Read more!

కరోనా పేరుతో తిరుపతి ఎన్నిక ఆపుతారా! వైసీపీని నిలదీసిన బోండా

ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. జగన్ అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారంతా వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే ఎన్నికలను వాయిదా వేస్తుందని విమర్శించారు. వైసీపీకి ధైర్యముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సహకరించాలని సవాలు విసిరారు బోండా ఉమ. ఎన్నికలకు భయపడుతూ ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు చేయేడమేంటనీ ఉమ మండిపడ్డారు.

 

కరోనా పేరుతో ఎన్నికలు వద్దంటున్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీలో బడులు ఎందుకు తెరిచిందని బోండా ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యం అంటే వైసీపీకి లెక్క లేదా? అని ఆయన నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతున్నట్లే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను కూడా కరోనా పేరుతో వైసీపీ నిలిపివేయగలదా అని బోండా ఉమ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ను తిడుతోన్న ప్రభుత్వం దేశంలో ఒక్క వైసీపీయేనని ఆయన విమర్శలు గుప్పించారు. జడ్జిలపై కూడా వైసీపీ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసిందని చెప్పారు.