Read more!

పాపం విద్యాశాఖా మంత్రి గారు.. జనగణమన కూడా రాదు..

మన జాతీయ గీతం పాడమంటే చిన్న పిల్లవాడిని అడిగినా గడగడా పాడేస్తాడు. కానీ ఆ రాష్ర విద్యాశాఖా మంత్రి మాత్రం జాతీయ గీతాన్ని ఖూనీ చేసి పారేసారు. బీహార్ లో కొద్దీ రోజుల క్రితం ఎన్నికలు పూర్తయి మళ్ళీ నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెల్సిందే. తాజాగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న అక్కడి విద్యాశాఖా మంత్రి జాతీయ గీతం పాడే విషయంలో అడ్డంగా బుక్కయి ఇపుడు హాట్ టాపిక్ గా మారారు.

 

బీహార్ లో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవాలాల్ ఛౌదరి ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం లో భాగంగా జాతీయ గీతాలపన చేస్తూ తప్పులో కాలేశారు. జనగణమన పాడడం రాక.. తన నోటికొచ్చింది పాడుతూ.. అయన నవ్వుల పాలయ్యారు. అయితే ఈ వీడియోను ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అయింది. అంతేకాకుండా "ఎన్నో అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖమంత్రి మేవాలాల్ చౌదరికి జాతీయ గీతం పాడడం కూడా రాదు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకైమైనా ఉందా? నితీష్‌జీ మీ అంతరాత్మ ఎక్కడ మునిగిపోయింది.'' అంటూ వీడియోతో పాటు ట్వీట్ చేసింది ఆర్జేడీ. ఆ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు మాత్రం.. నిజంగా ఇది సిగ్గుచేటని.. ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి జాతీయ గీతం పాడడం రాదా.. ? అని మండిపడుతున్నారు.

 

ఇది ఇలా ఉండగా, మంత్రి మేవాలాల్ చౌదరిపై ఇప్పటికే పలు అవినీతి కేసులున్నాయి. గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీల్లో లెక్చరర్ల నియమకాల్లో అక్రమాలు జరిగాయని.. అందులో కోట్ల రూపాయలు చేతులు మారాయని మేవాలాల్‌పై ఆరోపణలున్నాయి. అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గతంలో మంత్రి పదవి నుంచి కూడా తప్పించారు. ఐతే తాజాగా ఏర్పాటైన బీహార్ కొత్త ప్రభుత్వంలో మేవాలాల్‌కు మళ్లీ కీలకమైన విద్యాశాఖా మంత్రి పదవి ఇవ్వడంపై తాజాగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.