Read more!

తిరుపతి కింగ్ టీడీపీనే.. తేల్చేసిన ప్రీ పోల్ లెక్కలు!!

రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదు. 'ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి' అనే ఫార్ములా రాజకీయాలకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ తదుపరి ఎన్నికల్లో బొక్కబోర్లా పడొచ్చు.. అబ్బే ఈ పార్టీ పనైపోయిందనుకున్న పార్టీ అనూహ్యంగా పుంజుకొని గెలుపు జెండా ఎగరవేయొచ్చు. అందుకే అంటారు.. రాజకీయాల్లో వాపులు ఉంటాయి కానీ బలుపులు ఉండవు. ఇక్కడ గెలుపు.. వాపు లాంటిది. ఆ వాపు ఎప్పుడైనా కరిగిపోవచ్చు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 లోక్ సభ సీట్లతో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైసీపీకి.. గెలుపు వాపు కరిగిపోయే పునాది తిరుపతిలో పడుతుందా అంటే? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.

 

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభకు త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ..తన సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో జరిగినట్లే సంచలనం చేయబోతున్నామని, దుబ్బాక ఫలితం తిరుపతిలో రిపీట్ కాబోతుందని ప్రకటిస్తోంది. కాని క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ వేరేలా ఉంది. తిరుపతిలో టీడీపీ విజయం ఖాయమని తెలుస్తోంది. వైసీపీ ఓడిపోవడానికి 10 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

 

తిరుపతి ఎస్సీ రిజర్వ్ లోక్ సభ నియోజకవర్గం
2019 లెక్కల ప్రకారం తిరుపతిలో మొత్తం ఓటర్లు 15 లక్షల 74 వేల 161
2019 ఎన్నికల్లో 79.76 శాతం ఓటింగ్ తో 13,16,473 ఓట్లు పోల్
55.3 శాతం ఓట్లతో వైసీపీకి 7 లక్షల 22 వేల 877 ఓట్లు
37.65 శాతంతో టీడీపీకి 4 లక్షల 94 వేల 501 ఓట్లు
అనూహ్యంగా 1.96 శాతం ఓట్లతో నోటాకు మూడో స్థానం
నాలుగో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కు 1.83 శాతం ఓట్లు
జనసేన మద్దతుతో బరిలో ఉన్న బీఎస్పీకి 1.6 శాతం పోల్
కేవలం 1.2 శాతం ఓట్లతో బీజేపీకి ఆరో స్థానం

 

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద రావు 2 లక్షల 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై విజయం సాధించారు. టీడీపీ కంటే వైసీపీకి దాదాపు 17 శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. తిరుపతిలో 2019లో ఘనవిజయం సాధించిన వైసీపీకి రెండేళ్లు కూడా తిరగకుండానే సీన్ రివర్స్ అయింది. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు 10 బలమైన కారణాలు ఉన్నాయి.

 

కారణం1.. డ్వాక్రా మహిళలు...
ఏపీ ఓటర్లలో 95 లక్షల మంది అంటే దాదాపు 27 శాతం మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. తిరుపతి వరకే చూస్తే 3 లక్షల 55 వేల 428 మంది మహిళలు 2019 ఎన్నికల్లో ఓటేశారు. గతంలో చంద్రబాబు పసుపు కుంకుమ పథకం కింద 95 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల నగదు సాయం అందించారు. ఇందుకోసం 9 వేల 5 వందల కోట్లు ఖర్చు చేసింది టీడీపీ ప్రభుత్వం.

అయితే మహిళలను లక్షాధికారిని చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాకా కేవలం 6 వేల 7 వందల కోట్లు ఇచ్చారు. దాదాపు 13 లక్షల మందికి రూపాయి కూడా సాయం అందలేదని జగన్ సర్కార్ లెక్కలే చెబుతున్నాయి. మరో 22 లక్షల మంది డ్వాక్రా మహిళలకు కేవలం రెండు నుంచి ఐదు వేల సాయమే అందిందట. కొందరికి మాత్రం 15 వేలు రూపాయలు ఇచ్చారు. ఇదే ఇప్పుడు వైసీపీకి గండంగా మారిందంటున్నారు. 

