Read more!

కీలకు దశకు చేరుకొన్న ఆర్టీసీ సమ్మె

 

ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రభుత్వాలు రెండూ కూడా ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు నేతృత్వంలో మంత్రుల సబ్-కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఈరోజు ఉదయం9-10 గంటల మధ్య సమావేశమవుతుంది. అదేవిధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు.

 

ఇక ఈరోజే ఉదయం 10 గంటలలోగా సమ్మె విరమిస్తున్నట్లు తమకు తెలియజేయాలని హైకోర్టు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ఆదేశించినందున వారు కోర్టుకి కూడా తమ అభిప్రాయం చెప్పవలసి ఉంది. హైకోర్టు ఆదేశాన్ని మన్నిస్తూ సమ్మె విరమణ చేసినట్లయితే ఇప్పుడిప్పుడే దిగివస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ బిగుసుకుపోతాయని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. కనుక ఈరోజు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు పూర్తయ్యేవరకు, హైకోర్టు ఒత్తిడి చేస్తున్నప్పటికీ వారు సమ్మె విరమణకు మొగ్గు చూపకపోవచ్చును. మరి వారి ఈ సమస్యను అర్ధం చేసుకొని హైకోర్టు వారికి మరికొంత సమయం గడువు ఇస్తుందో లేదో మరి కొద్ది సేపటిలో తేలిపోనుంది.