Read more!

జగన్ సర్కార్ పిటిషన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇచ్చిన ఆదేశాలను సవరించాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్ ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలు సవరించాలని కోరారు. అయితే, ఎన్నికల సంఘం ఏదైనా అభివృద్ధి పనులు ఆపిందా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. కొత్తగా ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు ఎస్ఈసీ అనుమతి ఎలా తీసుకుంటామని రోహత్గి ప్రశ్నించారు.

 

ఈసీ తరపు న్యాయవాది పరమేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికలు రద్దు చేయలేదని, వాయిదా మాత్రమే వేశారని తెలిపారు. దీంతో నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఎస్ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దరఖాస్తు పై తీసుకున్న నిర్ణయానికి తగిన కారణాలు ఎస్ఈసీ తన ఆర్డర్ లో తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమతి ఇవ్వకపోతే తిరిగి సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిందింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.