తక్కువ సాయం అందిన మహిళలంతా "ఆ దొంగముండకి అన్ని డబ్బులు ఇచ్చారు. మాకు ఇవ్వలేదని కొందరు, తక్కువ ఇచ్చారని కొందరు" అసూయతో  రగిలిపోతున్నారట. వీళ్లంతా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలో వైసీపీకి ఓటు వేసే అవకాశం లేదు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇదే జరిగింది. ప్రభుత్వం వరద సాయంగా కొందరికి 10 వేల రూపాయలు ఇచ్చింది. అయితే సాయం అందని వారంతా కసిగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారు. తిరుపతిలోనూ డ్వాక్రా మహిళల విషయంలో ఇదే సీన్ రిపీట్ కాబోతుందని తెలుస్తోంది.

తిరుపతి లోక్ సభ పరిధిలో 3 లక్షల 55 వేల డ్వాక్రా మహిళల్లో దాదాపు లక్ష 15 వేల మందికి సాయం అందలేదు, వీరిలో కొందరికి తక్కువ సాయం అందింది. వీరంతా వైసీపీపై గుర్రుగా ఉన్నారు. వీరంతా ఉపఎన్నికలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తే.. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 2 లక్షల 40 వేల మెజారిటీలో లక్షా 15 వేల ఓట్లు తగ్గనున్నాయి. ఆ లక్ష 15 వేల మందిలో.. లక్షమంది టీడీపీకి, 15 వేల మంది బీజేపీకి ఓటేసే అవకాశాలున్నాయి.
అలా డ్వాక్రా అక్కచెల్లెమ్మలా పుణ్యమా అని.. వైసీపీ మెజారిటీలో లక్షా 15 వేల ఓట్లు కోత పడనుంది అన్నమాట.

 

కారణం 2.. మందుబాబులు
ఏపీలో సగటున 17 శాతం మంది డ్రింకర్లు ఓటర్లుగా ఉన్నారు. ఆరోగ్యాన్ని పాడుచేసుకొని మరీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్న మందుబాబులు.. తిరుపతి ఉప ఎన్నికలో కీ రోల్ పోషించబోతున్నారు. బ్రాండెడ్ మద్యాన్ని కాకుండా.. వింత వింత పేర్లున్న నాసిరకం మద్యాన్ని.. భారీ రేట్లకు అమ్ముతుండటం పట్ల జగన్ సర్కార్ పై మందుబాబులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

మొత్తం 17 శాతం ఉన్న మందుబాబుల్లో మూడు శాతం రిచ్ డ్రింకర్లు. వీరు ఓటింగ్ కు వస్తారన్నది డౌటే. ఒకవేళ ఎంతో కొంతమంది వచ్చినా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఎందుకంటే వీరు పేరుకి రిచ్ అయినా.. నచ్చిన బ్రాండ్ తాగలేని పూర్ డ్రింకర్స్ అయిపోయారు. ఇక ఐదు శాతం మందుబాబులు పార్టీ వర్కర్లు ఉంటారు. వీరికి మద్యం క్వాలిటీ, రేట్లతో సంబంధం ఉండదు. ఎన్నికలు వస్తే చాలు.. వీళ్లు ఎవరి పార్టీకి వాళ్లే వేసుకుంటారు. వీళ్లలో వైసీపీకి 3 శాతం, టీడీపీకి రెండు శాతం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక, మిగతా 9 శాతం మందుబాబులు జగన్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నవారే. నాసిరకం మద్యం.. ధరల భారంతో.. వీరంతా వైసీపీపై గుర్రుగా ఉన్నారు. గతంలో తిరుపతిలో వైసీపీకి ఓటేసిన మందుబాబుల్లో దాదాపు 20 వేల మంది.. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీలకు ఓటేసే అవకాశముంది.

