పవన్ తొలి విడత   ఎన్నికల షెడ్యూల్ ఖరారు 

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి 'వారాహి విజయభేరి' అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ ఈ నెల 30న చేబ్రోలు రామాలయం సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.  కాగా, పవన్ ప్రచార కార్యక్రమాల్లో భద్రతా వ్యవహారాల సమన్వయకర్తలుగా అందె నరేన్, మిథిల్ జైన్ లను నియమించారు. వీరి నియామకానికి పవన్ ఆమోద ముద్ర వేశారు.  జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, మూడు విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో కత్తులు దూస్తుండగా, ఇక పవన్, నారా లోకేశ్ ఎంట్రీ ఇవ్వడమే మిగిలుంది. చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు  పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు.  మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పిఠాపురానికి  పవన్ రానున్నారు. ఏప్రిల్ 3 - తెనాలి, ఏప్రిల్ 4 - నెల్లిమర్ల, ఏప్రిల్ 5 - అనకాపల్లి, ఏప్రిల్ 6 - యలమంచిలి, ఏప్రిల్ 7 - పెందుర్తి,ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్ ,ఏప్రిల్ 10-రాజోలు, ఏప్రిల్ 11 - పి.గన్నవరం, ఏప్రిల్ 12 - రాజానగరం లో పవన్ పర్యటించనున్నారు. 

సికిందరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం.. కాదు కాదు బొంతు!

లోక్ సభ  ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బబీజేపీ, బీఆర్ఎస్ లు ఇప్పుడు ఆ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్  లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి వైదొలగడంతో అక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా బాబూమోహన్ ను నిలబెట్టాలని భావిస్తున్నది. బీఆర్ఎస్ కు రాజీనమా చేసి బీజేపీలోకి అక్కడ నుంచి కేఏపీల్ విశ్వశాంతి పార్టీలోకీ మారిన బాబూమోహన్ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ బామూమోహన్ ను నిలబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి. ఇక సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన దానం నాగేందర్ ను మార్చాలన్న యోచనలో ఆ పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్  గూటికి చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులు పిటిషన్ దాఖలైంది. అది అలా ఉంచితే కాంగ్రెస్ అధిష్ఠానం దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఆయన రాజీనామా చేస్తేనే సికిందరాబాద్ ఎంపీగా టికెట్ ఇస్తామని చెప్పినా కూడా రాజీనామాకు దానం ససేమిరా అంటుండడంతో  కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ గా ఉందనీ, సికిందరాబాద్ నియోజకవర్గంలో దానం కు బదులుగా మరో వ్యక్తిని నిలపాలని భావిస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయ. తాజా సమాచారం మేరకు దానం నాగేందర్ ను సికిందరాబాద్ అభ్యర్థిగా తప్పించి ఆయన స్థానంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నది.  

తాడికొండ రాజయ్య యూటర్న్.. బీఆర్ఎస్ కు చేసిన రాజీనామా ఉపసంహరణ

మాజీ మంత్రి తాడికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టకి రాజీనామా చేసిన తాడికొండ రాజయ్య తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా  కడియం కావ్య పోటీకి దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో తాడికొండ రాజయ్య రాజీనామా ఉపసంహరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు బీఆర్ఎస్ ను సీనియర్లందూ వీడిపోతున్న తరుణంలో పార్టీని వీడిన తాడికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడం విశేషం. అయితే కడియం శ్రీహరితో విభేదాల కారణంగానే పార్టీని వీడినట్లు చెప్పిన రాజయ్య, ఇప్పుడు కడియం శ్రీహరే స్వయంగా బీఆర్ఎస్ ను వీడటంతో తాను పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు రాజయ్య తెలిపారు. కేసీఆర్ అనుమతిస్తే వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కడియం ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. రం.

పెండింగ్ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను  ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది.  ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది. ఆయనను ఆయన కోరుకున్న భీమిలి నియోజకర్గం నుంచే బరిలోకి దింపింది. ఆయనకు ఇద్దామని భావించిన చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా కళా వెంకటరావును ప్రకటించింది.  ఇక కదిరి స్థానంలో ఇప్పటికే  కందికుంట యశోద పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ఆమెకు బదులుగా ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు అవకాశం ఇచ్చింది.  ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చింది. విజయనగరం లోక్‌సభ స్థానానికి   కలిశెట్టి అప్పలనాయుడును అభ్యర్థిగా ప్రకటించింది.  అనంతపురం అర్బన్ స్థానాన్ని ఆశించిన  ప్రభాకర్ చౌదరికి నిరాశ మిగులుస్తూ అక్కడ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించింది. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.  చీపురుపల్లి - కళా వెంకట్రావు,  భీమిలి - గంటా శ్రీనివాసరావు, పాడేరు (ఎస్టీ) - కిల్లు వెంకటరమేశ్ నాయుడు,  దర్శి - గొట్టిపాటి లక్ష్మి,  రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం,  ఆలూరు - వీరభద్ర గౌడ్,  గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్, అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,  కదిరి - కందికుంట వెంకటప్రసాద్ ఇక  లోక్ సభ అభ్యర్థులుగా విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు,  ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ,  కడప నుంచి భూపేశ్ రెడ్డిలను ప్రకటించింది. 

సంక్షోభాలను అధిగమించి.. సమున్నతంగా నిలిచి..!

