగ్గరకు వెళ్లింది. ‘‘మీరు చలికి బాగా వణికిపోతున్నట్లు ఉన్నారు!’’ అని అడిగింది ఆ యువత. ఆ మాటలకి పెద్దాయన ఉలిక్కిపడ్డాడు. తనని పలకరించిన యువతిని ఓమారు తేరిపార చూశాడు. ‘సమస్యే లేదు. ఈవిడ బాగా డబ్బున్నావిడే. నా పేదరికాన్ని ఎగతాళి చేయడానికే ఇలా అడుగుతోంది,’ అనుకున్నాడు. అందుకే ‘‘ఆహా బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటాను,’’ అంటూ ఈసడించుకున్నాడు. ఆ మాటలకు ఆమె పెద్దగా బాధపడినట్లు లేదు. పైగా ‘‘మీరు ఆకలిగా ఉన్నారా!’’ అని అడిగింది. ఆ ప్రశ్నకి పెద్దాయన మరింత మండిపడ్డాడు. ‘‘అబ్బే ఇప్పుడే కడుపునిండా భోజనం చేసి వచ్చాను. నేను వదలేసిన తిండితో ఇంకో నలుగురు కడుపు నిండుతుంది,’’ అని నిష్టూరమాడాడు. పెద్దాయన ఎగతాళిని ఆ యువతి అంతగా పట్టించుకోలేదు సరికదా... ఆయన దగ్గరకి వెళ్లి భుజం మీద చేయి వేసి ‘‘పదండి. ఆ హోటళ్లో తింటూ మాట్లాడుకుందాం!’’ అంటూ ఎదురుగుండా ఉన్న హోటల్లోకి ఆయనను నడిపించుకుని వెళ్లింది. ఆ యువతి చర్యతో పెద్దాయనకి నోటమాట రాలేదు. హోటల్ మేనేజరు కూడా ఏదో అనబోయాడు. కానీ యువతి ఖరీదైన దుస్తులు చూసి లేని మర్యాదని తెచ్చిపెట్టుకున్నాడు. ‘‘ఏం కావాలి మేడం!’’ అంటూ వారి టేబుల్‌ దగ్గరకి వచ్చి వినయాన్ని ఒలకబోశాడు. ‘‘ఈయనకి ఏం కావాలో అన్నీ తీసుకురండి,’’ అని హుకుం జారీచేసింది యువతి. యువతి చలవతో పెద్దాయన కడుపునిండా తిన్నాడు. ఆకలి తీరాక, కాస్త వేడివేడి టీ నోట్లో పోసుకున్నాడు. ‘‘ఇదంతా మీరు నాకెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు!’’ అన్నాడు పెద్దాయన కాస్త కుదుటపడిన తర్వాత. ‘‘మీరు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లు లేదు జేమ్స్!’’ అంది యువతి చిరునవ్వుతో. ఆ యువతి తనని పేరు పెట్టి పిలవడంతో పెద్దాయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా ఆ యువతి తన కథని ఆయనకు గుర్తుచేసేందుకు సిద్ధపడింది. ‘‘సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నేను కాలేజి చదువు ముగించుకుని, ఉద్యోగం కోసం ఈ ఊరికి వచ్చాను. ఎంత తిరిగినా నాకు ఉద్యోగం దొరకనేలేదు. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. అద్దె కట్టలేదని ఒకరోజు ఇంట్లోంచి కూడా నడివీధిలోకి గెంటేశారు. నిలువ నీడ లేదు, విపరీతమైన ఆకలి. ఆ ఆకలిలో ఏం చేయాలో తెలియక ఇదే హోటల్‌ ముందుకి వచ్చి నిలబడ్డాను...’’ ‘‘అవును ఆ రోజు నాకు గుర్తుంది. అప్పుడు నేను ఇదే హోటల్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నీకు ఏదన్నా ఆహారం పెడదామంటే దానికి హోటల్‌ నిబంధనలు ఒప్పుకోవని చెప్పాను...’’ అంటూ గుర్తుచేసుకున్నాడు పెద్దాయన. ‘‘అయినా మీరు నన్ను ఈసడించుకోలేదు. నాకు ఆహారం ఇచ్చి, ఆ బిల్లు మీ జేబులోంచి చెల్లించారు. అనుకోకుండా నాకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సొంతగా ఓ కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఈ ఇరవై ఏళ్లలో ఇటువైపుగా వచ్చిన ప్రతిసారీ మీరు కనిపిస్తారేమో కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకున్నాను. మీ గురించి ఎంతగా వాకబు చేసినా లాభం లేకపోయింది. చివరికి ఇవాళ మీరు కనిపించారు. ఇక నుంచి మీకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది,’’ అంటూ తన విజిటింగ్ కార్డుని అతని చేతిలో పెట్టింది ఆ యువతి. ‘‘అబ్బే ఆ రోజు నేను నీకు చేసిన సాయం చాలా చిన్నదే! అలాంటి సాయం నేను చాలామందికి చాలాసార్లు చేశాను. అంత చిన్న సాయానికి నువ్వు ఎందుకింతగా తిరిగి చెల్లించుకోవాలని అనుకుంటున్నావు?’’ అని అడిగాడు పెద్దాయన. ‘‘కొన్ని సాయాలు మనకి చాలా చిన్నవిగానే తోచవచ్చు. కానీ ఆ చిన్న పనుల ఇతరుల మనసులో కొత్త ఆశలని నింపుతాయి. ఆ రోజు జరిగిన సంఘటనలతో నాకు మానవత్వం మీద నమ్మకం పోయింది, జీవితం మీద విరక్తి కలిగింది. కానీ మీరు చేసిన పనితో మనుషులలో మంచితనం ఇంకా మిగిలి ఉంది అన్న నమ్మకం కలిగింది. ఎలాగైనా జీవించాలన్న ఆశ ఏర్పడింది. మీరు కల్పించిన ఆశకీ, నమ్మకానికీ తిరిగి ఎంత చెల్లించినా తక్కువే కదా!,’’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ యువతి. నిజమే కదా!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  మంచి వంటకం కుదరాలంటే అన్ని రుచులు వేటికవి సమపాళ్ళలో పడాలి. అప్పుడే కమ్మని వంటకం తయారవుతుంది. పొరపాటున ఏ ఒక్క రుచి ఎక్కువైనా వంటకంమొత్తం పాడైపోయినట్టే. జీవితం కూడా అంతే కదా! అన్ని భావావేశాలు వేటి స్థాయిలో అవి ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ ఒక్క భావావేశం మనసుని అతిగా ఆక్రమించినా మొత్తం చికాకుగా తయారవుతుంది. మనం గుర్తించంగానీ, కొన్నిసార్లు కొన్ని భావావేశాలు మనల్ని కొంచెం ఎక్కువగానే ఇబ్బందిపెడతాయి. ఎటొచ్చీ అలవాటు పడిపోయిన మనం వాటిని గుర్తించడానికి, వాటిని వదిలించుకోవడానికి, మనం మారడానికి ఇష్టపడం.   కోపం మనల్నే దహిస్తుంది.. చాలామందిని ఇబ్బందిపెట్టే కోపాన్నే తీసుకోండి. ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలవుతుందో తెలీదు. అప్పటి వరకు ప్రశాంతంగా వున్న మనసు ఒక్క నిమిషంలో అల్లకల్లోలంగా మారిపోతుంది. సర్దుకుందామని, ఆ కోపాన్ని దూరంగా నెట్టేద్దామని ప్రయత్నించిన కొద్దీ మరికొంచెం ఎక్కువవుతుందే గానీ తగ్గదు. ఒకోసారి ఆ కోపాన్ని అంత తొందరగా వదులుకోవడం ఇష్టంలేనట్టు మనం కూడా ఒకదానిపై నుంచి మరో దానిపైకి మన కోపాన్ని మళ్ళిస్తూనే వుంటాం. మండే కట్టె మంటని ఎగజిమ్ముతూనే తనని తాను దహించుకున్నట్టు కోపం వచ్చినప్పుడు ఎవరిమీదో కోపం చూపిస్తున్నాం అనుకుంటాం. కానీ, అది మనల్నే ఎక్కువ బాధపెడుతుంది.   కోపంతో జీవితం శూన్యం.. ఆ నిమిషానికి వచ్చిపోయే కోపం పెద్దగా హాని చేయకపోయినా కొంతకాలం పాటు కొందరిపై నిలిచిపోయే కోపం తప్పకుండా బంధాలను బలహీనపరుస్తుంది. ఒకోసారి మన మనసుని, జీవితాన్ని కూడా శూన్యంగా మార్చేస్తుంది. ఒక్కసారి గుర్తుచేసుకోండి ఎప్పుడైనా ఎవరిపైన అయినా వచ్చిన కోపానికి కారణం మొదట చిన్నదే అవుతుంది. రానురాను ఒకదానికి ఒకటి చేరుతూ మందమైపోతుంది. మనసుని రాయిగా మార్చేస్తుంది. మనకి తెలీకుండానే ఎదుటి వ్యక్తిని బాధపెడతాం. విసుక్కుంటాం. విసిరికొడతాం. ఫలితం తెలిసిందే. కానీ, ఎంత కోపం వచ్చినా మనం అంత తీవ్రంగా ఒక వ్యక్తిని బాధపెట్టడం కరెక్టేనా?   మనసులని గాయపరచొద్దు.. మనసులో ఎక్కడో దాగున్న అక్కసుని తీర్చుకునేందుకు కోపాన్ని సాధనంగా వాడుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకోటుండదు. ఒకరిని చూసి మరొకరు, ఒకరు చేశారు కదా అని మరొకరు ఇలా మనసుల్ని గాయపరచుకుంటూ వెళుతుంటే కొన్నాళ్ళకు గాయపడ్డ మనసులు, దూరమైన బంధాలు మిగులుతాయి. పరిగెట్టే కాలంతో అన్నీ సవ్యంగా వుంటేనే బంధాలని కాపాడుకోవడం కష్టంగా మారిన కాలంలో మనసుల్ని గాయపర్చుకుంటూ వెళితే ఆత్మీయత అనే లేపనాన్ని రాసేపాటి అవకాశం కూడా వుండదు.   