 

కారణం 3.. బీజేపీ దెబ్బ
2019లో తిరుపతిలో బీజేపీ కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. కాని ఏపీలో బీజేపీకి దాదాపుగా 6 శాతం ఓటింగ్ ఉందన్నది ఆ పార్టీ నేతల లెక్క. ఈ లెక్కన తిరుపతిలో బీజేపీకి సంబంధించిన నాలుగు శాతానికి పైగా ఓటు ఇతర పార్టీలకు వెళ్లింది. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ, ఎన్డీఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మోడీ, అమిత్ షాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబును ఓడించాలన్న కసితో బీజేపీ కార్యకర్తలంతా వైసీపీకి ఓట్లు వేశారు. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ గట్టిగా పోరాడుతుంది కాబట్టి.. వాళ్ల ఓట్లన్ని వాళ్లకే పడతాయి. అంటే గతంలో వచ్చిన ఓట్లలో వైసీపీకి దాదాపు నాలుగు శాతం ఓటింగ్ తగ్గనుంది. ఈ లెక్కన వైసీపీ ఓటింగ్ లో 40-50 వేల ఓట్లు తగ్గనున్నాయి.

 

కారణం 4 .. జనసేన దెబ్బ
బీఎస్పీ, జనసేన కూటమికి తిరుపతిలో 2019లో 1.6 శాతం పోలింగ్ జరిగింది. అయితే తిరుపతి లోక్ సభ పరిధిలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఓట్లు భారీగానే ఉన్నాయి. గబ్బర్ సింగ్ ఫ్యాన్స్  కూడా ఎక్కువే. తిరుపతి లోక్ సభ పరిధిలో జనసేనకు 4 శాతం ఓటింగ్ ఉందన్నది ఆ పార్టీ నేతల అంచనా. ఈ లెక్కన జనసేనకు సంబంధించిన రెండున్నర శాతం ఓటింగ్ కూడా క్రాస్ అయింది. ఇందులో కూడా ఎక్కువగా ఫ్యాన్ కే పడ్డాయని భావిస్తున్నారు. ఇప్పుడు జనసేన, బీజేపీ అలయన్స్ కాబట్టి.. ఈ ఓట్లన్ని వాళ్ల కూటమి అభ్యర్థికే పడతాయి. సో... 2019లో పడిన ఓట్లలో వైసీపీ దాదాపు 20 వేల ఓట్లు కోల్పోయే అవకాశముంది.

 

కారణం 5 .. టీడీపీ దెబ్బ
2019 ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ తప్పులు చేసిందనే ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న కొందరు సిట్టింగులకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి టికెట్లు ఇవ్వడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోయారు. దీంతో కొందరు టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా వైసీపీకి ఓట్లేశారని.. ఫలితాల తర్వాత చంద్రబాబు చేసిన పోస్ట్ మార్టమ్ లో తేలింది. ఇలా దాదాపు 2-3 శాతం టీడీపీ ఓటింగ్ పోయిందని అంచనా వేశారు. వీళ్లంతా ఇప్పుడు తిరిగి టీడీపీకి మద్దతుగా ఉంటారు. అంటే వైసీపీకి మరో 20-30 వేల ఓట్లు తగ్గనున్నాయి.

 

కారణం 6.. ఉద్యోగులు...
వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తీరలేదు. ఉద్యోగ సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి ఓవరాక్షన్ ఎక్కువైందనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్జీవో సంఘాన్ని అధికార పార్టీకి తాకట్టు పెట్టారనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. దీంతో ఉద్యోగులు కూడా తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తారని భావిస్తున్నారు. తిరుపతి పరిధిలో మూడు శాతం ఉద్యోగులు ఉండనుండగా.. మూడు పార్టీలకు ఒక్కో శాతం ఓట్లు రావచ్చని అంచనా. ఈ లెక్కన 2019 పోలింగ్ తో పోల్చితే వైసీపీకి దాదాపు 10 వేల ఓట్లు తగ్గనున్నాయి.