తెలుగుదేశం పార్టీ  ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది.  అంతే కాదు  జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.  జగన్ కక్ష పూరిత రాజకీయాల కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా 50 రోజులకు పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అందరూ ఇక తెలుగుదేశం పనై పోయిందన్న అనుకునే పరిస్థితులు ఆ ఐదేళ్ల కాలంలో ఏర్పడ్డాయి. అయితే  తెలుగుదేశం మాత్రం  అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయ్యింది. ప్రజల నమ్మకాన్ని గెలిచింది. వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడమే తరువాయి అన్న స్థితికి చేరింది.  అయితే ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనడం, సంక్షోభాల నుంచి బయటపడటం ఆ పార్టీకి కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంక్షోభాలను ఎదుర్కొంది.   అలా ఎదుర్కొన్న ప్రతి సారీ   వాటిని అధిగమించి నిలబడింది.  ప్రజామన్ననలు పొందింది.   బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమి తరువాత ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో చూసిన తరువాత  తెలుగుదేశం విశిష్ఠత, పటిష్ఠతపై తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.   పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత వంద రోజులలోనే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందా అనిపించేలా దిగజారింది.  పార్టీకి భవిష్యత్ లేదని ఆ పార్టీ సీనియర్ నేతలే బాహాటంగా చెబుతూ పక్క పార్టీలలోకి దూకేస్తున్న పరిస్థితి.  బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచే విషయంలోనూ, పార్టీ నేతలలో, క్యాడర్ లో నమ్మకం కలిగించడంలోనూ ఆ పార్ట అధినేత కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా, వారిపై తన ఏకపక్ష నిర్ణయాలను రుద్దిన కేసీఆర్కు  ఓటమి తరువాత పార్టీ నేతలెవరూ అండగా నిలిచేందుకు ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ దయనీయ స్థితికి ఎంపీ టికెట్‌ పొందిన అభ్యర్థి కూడా పార్టీని వీడటాన్ని మించిన నిదర్శనం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పదిహేనేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని విజయవంతంగా నడిపించగలిగారు.  ఈ క్రమంలో వైఎస్ఆర్, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిల నిరంకుశ పాలనను ఎదుర్కొన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలనడానికి ఉదాహరణగా చంద్రబాబు నిలిస్తే.. ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణగా కేసీఆర్ నిలుస్తారని పరిశీలకులు ఉదాహరణలతో సహా విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజలతో ఉండి వారి విశ్వసనీయతను పొందిన నేత చంద్రబాబు అయితే... అధికారంలో ఉండగా జనం నీడ కూడా తనమీద పడకుండా జాగ్రత్తలు తీసుకుని.. ఎన్నికల సమయంలో ప్రసంగాలకే పరిమితమైన నేత కేసీఆర్ అని చెబుతున్నారు.  

అప్పుడు ముందస్తుకు వెళ్లడమే ముంచేసిందా?

భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన  జరిగింది. ఆ తరువాత 2014లో తెలంగాణ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి ఆరు నెలల ముందే అంటే 2018 డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి.  2018 ఎన్నికలలో విజయం సాధించి కేసీఆర్ వరుసగా రెండో సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టారు. అప్పట్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తుకు వెళ్లి మెరుగైన ఫలితాలు సాధించగలిగారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే కేసీఆర్ అప్పట్లో ముందస్తుకు వెళ్లడం వల్ల ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక లతో పాటుగా కాకుండా ముందుగానే అంటే 2023 డిసెంబర్ లోనే జరిగాయి. 2018లో కేసీఆర్ కు ముందస్తుకు వెళ్లడం కలిసి వచ్చింది. కానీ నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల 2023 ఎన్నికలలో ప్రతిపక్షానికి పరిమితం కావలసి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాడు ముందస్తుకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమని ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాడు విపక్షాలను చిత్తు చేసిన వ్యూహంగా ప్రశంసలు గుప్పించిన వారే  నేడు నాటి నిర్ణయం వ్యూహాత్మక  తప్పిదంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికే పరిమితం అవ్వడమే కాకుండా పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కామారెడ్డి స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. ఈ పరాజయం పార్టీ స్థాయినీ, నైతిక స్థైర్యాన్నీ బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఓటమి తరువాత పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్నది. పార్టీ నేతలూ, ఎమ్మెల్యేలూ, ఎంపీలూ కూడా పార్టీని వీడుతున్నారు. గత పదేళ్లుగా ఎవరి సలహాలూ, సూచనలూ పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన అధినాయకత్వం పట్ల బాహాటంగానే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అధినేతకు సన్నిహితులుగా గుర్తింపు పొందిన కేకే, కడియం వంటి వారు కూడా కారు దిగేయడంతో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంలో తెలంగాణ ప్రజల నుంచి కూడా ఎటువంటి స్పందనా రాకపోవడం చూస్తుంటే ఆ పార్టీ పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అవగతమైంది. ఈ పరిస్థితి రానున్న లోక్ సభ ఎన్నికలలో పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటంతో ఇంకా పార్టీలో ఉన్న నేతలలో కూడా అంతర్మథనం ప్రారంభమైందని చెబుతున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ వ్యూహాత్మకంగా దిద్దుకోలేని తప్పిదం చేశారని బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. నాటి తప్పిదానికి ఇప్పుడు పార్టీ ఫలితం అనుభవిస్తోందని అంటున్నారు. 

విజయసాయిరెడ్డికి ఘోర అవమానం... ప్రసంగం వినకుండానే ఇంటి బాట బట్టిన జనాలు 

చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో రావడం తథ్యమని ప్రజలు డిసైడ్ అయిపోయారు. వైసీపీ సభలకు జనం పలచనగా వస్తున్నారు. వైసీపీలో కీలక నేత అయిన విజయసాయిరెడ్డి అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారాంపురంలో ప్రచార రథంపైనుంచి ప్రసంగించేందుకు సిద్ధపడగా జనం ఒక్కసారిగా లేచివెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ఇంటిముఖం పట్టడంతో ప్రచార రథంపై ఉన్న నాయకులు ప్రజలను వెళ్లొద్దని, విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని వేడుకున్నారు. భోజనాలు కూడా ఉన్నాయని, తినేసి వెళ్లాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని, పెద్దాయన (విజయసాయిరెడ్డి) మాట్లాడతారని ప్రచార రథంపై ఉన్న నేత మైక్‌లో ప్రకటించినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా.. వెనక్కి తిగి కూడా చూడలేదు ‘చెప్పేది వినండి, వెనక్కి రండి.. ఇటు చూడండి. వెళ్లిపోయేవాళ్లంతా మాకు కనిపిస్తున్నారు. మీరు పోవద్దు’ అని మైక్‌లో పదేపదే వేడుకోవడం కనిపించింది.