ఒక మంచి మాట చాలు... క్షమించడం లాంటి పెద్ద పదాలు వాడక్కర్లేదుగానీ, చెదిరిపోయిన మనసుల్ని, బంధాల్ని సరిచేసే ఒక మంచి మాట మనసు లోతులోంచి వస్తేచాలు అద్భుతాలు జరగక మానవు. కోపం, పగ, ప్రతీకారం వంటి లక్షణాలను ప్రత్యేకంగా అలవర్చుకోనక్కర్లేదు. ముందు తరాల వారికి అలవాటు చేయక్కర్లేదు. వద్దన్నా అవి మన మనసుపై దాడి చేస్తూనే వుంటాయి. ఆత్మీయత అనే కవచాన్ని ధరిస్తే వాటి దాడి నుంచి తప్పించుకోవచ్చు. ద్వేషాని ద్వేషించి దూరంగా తరిమికొట్ట గలిగితే మనకి మనం మంచి చేసుకున్నవారమవుతాం. ప్రేమాప్యాయతలనే మంచి గంధాన్ని మనసు మూలల్లో దాచినా చాలు.. అది సువాసనలు వెదజల్లకపోదు. చుట్టూ తన పరిమళాన్ని నింపకపోదు. ఏమంటారు.. ఆలోచించండి! -రమ
  మోతాదు మించకుండా మద్యం పుచ్చుకుంటే ఏం కాదు, పైగా ఆరోగ్యానికి మంచిది కూడా! ఇక రోజుకి ఒకటో రెండో పెగ్గులు తాగితే గుండె కూడా బలంగా ఉంటుంది.... లాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ మాటలు పట్టుకుని మందుబాబులు ఒకటి రెండు పెగ్గులతో మొదలుపెట్టి ఒకటి రెండు క్వార్టర్ల స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇంతకీ మోతాదులో మద్యం మంచిదన్న మాట ఎక్కడిది. అది నిజంగా నిజమేనా!   మితంగా మద్యం తాగితే ఆరోగ్యపరమైన లాభాలు ఏమన్నా ఉన్నాయోమో పరిశీలించే ప్రయత్నం చేశారు కెనడాకి చెందిన పరిశోధకులు. దీనికోసం మద్యపానం గురించి ఇప్పటివరకూ జరిగిన ఓ 45 పరిశోధనల ఫలితాలను గమనించారు. మద్యంతాగనివారికంటే మోతాదులో మద్యం పుచ్చుకునేవారిలో గుండెజబ్బులు కాస్త తక్కువగానే ఉన్నట్లు వాటిలో చాలా పరిశోధనలు పేర్కొన్నాయి. కానీ ఈ పరిశోధనలని కాస్త జాగ్రత్తగా కనిపిస్తే ఒక విస్పష్టమైన లోపం కనిపించింది.   పరిశోధన సమయంలో ఒక వ్యక్తికి మద్యం అలవాటు ఉందా లేదా అని గమనిస్తున్నారు కానీ, అతనికి ఒకప్పుడు ఆ అలవాటు ఉందో లేదో ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, కాలేయ వ్యాధులు లాంటి సమస్యలు వచ్చిన తర్వాత చాలామంది మద్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. వారు సదరు అనారోగ్యంతో త్వరగా మరణించే ప్రమాదమూ ఉంది. దాంతో మందు తాగని వారు త్వరగా మరణిస్తున్నారని నిర్ధారించేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా జీవితంలో ఎప్పుడూ మందు ముట్టనంత మాత్రాన అతని లైఫ్‌స్టైల్‌ అద్భుతంగా ఉందనుకోవడానికి లేదు. వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం, ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం, పేదరికం.. లాంటి చాలా కారణాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంటాయి.   పైన తేల్చిన విషయాన్నే మరోసారి నిర్ధరించేందుకు మరో సర్వే కూడా చేశారు. ఇందుకోసం 9,100 మందిని... వారి 23 ఏట నుంచి 55 ఏట వరకు గమనించారు. ఒకప్పుడు మద్యం అలవాటు ఉన్న చాలామంది 55 ఏడు వచ్చేసరికి వేర్వేరు కారణాలతో ఆ అలవాటు మానుకుంటున్నట్లు తేల్చారు.   ఏతావాతా పరిశోధకులు చెప్పేదేమిటంటే... తక్కువ మోతాదులో మద్యం పుచ్చుకోవడం వల్ల, ఆరోగ్యానికి పెద్దగా హాని కలగని మాట వాస్తవమే! అలాగని మందుతో ఏవో అద్భుతాలు జరుగుతాయన్న భ్రమలు మాత్రం కూడదంటున్నారు. ఈ భ్రమలో పడి లేని అలవాటుని బలవంతంగా చేసుకోవాల్సిన అగత్యం అసలే లేదంటున్నారు.   - నిర్జర.