 

కారణం7.. నిరుద్యోగ యువత , విద్యావంతులు
వైసీపీ సర్కార్ పాలనా తీరుపై నిరుద్యోగ యువత , విద్యావంతులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వాలంటీర్ గా చేస్తే పాకెట్ మనీ వస్తుంది కానీ.. ఫ్యామిలీని పోషించే అంత మనీ రాదు. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగాలు చూపడంలో జగన్ సర్కార్ విఫలమైంది. సర్కార్ అస్తవ్యస్థ విధానాలు, కోర్టుల్లో వరుసగా జరుగుతున్న ఎదురు దెబ్బలు.. ఇలా అన్ని అంశాల్లోనూ జగన్ పాలనపై విద్యావంతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తిరుపతిలో పరిధిలో యువత, విద్యావంతుల ఓట్లు 10 శాతం ఉంటే.. గతంలో వైసీపీకి ఓటేసిన వారిలో.. ఈసారి 5 శాతం మంది వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.
అంటే వైసీపీ 5 నుంచి పదివేల ఓట్లు కోల్పోనుంది.

 

కారణం8.. దళితుల్లో వ్యతిరేకత
తిరుపతిలో ఎస్సీ ఓటర్లు ఎక్కువ. గతంలో ఈ వర్గ ఓట్లలో మెజార్టీ వైసీపీకే పడ్డాయి. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితులకు వైసీపీ నేతలు శిరోముండనం వేయించిన ఘటనలు వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబాన్నిఇంతవరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించలేదు. ఇది కూడా తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక ఎంపీ చనిపోతే.. ఆయన పార్టీ అధ్యక్షుడు, సీఎం హోదాలో ఉన్న జగన్ వారితో కనీసం మాట్లాడకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలతో ఆ సామాజిక వర్గం వైసీసీపైనా, సీఎం జగన్ పైనా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఎస్సీ సామాజిక వర్గంలో వైసీపీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే రెండు శాతం ఓట్లు తగ్గవచ్చంటున్నారు.

 

కారణం 9.. అన్నదాతల అసహనం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. తిరుపతి పరిధిలోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంతో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. కష్టాల్లో ఉన్న తమను కనీసం పరామర్శించడానికి కూడా వైసీపీ నేతలు రాలేదని ఆరోపిస్తున్నారు రైతులు. దీంతో రైతుల ఓటింగ్ లోనూ వైసీపీకి ఓటింగ్ మైనస్ కానుందని తెలుస్తోంది.

 

కారణం 10.. రెండేళ్ల జగన్ పాలన
మూడు రాజధానుల ప్రతిపాదనతో గందరగోళం.. ఏపీకి ఇప్పుడు రాజధాని ఏంటో తెలియని అయోయమం. పెట్టుబడులు రావట్లేదు,.. ఆదాయం లేదు.. అప్పులు పెరిగిపోతున్నాయి.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్థ విధానాలు, కోర్టుల్లో వరుసగా జరుగుతున్న ఎదురు దెబ్బలు.. ఇలా జగన్ పాలనపై తటస్థుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీకి ఓటేసిన తటస్థుల్లో ఇప్పుడు రెండు మూడు శాతం మంది వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది. దీంతో వైసీపీ దాదాపు 20 వేల ఓట్లు కోల్పోనుంది.

 

కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు.. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఓడిపోతుందని చెప్పడానికి ఈ పది కారణాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 2 లక్షల 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన వైసీపీ.. ఉపఎన్నికలో మాత్రం దాదాపు 3 లక్షల ఓట్లు కోల్పోయి.. సుమారు 50 వేల ఓట్ల తేడాతో తిరుపతి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయే అవకాశముంది.