మాధవీలతకు బీజేపీ నేతల మద్దతు కరవు

హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. 1984 నుంచి ఇప్పటి వరకూ హైదరాబద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సలావుద్దీన్ ఒవైసీ, ఆయన తరువాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే ఫలితం మాత్రం కనిపించడం లేదు. అయితే ఈ సారి హైదరాబాద్ లో బీజేపీ పాగా వేసేందుకు ఒకింత సానుకూల వాతావరణం ఉందన్న అంచనాలు ఏర్పడ్డాయి. గత పదేళ్లుగా బీఆర్ఎస్ తో అంటకాగిన ఎంఐఎం పట్ల నియోజకవర్గ ప్రజలలో ఒకింత అసంతృప్తి ఉందని బీజేపీ భావిస్తోంది. దీంతో  ఈ సారి ఎలాగైనా హైదరాబాద్ లోక్ సభ స్థానంలో విజయం సాధించాలన్న పట్టుదలతో  బీజేపీ అడుగులు వేస్తున్నది. అయితే హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో మాత్రం బీజేపీ హై కమాండ్ తప్పుటడుగు వేసిందని పార్టీ రాష్ట్ర నాయకులు అంటున్నారు. స్థానిక నేతలెవరినీ సంప్రదించకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సిఫారసు మేరకు మాధవీలతకు పార్టీ టికెట్ కేటాయించడంతో పోటీ జరగకుండానే పార్టీ పరాజయం ఖరారైపోయిందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతున్నది.  పార్టీ అభ్యర్థిగా మాధవీలత ప్రచార కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర నాయకులెవరూ కనిపించడం లేదు. ఆమె కొద్ది మంది తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో ప్రచారం నిర్వహించుకుంటున్నారు.  అసలు మాధవీలత అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించిన వెంటనే పార్టీ నాయకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. బీజేపీ ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. పార్టీకి హైదరాబాద్ లో పోటీ చేయడానికి మగాళ్లే దొరకలేదా అని ఘాటు విమర్శలు సైతం చేశారు. వాస్తవానికి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజాసింగ్ టికెట్ ఆశించారు. అయితే ఎవరినీ సంప్రదించకుండా బీజేపీ హైకమాండ్ ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటి వరకూ మాధవీలత తరఫున ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచీ గుర్తింపు ఉన్న నాయకులెవరూ మాధవీలతకు మద్దతు పలికిన దాఖలాలు లేవు. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మాధవీలత కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం (మార్చి 29) సాయంత్రం జరగాల్సిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలెవరూ హాజరయ్యే అవకాశాలు లేవని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. మాధవీలత అభ్యర్థిత్వం విషయంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల అసంతృప్తి అధిష్ఠానం బుజ్జగింపులతో తగ్గిపోయే పరిస్థితులు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. కనీసం పార్టీ సభ్యురాలు కూడా కాని మాధవీలతకు పార్టీ టికెట్ ఇచ్చి మరీ పార్టీ కండువా కప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఎంఐఎంకు బీజేపీ ఏ మేరకు పోటీ ఇవ్వగలుగుతుందన్నది అనుమానమేనని అంటున్నారు. 

జగన్ దిగజారుడు రాజకీయాలు!?

రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌  వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్. దీంతో వివేకా హ‌త్య‌ను అడ్డుపెట్టుకొని ప్రజల సానుభూతి పొంది జ‌గ‌న్ భారీ మెజార్టీతో 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాడు. త‌ద్వారా అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. అధికారంలో ఉన్న‌న్ని రోజులు వివేకానంద రెడ్డి హ‌త్య గురించి  ఒక్క మాట కూడా  మాట్లాడ‌ని జ‌గ‌న్‌.. స‌రిగ్గా మళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం వచ్చేసరికి.. మ‌రోసారి వివేకా హ‌త్య‌కేసును అడ్డుపెట్టుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకు స‌రి కొత్త కుట్ర‌కు తెర‌లేపాడు. చిన్నాన్న‌ను చంపింది ఎవ‌రో ఆ దేవుడికి తెలుసు, క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు తెలుసు అంటూ జ‌గ‌న్ అమాయ‌కంగా.. త‌న‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్లుగా  చెప్పుకొచ్చాడు. అదీ   వివేకా హ‌త్య‌కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని ప‌క్క‌న పెట్టుకొని జ‌గ‌న్ అమాయ‌కంగా మాట్లాడంతో వైసీపీ నేత‌లు సైతం నివ్వెరపోతున్నారు.    వివేకానంద హ‌త్య‌కు కీల‌క సూత్ర‌దారులు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డి అని ఆధారాల‌తో సహా సీబీఐ బ‌య‌ట‌పెట్టింది. భాస్క‌ర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. కానీ, వైఎస్ అవినాశ్ రెడ్డి మాత్రం అధికారం ప‌లుకుబ‌డితో జైలుకు వెళ్ల‌కుండా బెయిల్‌పై త‌ప్పించుకు తిరుగుతున్నాడు. అవినాశ్ రెడ్డి జైలుకెళ్ల‌కుండా అడ్డుకున్నది, కాపాడింది స్వయంగా  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే.  సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో  అరెస్టు కాకుండా అధికార‌బ‌లంతో అడ్డుకున్నది కూడా జ‌గ‌నే. ఒక‌ప‌క్క   చెల్లెళ్లు ష‌ర్మిల‌, వివేకా కుమార్తె సునీత‌లు వివేకా హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయిలు అవినాశ్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డి అంటూ నెత్తినోరు బాదుకుంటున్నా ఐదేళ్ల కాలంలో ఏనాడూ జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. స్వ‌యాన అన్నేనిందితులకు అండ‌గా ఉండ‌టంతో చేసేదేమీలేక వివేకా కుమార్తె సునీత కోర్టుల‌కు వెళ్లి నిందితుల‌కు శిక్ష ప‌డేలా పోరాటం చేస్తోంది. అవేమీ ప‌ట్టించుకోని జ‌గ‌న్ రెడ్డి.. ఎన్నిక‌ల స‌మ‌యం రాగానే హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయిగాఉన్న అవినాశ్ రెడ్డిని ప‌క్క‌న పెట్టుకొని.. వివేకాను హ‌త్య‌చేసింది ఎవ‌రో ఆ దేవుడికి తెలుసు.. క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు తెలుసు అంటూ మాట్లాడ‌టం చూస్తే..  ఇంత‌క‌న్నా దిగ‌జారుడు రాజ‌కీయాలు మ‌రెక్క‌డైనా ఉంటాయా జ‌గ‌న్ అంటూ క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు చీద‌రించుకుంటున్నారు.   సార్వ‌త్రిక ఎన్నికల్లో భాగంగా బ‌స్సు యాత్ర ద్వారా ప్ర‌చారం చేప‌ట్టిన సీఎం జ‌గ‌న్‌.. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ఎంపీ అవినాశ్ రెడ్డిని ప‌క్క‌న నిల‌బెట్టుకొనిమ‌రీ వివేకా హ‌త్య గురించి మాట్లాడారు. అవినాశ్ రెడ్డి, నేను స‌త్య‌హ‌రిశ్చ‌ద్రులం అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు న‌చ్చ‌ని ప‌నిఎవ‌రు చేసినా చంద్ర‌బాబు చేయిస్తున్నారంటూ చెప్ప‌డం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఒక అల‌వాటుగా మారిపోయింది. త‌న సొంత చిన్నాన్న కుమార్తె సునీత త‌న తండ్రిని చంపిన నిందితుల‌కు శిక్ష‌ప‌డాల‌ని పోరాటం చేస్తుంటే.. అండ‌గా ఉండ‌కుండా.. ఆమె చంద్ర‌బాబు మ‌నిషి, రాజ‌కీయ ప‌ద‌వికో సం అలా చేస్తున్నారంటూ జ‌గ‌న్ మాట్లాడ‌టం చూస్తే.. జ‌గ‌న్ రెడ్డీ ఇంత‌లా నీచ‌రాజ‌కీయాలు చేయాలా అంటూ ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ నిందితుడ‌ని కోర్టుల్లో స్ప‌ష్ట‌మ‌వుతుంటే.. జ‌గ‌న్ మాత్రం నా త‌మ్ముడు అంటూ మ‌రోసారి క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా అవినాశ్ రెడ్డిని బ‌రిలోకి నిల‌ప‌డం వైసీపీ శ్రేణుల‌నుసైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఒక‌వేళ అవినాశ్ .. నోరు విప్పితే జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి పేర్లు వెలుగులోకి వ‌స్తాయ‌న్న భ‌యంతోనే జ‌గ‌న్ అవినాశ్ ను వెనుకేసుకొస్తున్నారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.   ఇదిలాఉంటే.. ఎన్నిక‌లకు ముందే  అవినాశ్ రెడ్డికి జైలు గండం పొంచిఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అవినాశ్‌ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.  అప్రూవర్ దస్తగిరి పిటిషన్ దాఖ‌లుకు అన‌ర్హుడ‌ని అవినాశ్ త‌ర‌పు లాయ‌ర్లు వాదించారు. కానీ, పిటిషన్ వేసే హక్కు ద‌స్త‌గిరికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ నాలుగో తేదీన దస్తగిరి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు విచార‌ణ‌లో అవినాశ్ రెడ్డి బెయిల్ ర‌ద్దు చేస్తే ఆయ‌న అరెస్టు కావ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతోంది. అదే జ‌రిగితే అవినాశ్ ను జ‌గ‌న్ ఎలా వెన‌కేసుకొని వ‌స్తారన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైకోర్టులో అవినాశ్ బెయిల్ ర‌ద్దు కావ‌టానికి కూడా చంద్ర‌బాబు నాయుడే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ ఆరోపించినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదని పరిశీలకులు అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకా హ‌త్య‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఇప్పుడు కూడా వివేకా హ‌త్య కేసును అడ్డుపెట్టుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అవినాశ్ బెయిల్ ర‌ద్దై.. ఆయ‌న అరెస్ట్ అయితే.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఏమిట‌న్నచర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అదలా ఉంచితే.. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని  కడప జిల్లాలో  జగన్ మాట్లాడిన మాటలకు డాక్టర్ సునీత చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. జగన్ ను జవాబు చెప్పాలంటూ సవాళ్లు విసిరారు.  వివేకా హత్యకు కారకులైన వారిని బాబు నెత్తిన పెట్టుకున్నారు, రాజకీయ పదవుల స్వార్థంతో నా వాళ్ళు ఒకొకరిద్దరు బాబు మాయలో పడిపోయారు అంటూ దస్తగిరిని, సునీత, షర్మిలను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన సునీత  చంపింది నేనే అంటూ దస్తగిరి చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తున్న జగన్  చంపించింది ఎవరో  చెబుతుంటే ఎందుకు నమ్మడం లేదని సూటిగా ప్రశ్నించారు.  చంపింది నేనే అని చెప్పిన వ్యక్తి, చంపించింది వైస్ భాస్కర్ రెడ్డి, వైస్ అవినాష్ రెడ్డి అని, ఆయనకు అండగా నిలబడుతున్నది వైస్ జగన్, వైస్ భారతి రెడ్డి అంటూ చేస్తున్న ప్రకటనలను  ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు.  చిన్నాన్న హత్యను అడ్డుపెట్టుకుని ఒకసారి ఎన్నికలలో పదవులు పొందిన మీరు మళ్ళీ ఆ పదవులను నిలబెట్టుకోవడానికి  మళ్లీ చిన్నాన్న హత్య మీదే ఆధారపడుతున్నారా అంటూ ప్రశ్నించారు.తాను న్యాయం కోసం పోరాడుతుంటే.. ఆ పోరాటానికి జగన్ అడ్డుపడుతున్నారని సూటిగా సుత్తి లేకుండా కుండబద్దలు కొట్టినట్లు సునీత చెప్పేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా గుర్తుకు రాని వైఎస్  వివేకానంద, సరిగ్గా మళ్ళీ ఎలక్షన్స్ ముందు గుర్తొచ్చారా,  రాజకీయ అవసరాల కోసం హత్య రాజకీయాలను వెనకేస్తున్నది మీరు కాదా అని జగన్ ను నేరుగా ప్రశ్నించారు.  వివేకా రెడ్డి ని హత్య చేసింది ఎవరో ఆ దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సునీత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.  అవును జగన్  వివేకాను హత్య చేసిందెవరో దేవుడికీ, జిల్లా ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు అన్నారు.  అందుకే అధికారంలో ఉండి కూడా  ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారని విమర్శించారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వయిరీ అడిగిన జగన్ అన్నా.., అధికారం రాగానే ఎందుకు ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఎంక్వయిరీ చేస్తే మీ పేరు బయటకొస్తుంది అని భయపడ్డారా..? హత్య చేసిన వ్యక్తులను పక్కన పెట్టుకుని వారికీ ఓటు వేయమని అడగడానికి మీకు సిగ్గుగా లేదా..? అంటూ ప్రశ్నలు సంధించారు.  హూ కిల్డ్ బాబాయ్…? అంటూ విపక్ష నేత చంద్రబాబు ప్రశ్నిస్తున్నా ఎన్నడూ స్పందించని జగన్ ఎన్నికల నగార మోగగానే దానికి సంజాయిషీ ఇవ్వడానికి, నేరం మొత్తం పక్కదారి పట్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని సునీత అన్నారు.  ఏది ఏమైనా వివేకా హత్య విషయంలో జగన్  సింపతీ కోసం పాకులాడటం నవ్వు తెప్పిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారు? ఆ హత్య వల్ల గత ఎన్నికలలో లబ్ధి పొందింది ఎవరు అన్న విషయంలో  ఇప్పటికే సందేహాలకు తావులేకుండా ప్రజలకు స్పష్టత వచ్చేసిందని అంటున్నారు. 

