Read more!

ఫోన్‌ని బట్టి మనస్తత్వం

మొబైల్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఏముంది! ఒక దశాబ్ద కాలంలోనే మొబైల్‌ ఫోన్‌ మన జీవితంలో భాగంగా మారిపోయింది. అన్నింటికీ మొబైల్ ఫోన్లనే వాడుకోమంటూ ఏకంగా నగదుని కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ ఒక సమాచార సాధనం మాత్రమే కాదు.. ఏ పనిలో అయినా తోడుగా ఉండే ఓ నేస్తం. మన హోదాకి సైతం ఓ సంకేతం! అందుకనే కొత్త మొబైల్‌ను ఎన్నుకొనేటప్పుడు ఆచితూచి ఎన్నుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఎంపికలో మన మనస్తత్వం కూడా బయటపడుతుందా! అంటే అవుననే జవాబు వస్తోంది. ఇంగ్లండులోని లాంకెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఐఫోన్, ఆండ్రాయిడ్‌ ఫోన్లని వాడేవారి మనస్తత్వాల మధ్య తేడాలు ఏమన్నా ఉన్నాయేమోనని పరశీలించారు. అందులో...

 

ఆండ్రాయిడ్ ఫోనుని ఇష్టపడేవారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి-

- మగవారు ఎక్కుగా ఈ ఫోనుని ఇష్టపడుతున్నారు.

- అందులోనూ పెద్దలు ఆండ్రాయిడ్ ఫోన్లంటే ఆసక్తి చూపుతున్నారు.

- ఆండ్రాయిడ్ వాడకందారులు సమాజానికి అనుగుణంగా నడుచుకునే మనస్తత్వం కలిగి ఉంటారట.

- వ్యక్తిగత లబ్ది కోసం ఇతరులను ఇబ్బంది పెట్టనివారై ఉంటారు.

- సంపద, హోదా వంటి తాపత్రయాల జోలికి పోరు.

- నిజాయితీగా ఉండేందుకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు.

 

ఐఫోను వాడకందారులలో ఈ స్వభవాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి-

- యువకులు ఎక్కువగా ఫోనుని ఇష్టపడుతున్నట్లు తేలింది.

- యాండ్రాయిడ్‌తో పోల్చుకుంటే ఆడవారి మనసు ఐఫోను మీదే లగ్నమవుతుందట.

- ఒక వస్తువుని ఎంచుకునే విషయంలో వీరు ఇతరులతో రాజీపడరు.

- వీరు ఫోనుని ఒక సాధనంగానే కాకుండా, తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు.

- బహిర్ముఖ మనస్తత్వంతో (extrovert) అందరితో కలివిడిగా కలిసిపోయేలా ప్రవర్తిస్తుంటారు.

 

ఈ వివరాలన్నింటి ఆధారంగా పరిశోధకులు ఒక ప్రోగ్రాంను కూడా రూపొందించేశారట. దానికి మన మనస్తత్వానికి సంబంధించిన కొన్ని వివరాలను అందిస్తే, మనం ఏ ఫోనుని వాడుతున్నామో చెప్పేస్తుంది. మనం వాడుతున్న ఫోను మన జీవితంలో విడదీయరాని భాగం అయిపోయింది కాబట్టి... దానిని మన మనస్తత్వానికి ఒక డిజిటల్ రూపంగా భావించడంలో తప్పులేదంటున్నారు. అందుకనే మున్ముందు జనం డౌన్‌లోడ్‌ చేసుకునే అప్లికేషన్లని బట్టి కూడా వారి మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రయత్నం చేయవచ్చునని అంటున్నారు.

 

- Nirjara