Read more!

గ్రేటర్ టికెట్ల కోసం పోటీ! టీటీడీపీలో జోష్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన టీటీడీపీ నేతలు బలమైన అభ్యర్థులును రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే టికెట్లు కావాలంటూ వారికి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో టీటీడీపీ నేతలు అశ్చర్యపోతున్నారట. గ్రేటర్ లో పోటీ చేయాలని భావిస్తున్న అశావహులతో ఎన్టీఆర్ భవన్ కళకళలాడుతుందని చెబుతున్నారు. నేతలు రాక ఇటీవల కాలంలో బోసిపోయినట్లు కనిపించిన ఎన్టీఆర్ భవన్ కు చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారని చెబుతున్నారు.

 

అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతీ డివిజన్‌లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది టీటీడీపీ. అయితే వారికి ఊహించని రీతిలో స్పందన వస్తోందట. ఒక్కో డివిజన్‌కు రెండు నుంచి ఐదు వరకు దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. టీటీడీపీ సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ టీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్ అశావాహులను వడపోస్తున్నారని తెలుస్తోంది. 80 మంది బలమైన అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేశారని సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసి సత్తా చాటాలని కంభంపాటి టీటీడీపీ నేతలను సూచించారు. అభ్యర్థుల ఎంపిక కోసం తాను అన్ని డివిజన్లలో పర్యటించానని, మంచి స్పందన వచ్చిందని అరవింద్‌కుమార్ గౌడ్ తెలిపారు.