హన్మకొండలో కేటీఆర్ పై జీరో ఎఫ్ ఐ ఆర్ కేసు 

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హన్మకొండలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదుతో హన్మకొండ పోలీసులు కేటీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది జీరో ఎఫ్ఐఆర్  పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.నిర్భయ కేసు తరువాత వచ్చిన అనేక చట్టపరమైన మార్పుల్లో ఇదొకటి. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్ లా సవరణ చట్టం 2013లో ఈ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్టును ప్రవేశపెట్టారు.సాధారణంగా పోలీసుల కేసులు అన్నిటికీ ఎఫ్ఐఆర్ నంబరు ఉంటుంది. కానీ ఇలా తమ పరిధి కాని కేసులను తీసుకునేప్పుడు ఆ నంబర్ ఇవ్వకుండా సున్నా నంబర్ ఇస్తారు. తరువాత దాన్ని సంబంధిత స్టేషన్‌కి బదిలీ చేశాక, ఆ రెండవ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నంబరు ఇస్తారు. ముందుగా జీరో నంబర్‌తో నమోదు చేస్తారు కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు.

తెలుగువారి ఆత్మగౌరవ పతాక తెలుగుదేశం!

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు.  ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం. తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి  సాక్షీభూతం.  దేశాన్ని ఏకపక్షంగా పాలిస్తూ రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన తెలుగుదేశం, ఆవిర్భావంతోనే సంచలనం సృష్టించింది.  తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని గర్జించి  పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు, పార్టీని స్థాపించిన  తొమ్మిది నెలలలోనే అధికారంలోకి తీసుకువచ్చారు.  పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల స్వల్ప వ్యవధిలో అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ప్రతిసారి ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఎన్టీఆర్ చేపపట్టిన చైతన్యరథ యాత్ర నభూతో నభవిష్యతి. 1982 మార్చి 29న పార్టీని  ప్రకటించారు తారకరామారావు.  ఎన్టీఆర్  చైతన్యరధం బయలుదేరగానే.. తెలుగు దేశం పార్టీకి బ్రహ్మరథం మొదలైంది. పల్లెలన్నీ ఆయన వెంట కదిలాయి. ఎన్టీఆర్ ఎక్కడికెళ్లినా జన నీరాజనమే. ఇసుక వేస్తే రాలనంత జనమే.  గ్రామాలు గ్రామాలే ఆయనకు జై కొట్టాయి. ముందు లీడర్లెవరు ఆయనకు మద్దతుగా నిలవలేదు. రాజమండ్రిలో గోరంట్ల రాజేంద్రప్రసాద్ తమ్ముడు పార్టీ జెండా కట్టారు. కడియంలో  వడ్డి వీరభద్రరావు  సభ్యత్వ పుస్తకాలు పట్టుకుని  రాజ్ దూత్ బండి మీద తిరిగారు.  బూరుగుపూడి పెందుర్తి సాంబశివరావు పార్టీ జెండా ఎత్తారు. ఇలా ఒక్కొక్కరు అన్నగారికి తోడయ్యారు. మండు వేసవిలో అన్నగారి పర్యటన సాగుతున్నా.. జన జాతర ఆగలేదు. ఆయన ప్రత్యర్ధులు మాత్రం సినిమా ఆకర్షణగానే భావించారు .. అలాగే వ్యాఖ్యానించేవారు. వేషాలు వేసుకునేవాళ్లకు ఓట్లు పడతాయా అంటూ అవహేళన చేశారు. ఎన్టీఆర్ పర్యటనకు ఆటంకాలు కల్పించారు. వసతి దొరక్కుండా చూసేవారు.  అయినా అన్నగారి జోరు తగ్గలేదు. అప్పడు ఏ బండికి చూసినా తెలుగుదేశం పిలుస్తుంది రా  కదలిరా  స్టిక్కర్లే.  వేలాది మంది కార్యకర్యలే సొంత డబ్బులతో జెండాలు కొని మోసారు. చైతన్య రథంపై నుంచి ఖాకీ డ్రెస్ లో ఎన్టీఆర్ మాటల తూటాలు..ఉర్రూతలూగించే ప్రసంగాలకు జనాలు ఫిదా అయ్యారు. చైతన్యరధయాత్ర సాగుతుండగానే ఎన్నికలు వచ్చేశాయి. కొంత మందిని ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్లు ఇస్తానంటే.. వద్దని కాంగ్రెస్ తరుపున నిలిచారు. అలాంటి వారిలో నీరుకొండ నారయ్య చౌదరి..రాయవరం మునసబు ఉండవల్లి సత్యనారాయణమూర్తి లాంటి నేతలు ఉన్నారు. ఎన్నికలు ముగిశాయి. అయినా కాంగ్రెస్ నేతలకు దింపుడు కళ్ళం ఆశ చావలేదు. సినీ గ్లామరుకి ఓట్లు పడవని వారికి నమ్మకం. అమ్మ బొమ్మకే ఓటేస్తారని వాళ్ల విశ్వాసం.  కౌంటింగ్ మొదలైంది. సాయంత్రం మొదటి ఫలితం షాద్ నగర్... కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహంగా ఉన్నారు. రేడియో వార్తల్లో ఫలితాల సరళి వెల్లడవుతున్నది. ఒక్కో జిల్లా వారీగా వరుసగా ఆధిక్యతలు చెబుతూ వస్తున్నారు. జిల్లాలకు జిల్లాలు తుడుచిపెట్టుకుపోయాయి. ఎన్టీవోడి దెబ్బకు వేళ్ళూనుకున్న కాంగ్రెస్ మహావృక్షాలు కూలిపోయాయి. ఒక్కో నియోజక వర్గం ఆధిక్యతలు చెబుతుంటే జనం స్పందన జేజేలు..ప్రత్యర్ధుల హాహాకారాలు..ఆర్తనాదాలు. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ...ఈ రీతి విజయాన్ని వారు ఊహించలేదు. దాదాపు అర్ధరాత్రికే మూడింట రెండొంతులు పైగా స్దానాలు కైవసం చేసుకుంది తెలుగు దేశం పార్టీ. డాక్టర్లు..ఇంజినీర్లు.. లాయర్లు..పట్టభద్రులు.. బడుగుబలహీన వర్గాలకు చెందిన కొత్తరక్తం రాజకీయాల్లో అరంగేట్రం చేసారు. ఆంధ్రప్రదేశ్ ఫలితం అప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి తెలుగు దేశ పార్టీ 202 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది.   వేషాలు వేసుకునేవాడంటూ హేళన చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏపీ ఫలితాలు చూసి షాకయ్యారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి తారకరామారావు.  దీంతో తెలుగురాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తో నవశకం ప్రారంభమయింది. బడుగుబలహీన వర్గాల వేదికయింది. తెలుగు వాడి ఆత్మగౌరవానికి..ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయింది.   1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. అప్పటి లోక్‌సభలో  ప్రధాన ప్రతిపక్షమయింది.  అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాకర్షక పథకాలతో జనాల గుండెల్లో చోటు సంపాదించారు నందమూరి తారక రామారావు. ఆయన ప్రవేశపెట్టిన కిలోబియ్యం రెండు రూపాయల పధకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆయనను పేదవాడి అన్నంముద్దగా మార్చింది. ఇప్పటికీ ప్రజలు రెండు రూపాయల కిలోబియ్యం పథకం గురించి మాట్లాడుకుంటూ అన్నగారిని స్మరించుకుంటున్నారంటే.. ఆ పథకం ఎంతగా పాపులర్ అయిందో ఊహించవచ్చు. పేదల కోసం కూడు, గుడ్డ, గూడు నినాదంతో పాలన సాగించారు ఎన్టీఆర్. వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా.. తన సంక్షేమ పాలతో పేద ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్న ఎన్టీఆర్. "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి  నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు. ఆరోగ్య కారణాలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలిపారు.