Read more!

కాలాన్ని జయించే ‘POSEC Method’

 

ప్రపంచంలో ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేదాని మీద వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే 20వ శతాబ్దంలో ‘Time Management’కి చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు. వాటికోసం రకరకాల వ్యూహాలూ ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక పద్ధతే ‘POSEC Method’.

 

1943లో Maslow అనే ఆయన Hierarchy of needs అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒక మనిషి సంతోషంగా ఉండేందుకు ఎలాంటి అవసరాలు తీరాలో ఇందులో పేర్కొన్నారు. దీని ఆధారంగానే ‘POSEC Method’ని రూపొందించారు. మన అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ పద్ధతిలో సూచించే ప్రయత్నం చేశారు. 

 

అవేమిటంటే...

Prioritize – మీ జీవితంలో అతిముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి. వాటిని సాధించేందుకు ఏం చేయాలి. వాటి కోసం ఎంత సమయం కేటాయించాలి అన్న విషయాలన్నీ ఈ Prioritize కోవలోకి వస్తాయి.

 

Organize – జీవితం స్థిరంగా ఉండేందుకు ఎలాంటి పరిస్థితులు అవసరం అన్న అంశాలు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం... లాంటి అంశాలన్నమాట.

 

Streamline – చేసే ప్రతి పనీ మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సమయానికి బండిని సర్వీస్‌ చేయించుకోవడం దగ్గర నుంచీ, బీమా ప్రీమియం చెల్లించడం వరకు మన చుట్టూ ఉంటే పరిస్థితులను సక్రమంగా ఉంచుకోవడం వల్ల సమయం, శ్రమా రెండూ ఆదా అవుతాయి.

 

Economize – కొన్ని పనుల వల్ల ఉపయోగం ఉండదు. అవి అత్యవసరమూ కాదు. కానీ ఇవి లేకపోతే జీవితం మరీ బోర్‌ కొట్టేయవచ్చు. స్నేహితులతో పార్టీ చేసుకోవడం, బంధువులు ఇంటికి వెళ్లడం, సినిమా చూడటం... లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి.

 

Contribute – పక్కవారికి ఏదో సాయం కావాలి! తోటి మనిషిగా ఆ బాధ్యతలో పాలు పంచుకోవడం మన కర్తవ్యం. వీధిలో జనం అంతా కలిసి రోడ్డుని శుభ్రం చేసుకుంటున్నారు! పౌరుడిగా పాల్గోవడం మన ధర్మం. ఎన్నికలు జరుగుతున్నాయి. పౌరుడిగా ఓటు వేసేందుకు లైనులో నిలబడటం మన బాధ్యత. ఇవన్నీ చేయాలని ఎవరూ అనరు. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి సమయం, శ్రమ వృధాగానే తోచవచ్చు. కానీ వీటి ఫలితం భవిష్యత్తులో కనిపించి తీరుతుంది. సమాజాన్ని ముందుకు నడిపించడంలో, మనం అశ్రద్ధ చేయలేదన్న తృప్తిని అందిస్తుంది. ఇలాంటి పనులన్నీ Contribute విభాగంలోకి వస్తాయి.

 

ఇవండీ ‘POSEC Method’ లక్షణాలు. మన జీవితంలో పనులన్నింటినీ ఈ దృక్పథంతో చూస్తే... వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి అన్న స్పష్టత ఏర్పడుతుంది.


 - నిర్జర.