  ఆరోగ్యం..ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన శరీరానికి తగిన పోషకాలు, విటమిన్లు అందితేనే ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా ఉండాలంటే కొన్నిపాతకాలపు ఆహారపు అలవాట్లు పాటించాలి. అవేంటో ఈ వీడియో ద్వారా చూసి వాటిని పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.. https://www.youtube.com/watch?v=ZH5yCJttcWQ      
  ఇప్పుడు ఎవర్ని చూసినా ఒబెసిటీతోనే బాధపడుతున్నారు. దాంతో పాటే వచ్చే డయాబెటిస్‌, గుండెపోటులాంటి సమస్యలూ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. శరీర శ్రమ లేని లైఫ్‌ స్టైల్‌, ఏదిపడితే అది ఎడాపెడా తినేయడం మన ఒబెసిటీకి కారణం అని చిన్నిపిల్లాడికి కూడా తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. అందుకే దీన్ని నివారించడానికి అప్పుడప్పుడూ రకరకాల చిట్కాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటైన 16/8 డైట్‌ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. ఆ 16/8 డైట్‌ కథ ఏంటో మీరే చూడండి...   ఒకప్పుడు తిండి తినడానికి కూడా సమయం ఉండేది. రాత్రి చీకటిపడేలోగా తినేసి పక్కల మీదకి చేరేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు! పొద్దన్న ఆరింటికి మొదలుపెడితే రాత్రి పదకొండు గంటల వరకూ పొట్టలో ఏదో ఒకటి పడుతూ ఉండాల్సిందే! దీనికి విరుగుడుగానే 16/8 డైట్‌ని కనిపెట్టారు. ఇది పాటించేవాళ్లు రోజులో 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. మిగతా 16 గంటలూ కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు మన తిండి అంతా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల లోపే ముగించేయాలి. మర్నాడు ఉదయం పదిగంటల వరకూ ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. మిగతా సమయంలో శరీరం నీరసించిపోకుండా ఉండేందుకు షుగర్‌ ఉండని లిక్విడ్స్ (నీళ్లు, బ్లాక్‌ టీ, నిమ్మరసం...) తీసుకోవచ్చు.   ఈ 16/8 డైట్‌లో మిగతా 16 గంటలూ ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరం ఒంట్లో పేరుకున్న కొవ్వుని కరిగించడం మొదలుపెడుతుంది. ఓ మూడు నెలల పాటు ఈ పద్ధతిని పాటించినవాళ్లలో ఒబెసిటీ తగ్గినట్లు, బీపీ కూడా అదుపులో ఉన్నట్లు తేలింది.   వినడానికి ఈ పద్ధతి బాగానే ఉంది. పాటించడానికి తేలికగా కూడా ఉంది. కానీ ఎవరు పడితే వాళ్లు ఈ డైట్‌ ఫాలో అయ్యేందుకు సిద్ధపడితే మాత్రం ప్రమాదం తప్పదు. షుగర్‌, గ్యాస్ట్రిక్‌ లాంటి సమస్యలు ఉన్నవారు దీని జోలికి పోకపోవడమే బెటర్‌. ఏదన్నా తిని మందులు వేసుకోవాల్సినవాళ్లు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకి కూడా ఈ పద్ధతి సరిపడదని చెబుతున్నారు. మిగతావాళ్లు మాత్రం అలా ఓసారి ఈ పద్ధతిని పాటించి చూడవచ్చునట. మరెందుకాలస్యం... ఓ రాయి వేయండి. ఏమో ఎవరికి తెలుసు- ఏ పుట్టలో ఏ రాయి ఉందో!  https://www.youtube.com/watch?v=UFOfu35n7l8 - నిర్జర.