తెలుగువారి పౌరుషాన్ని చూపించారు. ఎన్టీఆర్ పోరాటంతో  చేసేది లేక ఇందిరాగాంధీ తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేశారు . కానీ ఎన్టీఆర్ 1984 లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి తన సత్తా ఏంటో ఇందిరాగాంధీకి మరో సారి చూపారు. చూపించారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది.  అయినా కుంగిపోకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు రామారావు.  దేశంలో  కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని,  జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చారు.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించారు.  కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు.  "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు ఎన్టీఆర్.  1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.   అయితే రామారావు భార్యగా వచ్చిన లక్ష్మీపార్వతి..  పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో  అప్పటి రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీని రక్షించుకునే లక్ష్యంతో  తిరుగుబాటు చేశారు. అధికారాన్ని దక్కించుకున్నారు.  అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది. 1995వ సంవత్సరంలో ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు  చంద్రబాబు 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.  అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా  చరిత్ర సృష్టించాడు. తన పాలనలో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చారు చంద్రబాబు. హైదరాబాద్ ను ప్రపంచ పఠంలో పెట్టారు. సైబరాబాద్ నగరాన్నే నిర్మించారు. స్వర్ధాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు చేసిన పాలన దేశ రాజకీయాల్లో చర్చగా మారింది. తన తొమ్మిదేండ్ల పాలనలో హైదరాబాద్ రూపురేఖలే మార్చేశారు చంద్రబాబు. 1999లో 29 ఎంపీ స్ఠానాలు గెలిచిన తెలుగు దేశం పార్టీ.. పార్లెమంట్ లో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీసింది. చంద్రబాబు విజన్... అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచింది. చంద్రబాబు దార్శనికత, ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అయువుపట్టుగా మారాయి. చంద్రబాబు విజన్ వల్లే తెలంగాణ ప్రస్తుతం ధనిక రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో  తెలుగుదేశం విజయం సాధించింది. విభజిత ఆంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన విజన్ తో  రాజధాని సైతం లేకుండా, రెవెన్యూలోటుతో మిగిలిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ప్రపంచదేశాలే నివ్వెరపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అంకురార్పణ చేశారు. గతంలొ ఎన్నడూలేని విధంగా రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. భూసమీకరణ ద్వారా పైసా ఖర్చు లేకుండా రైతులు తమ భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రధాని మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ అసూయపడేలా అమరావతి నిర్మాణం సాగాలని ఆశీర్వదించారు. కియా మోటార్స్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా మూడు సంవత్సరాలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.   2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా జగన్ ఈ ఐదేళ్లలో చేయని ప్రయత్నం లేదు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై వేధింపులే లక్ష్యంగా ఆయన పాలన సాగింది. స్కిల్ కేసు అంటూ చంద్రబాబును సైతం అక్రమంగా అరెస్టు చేశారు.  అయితే తెలుగుదేశం పార్టీ అన్ని అడ్డంకులనూ అధిగమించి చెక్కు చెదరకుండా నిలిచింది.    ఎన్టీఆర్‌ ఆశయాలు, ఆలోచనలు, విధానాలకు అనుగుణంగానే పనిచేస్తోంది.  ఇనుమడించిన ఉత్సాహంతో రానున్నఎన్నికలలో విజయం సాధించి అధికారపగ్గాలు అందుకోవడానికి ఉరకలేస్తోంది. ప్రజల అభిమానమే ఆయుధంగా అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్ఱావ దినోత్సవం సందర్భంగా   తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ సుదీర్గ ప్రస్థానాన్ని, చేసిన పోరాటాలను మననం చేసుకుంటూ,  స్ఫూర్తితో  రాబోయే ఎన్నికలలో విజయం సాధించి మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది.     తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజి డీసిపి రాధాకిషన్ అరెస్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ ఐల విచారణ పూర్తైన సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం ఈ కేసుకు సంబంధించి పలువురి వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. వారి వాంగ్మూలాల ఆధారంగానే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అలాగే తిరుపతన్న, భుజంగరావులను కూడా పోలీసులు ఇప్పుడో ఇహనో అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తాజాగా రాధాకిషన్ ను అరెస్టు చేయడానికి  ముందు ఆయనను దాదాపు పది గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.   రాధాకిషన్  అసెంబ్లీ ఎన్నికల సమయంలో హవాలా వ్యాపారులను నిర్బంధించి  డబ్బులు ఒక పార్టీకి చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు వ్యాపారులపై రాధా కిషన్‌ రావు నిఘా పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే మాజీ డీసీసీ రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రణీత్‌ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై   నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో  వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

