Read more!

ఒక్క దుబ్బాకలో ఓడిస్తేనే ఇన్ని! గ్రేటర్ లో ఓడిస్తే ఇంకెన్నో..?

అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా మంచే.. ఆయన ఏం చెప్పినా బంగారమే. ఒక్కసారి ఫలితం మారిందే అంతా రివర్సే, ఆయనకు అన్ని అడ్డంకులే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు అచ్చం ఇలానే ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితే అంతా ఆయనకు వ్యతిరేకంగానే మారుతోంది. పండగ పూట ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నా కేసీఆర్ సర్కార్ కలిసిరావడం లేదు. రాయితీలు, తాయిలాలు, హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రిని అభినందించాల్సి పోయి ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియ వేదికగా కేసీఆర్ సర్కార్ పై దీపావళి బాంబుల మోతను మించి సెటైర్లు పేల్చుతున్నారు జనాలు. 

 

దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణలోని అన్ని పట్టణాలు , నగరాల్లోనూ ఆస్థి పన్నులో 50 శాతం తగ్గించింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఏడాదికి 15 వేల వరకు ఆస్తి పన్ను చెల్లించేవారికి, ఇతర మున్సిపాల్టీల్లో 10 వేల రూపాయల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వారికి ఇది వరిస్తుందని తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా సీఎం కేసీఆర్ దీపావళి కానుక ఇచ్చారని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అంతేకాదు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నశానిటేషన్ సిబ్బంది వేతనాలను మరో 3 వేల రూపాయలు పెంచింది. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ జీతాలు విడుదల చేశారు. చాలా కాలంగా వెయిటింగ్ లో ఉన్న కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలకు ఆమోద ముద్ర వేశారు సీఎం కేసీఆర్. 

 

సీఎం కేసీఆర్ దీపావళి కానుక ఇచ్చారని మంత్రి కేటీఆర్ చెబుతున్న రాయితీలు, నిర్ణయాలపై తెలంగాణ ప్రజల నుంచి మాత్రం భిన్న స్పందనలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసమే ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందనే అభిప్రాయమే మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది. కేసీఆర్ సర్కార్ ప్రకటించిన రాయితీలు, హామీలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు నెటిజన్లు. దుబ్బాకలో ఎదురైన ఒక్క ఓటమితోనే కేసీఆర్ దిమ్మతిరిగిపోయిందని పోస్టులు పెడుతున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఓడించినందుకే ఆస్తి పన్నులో 50 శాతం రాయితి వచ్చిందని, శానిటేషన్ కార్మికుల జీతాలు పెరిగాయని కామెంట్లు చేస్తున్నారు.  దుబ్బాకలో  కారుకు బ్రేకులు వేయగానే.. గతంలో ఎంత మెత్తుకున్నా కనికరించని సర్కార్  ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిందని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపైనా సానుకూలంగా స్పందించిందంటున్నారు.