Read more!

బీఆర్ఎస్ గాలి తీసేసిన గుత్తా ఆయనా ‘చే’యందుకుంటున్నారా?

Publish Date:Apr 20, 2024

బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత  కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు. తాజాగా శాశనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ నుంచి వలసలపై చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటమి పరాభవాన్ని దిగమింగుకుని పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే లోక్ సభ ఎన్నికలలో సత్తాచాటడమే మార్గమని భావించి సర్వశక్తులూ కూడగట్టుకుని లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర ద్వారా కేసీఆర్  శ్రీకారం చుట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్న వేళ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాశనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి. తలెత్తుకోలేనంతగా పార్టీ అధిష్ఠానం పరువును గంగలో కలిపేశాయి. ఇంతకీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారంటే పార్టీ నుంచి వలసలకు   పార్టీ నాయకత్వంపై నేతలు విశ్వాసం కోల్పోవడమే కారణమని కుండబద్దలు కొట్టేశారు. శనివారం (ఏప్రిల్ 19) విలేకరులతో మాట్లాడిన ఆయన పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలు కావడానికి పార్టీ హైకమాండ్ తో పాటు మంత్రుల వ్యవహారశైలి కూడా కారణమన్నారు. అహంకారం తలకెత్తినందునే పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇప్పటికి కూడా పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవడానికి పార్టీ అగ్రనాయకత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ తీరు మారకుంటే భవిష్యత్ లో  పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పారు.  అంతే కాదు.. నాడు తాను బీఆర్ఎస్ లో చేరడానికి కారణాలను కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నాడు తనను 16 సార్లు కలిసి బతిమలాడితే తాను పార్టీ మారాననీ, కేబినెట్ లోనికి తీసుకుంటామన్న హామీ ఇచ్చిన తరువాతే కారెక్కాననీ వివరించారు. ఆ తరువాత పరిస్థితి మారిపోయిందనీ, గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎవరికీ అప్పాయింట్ మెంటే ఇవ్వలేదనీ అన్నారు,  పార్టీని అడ్డుపెట్టుకుని ఉద్యమ కారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించారనీ, ఒక నాడు జేబులో వందల రూపాయలు కూడా లేని వ్యక్తులు ఈ రోజు కోట్లకు పడగలెత్తారంటే ఏ రీతిన సంపాదనకు మరిగారో అర్ధం చేసుకోవచ్చన్నారు. తన కుమారుడు అమిత్ పోటీకి వెనుకడుగు వేయడానికి పార్టీలోని కొందరు సహకరించకపోవడమే కారణమన్నారు. ఇక ఇటీవలి కాలంలో పార్టీ మారిన బీఆర్ఎస్ సిట్టుంగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుత్తా శుఖేందర్ రెడ్డి చెప్పారు.  గుత్తా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కూడా కారు దిగడానికి నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఆయన కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ మారుతున్నాననే సంకేతాలను ఆయన నేరుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ మాట్లాడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి వలసలు ఆ పార్టీని గాభరాపెడుతున్నాయి. పార్టీ నుంచి వలసల  నిరోధం విషయంలో పార్టీ హైకమాండ్ చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మనిషి జీవితంలో గురువు ప్రాధాన్యత తెలిపే కథనం!!

Publish Date:Oct 9, 2023

సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Publish Date:Mar 15, 2021

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.  41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు  ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు  అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

లక్ష్యానికి అండర్ లైన్ చేసుకోండి...