బీఆర్ఎస్ పనైపోయినట్లేనా? సీనియర్ల వలసల సంకేతం అదేనా?

అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌..  అధికారం కోల్పోయిన త‌రువాత  పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా కేసీఆర్‌కు ద‌గ్గ‌ర వ్య‌క్తులుగా పేరున్న నేత‌లు సైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌రిలో నిలిపేందుకు అభ్య‌ర్థులు సైతం క‌రువైన ప‌రిస్థితి. సిట్టింగ్ ఎంపీలు అనేక మంది బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్‌, బీజేపీల్లో చేర‌డంతో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త వారిని బ‌రిలో నిల‌పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి కుమార్తెకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం, ఆమె పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో పాటు తన తండ్రి క‌డియం శ్రీ‌హ‌రితో స‌హా   కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.  శుక్రవారం (మార్చి 29) వీరిరువురూ  హస్తినలో ఢిల్లీ పెద్దలను కలిసి హస్తం కండువా కప్పుకోనున్నారు. కడియం కావ్యను కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నారు. అలాగే  కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన  కే. కేశ‌వ‌రావుసైతం బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి బీఆర్ ఎస్ ప‌దేళ్ల పాల‌న‌లో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై గురిపెట్టారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, గొర్రెల పంపిణీ ప‌థ‌కంతో  సహా ప‌లు ప‌థ‌కాల్లో అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌ను  కుదిపేస్తోంది. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ప్ర‌త్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి మరీ రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని ముఖ్య‌నేత‌ల‌ ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్లు  స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు ప‌లువురు పోలీస్ అధికారుల అరెస్టుతో ఫోన్ ట్యాపింగ్ డొంక క‌దులుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం బీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌ల మెడ‌కు చుట్టుకునే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాలతో  ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో బీఆర్ ఎస్ పార్టీలో కొన‌సాగితే రాజ‌కీయ  మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని భావిస్తున్నకొంద‌రు ముఖ్య‌నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. నేత‌లు పార్టీ మార‌కుండా కేసీఆర్‌, కేటీఆర్ లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ క‌నీస స్థానాలలో కూడా విజయం సాధించడం అనుమానంగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నుంచి వలసలు కూడా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌లుగా, కేసీఆర్ కు సన్నిహితులుగా పేరొందిన కే. కేశ‌వ‌రావు, క‌డియం శ్రీ‌హ‌రి లాంటి వారు పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌ల‌తో బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వరంగల్ లోక్ సభ నుంచి బీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా క‌డియం శ్రీ‌హ‌రి కుమార్తె కావ్య‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఇటీవ‌ల ఆమె కేసీఆర్ ను క‌లిసి ఆశీర్వాదం సైతం తీసుకున్నారు. కానీ  అనూహ్యంగా ఆమె పోటీ నుంచి విరమించుకుంటున్నానని   లేఖ విడుద‌ల చేయ‌డం బీఆర్ ఎస్ శ్రేణుల‌ను అయోమ‌యానికి గురిచేస్తోంది.  బీఆర్ఎస్ పై అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు  కావ్య‌ తన లేఖలో వివరించారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నట్లు లేఖలో   పేర్కొన్నారు. అయితే  కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్ద‌రూ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే శ్రీ‌హ‌రితో కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు ప‌లు ద‌ఫాలుగా భేటీ అయిన‌ట్లు స‌మాచారం.  వారం రోజుల క్రిత‌మే శ్రీ‌హ‌రి బీఆర్ ఎస్ ను వీడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న కుమార్తె కావ్య‌కు ఎంపీ టికెట్ ఇవ్వ‌డంతో వారు బీఆర్ ఎస్ లోనే కొన‌సాగుతున్నార‌ని అంద‌రూ భావించారు. కానీ, ఊహించ‌ని రీతిలో కావ్య పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌ట‌కించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఆమె కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావుసైతం బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు.    గురువారం (మార్చి 28) కేసీఆర్ తో భేటీ అయిన కే. కేశవరావు పార్టీని వీడుతున్న‌ట్లు చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో కేకే తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే  కేశ‌వ‌రావు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారని అంటున్నారు. ఇప్ప‌టికే కేశ‌వ‌రావు కుమార్తె, హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ శనివారం (మార్చి 30) కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆమెతోపాటు అదేరో జు కేశ‌వ‌రావు కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది. కేశ‌వ‌రావుతో పాటు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మ‌రికొంద‌రు బీఆర్ ఎస్ నేత‌లు కాంగ్రెస్  గూటికి చేరనున్నట్లు స‌మాచారం. మొత్తానికి అధికారం కోల్పోయిన కొద్ది నెల‌ల్లోనే బీఆర్ ఎస్ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌టంతో  బీఆర్ఎస్ ఖాళీ అయ్యేందుకు ఎక్కువ కాలం పట్టదని అంటున్నారు. 

రేణిగుంట గోడౌన్లలో చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు

ప్రజలను ప్రలోభాలకు గురి చేసి  ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి  తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి. డుగులు, కండువాలు, జెండాలు, ఆమ్ప్లిఫైర్లు, టోపీలు , టీషర్స్ ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతాలలోని మరిన్ని గోడౌన్లలో కుక్కర్లు, ఫ్యాన్లతో పాటు నోట్ల కట్టలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. విషయం బయటపడగానే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మీడియాను అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. వాటన్నిటికీ బిల్లులు ఉన్నాయంటూ అధికారులు చెప్పడంపై తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. వెంటనే ఎస్పీ, కలెక్టర్ స్పందించి చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశేషమేమిటంటో ఆ గోడౌన్లో డమ్మీ ఈవీఎంలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికలలో ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడేందుకు వైసీపీ తెగించేసిందో అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  

మేడిగడ్డ బ్యారేజి రిపేర్ పై  కెటీఆర్ తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే

పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్వకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తమ తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దొంగనే పోలీస్ అధికారిని దొంగ దొంగ అన్నట్టు ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ కో డాటే  అంటారు.  అహో ధార్ష్ట్య మసాధూనాం నిందతా మనఘాః స్త్రియః మృష్ణతా మివ చోరాణాం తిష్ఠ చోరేతి జల్పతాం పవిత్రలూ, శీలవతులూ అయిన స్త్రీలను నిందించే దుర్మార్గులైన పురుషులను ఏమనవచ్చు  తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే, ఇది కాలం తెచ్చిన కరువు కాది, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో రైతులకు పుష్కలంగా సాగు నీటిని అందించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి, హైదరాబాద్ కి మధ్య తిరగడం తప్ప.. రైతులను పరామర్శించేందుకు సీఎం రేవంత్ కు సమయం లేదని అన్నారు.  ఇప్పటి వరకు సుమారు 200 మంది రైతులు చనిపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని... ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం అందించాలని చెప్పారు. ఎకరానికి రూ. 10 వేలు ఇస్తారో, రూ. 25 వేలు ఇస్తారో ఇవ్వండని అన్నారు. రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రైతుబంధు కోసం కేసీఆర్ రూ. 7 వేల కోట్లు పెట్టిపోతే... ఆ డబ్బులు రైతులకు ఇవ్వకుండా... కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతుల దీన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.  

బండి సంజయ్ పై కేసు నమోదు 

ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది.   కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. చెంగిచెర్లలో  ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు.బండి సంజయ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడకు రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎవరినీ లోనికి అనుమతించకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న బండి సంజయ్, కార్యకర్తలు బారీకేడ్లను తోసుకొని లోనికి వెళ్లారు. ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించారు. వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు, కబేళా నిర్వాహకులు కక్షతో పేద గిరిజన మహిళలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బస్తీకి వచ్చి మరీ మహిళలు, పిల్లలపై దాడులు చేశారని, ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తన విధులకు ఆటంకం కలిగించారని, తనపై దాడి చేశారని నాచారం సీఐ ఫిర్యాదు చేశారు.

భూమా అఖిలప్రియ అరెస్ట్ 

ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.       ప్రజల జీవితాల్లో   వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంలో టిడిపి నేత భూమా అఖిల ప్రియ జగన్ ప్రభుత్వం దగ్గరకు  వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగానే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయిదీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సభా ప్రాంగణం వద్ద కలకలం రేగింది. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకనే నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలిపారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ

బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థిగా సిర్పూర్ నియోజకర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆ తరువాత బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. అలా చేరడానికి ముందు లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి పోత్తును గుర్తించలేదు. ఏ పార్టీతోనూ బీఎస్పీకి పొత్తు లేదని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి కారెక్కేశారు. ఇలా కారెక్కారో లేదో అలా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనను నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి టికెట్ ఇచ్చేశారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటీ చేసిన సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో బహుజనులు ప్రవీణ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను బహుజన ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  సిర్పూరు నియోజ‌కవ‌ర్గంలో బీఆర్ఎస్ కార్యక‌ర్తల స‌మావేశంలో పాల్గొనేందుకు ప్రవీణ్ కుమార్ హాజరు కానున్న తరుణంలో ఆయనకు వ్యతిరేకంగా కొమురం భీం జిల్లా కౌటలలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరడంనూ  బహుజనుల వ్యతిరేత ఆయన పోటీ చేస్తున్న నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.