Publish Date:Apr 20, 2024

చాలా మంది యువత తమ లక్ష్యం పట్ల స్పష్టమైన, కచ్చితమైన అభిప్రాయం ఉండదు. ప్రాథమిక పాఠశాలనుంచి యూనివర్సటీ వరకూ అభిప్రాయాలు మార్చుకుంటారు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడు "నువ్వు భవిష్యత్ లో ఏమవుతావు" అని అడిగినప్పుడు మనం ఇచ్చిన సమాధానం ఆరేడేళ్ల తర్వాత హైస్కూల్ కి వచ్చేసరికి మన సమాధానం మారిపోతుంది. హైస్కూల్ నుంచి కాలేజ్ కి వచ్చేసరికి కూడా మన అభిప్రాయం మారిపోతుంది. అయితే ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట కచ్చితమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. గమ్యాన్ని నిర్ణయించుకుంటే కదా ప్రయాణం సాగించగలం. పదునైన ఏకాగ్రత మాత్రమే మనలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అదే ఆలోచనతో, అదే వ్యాపాకంతో ఉండాలి. అది తప్ప వేరే ఇతర వ్యవహారాల జోలికి వెళ్లకుండా కృషి చేస్తే ఎంత అసాధ్యమైన లక్ష్యం అయినా సుసాధ్యం కాగలదు. లక్ష్య సాధనకు సూత్రం ఇదే! ఒకే సమయంలో పలు రకాల పనులు చెయ్యానుకుంటాము. మన ఆదర్శవంతమైన లక్ష్యం అయినా శ్రద్ధా ఏకాగ్రత లేకుండా గొప్ప పని సాధ్యం కాదు. హర్యానాలో చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన కల్పనా చావ్లా రోదసీలో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ యువతి. ఆమె తన చిన్నతనంలోనే ఒక స్థిరమైన గమ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె జీవిత కథ రాసిన రచయిత " వేసవి రాత్రుల్లో కల్పన వెళ్లికలా పడుకొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉండేది. బహుశా రోదసీలో ప్రయాణించాలి అనే కలను అదే కలిగించి ఉండొచ్చు" అంటారు. ఆమె అంతరిక్షావిజ్ఞాన శాస్త్రం (ఏరోనాటికల్ ఇంజనీరింగ్) చదువుకోవాలి అన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు , స్నేహితులు,శ్రేయోభిలాషులు చివరకు కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఆ శాస్త్రానికి బదులు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగాలలో చదువుకోమని సలహా ఇచ్చాడు. కానీ కల్పన మనసు మార్చుకోలేదు. అన్నీ అడ్డంకులను అధిగమించి తన గమ్యాన్ని సాధించింది. తన గమ్యం పట్ల తనకి ఉన్న ఏకాగ్రత భక్తితోనే ఆమె తన జీవితంలో విజయం సాధించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ◆వెంకటేష్ పువ్వాడ    
[

Health

]

వేసవికాలం డయాబెటిస్ రోగులకు ప్రమాదమా?  

Publish Date:Apr 20, 2024

వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు అసౌకర్యానికి గురవుతారు. అయితే వీరు మాత్రమే కాదు.. ఎండల ధాటికి డయాబెటిక్ రోగులకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వేసవికాలంలో డయాబెటిస్ రోగులకు ఉండే ముప్పేంటి? డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుంటే.. వేసవి కాలం డయాబెటిస్ రోగులపైన ప్రభావం చూపిస్తుంది. అధిక వేడి  డయాబెటిక్ రోగులకు కష్టంగా ఉంటుంది.  తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వల్ల శరీరంలో తేమను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.   శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంలో  ఇబ్బంది పడతారు. అందుకే ఈ  వేసవిలో  శరీర ఉష్ణోగ్రత,  చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవడానికి కింది టిప్స్ పాటించాలి. పుష్కలంగా నీరు త్రాగాలి.. వేసవి కాలంలో నీరు  బెస్ట్ ఫ్రెండ్. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.   అధిక ఉష్ణోగ్రతలు లేదా శారీరక శ్రమ కారణంగా  ఎక్కువగా చెమటలు పడుతుంటే నీరు  తీసుకోవడం పెంచాలి. హైడ్రేటింగ్ ఆహారాలు.. ఆహారంలో దోసకాయ, పుచ్చకాయ, నారింజ,  టమోటా వంటి నీరు అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలను చేర్చాలి. ఈ ఆహారాలు  హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. కెఫీన్ ఆహారాలు వద్దు..  కెఫిన్ కలిగిన కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెరపై చెడు ప్రభావాన్ని చూపి శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. కాటన్ దుస్తులు..  కాటన్ దుస్తులను ధరించాలి. తద్వారా  శరీరం చల్లగా ఉంటుంది. చెడు శరీర ఉష్ణోగ్రత  చక్కెర స్థాయిని పాడు చేస్తుంది. సన్‌బర్న్‌ను నివారించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించండి. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి..  రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.  వైద్యుల సలహా ప్రకారం  మెడిసిన్  లేదా ఇన్సులిన్ మోతాదును తీసుకోవాలి.                                                     *రూపశ్రీ.  

కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం

Publish Date:Jul 17, 2020

సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. జియో గ్లాస్ ఫీచర్స్ - నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. - ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. - ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. - ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. - హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు. - ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. - అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది. - జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.