Read more!

స్వప్న సుందరి గోల్డ్ ట్విస్ట్.. సీఎం విజయన్ టార్గెట్!

కేరళ సీఎం పినరయ్ విజయన్. స్వప్న సురేశ్. కొంతకాలం క్రితం మారుమోగిన పేర్లు. 15 కోట్లు విలువచేసే 30 కేజీల బంగారం స్మగ్లింగ్ లో స్వప్న సురేశ్ నిందితురాలు. గోల్డ్ స్మగ్లింగ్ లో సీఎం విజయన్ కూ సంబంధం ఉందని ప్రతిపక్షాల ఆరోపణ. ముఖ్యమంత్రితో పాటు మరో ముగ్గురు మంత్రులకూ బంగారం స్మగ్లింగ్ లో లింకుందని అంటున్నారు. 

మరో నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు. ఎల్డీఎఫ్ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో పినరయ్ విజయన్ టార్గెట్ గా కేసు ఉచ్చు బిగుస్తోంది. సరిగ్గా కేరళ ఎన్నికల ముందు బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. స్మగ్లింగ్‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని తెలిపారు స్వప్న సురేశ్. సీఎం పినరయ్‌తో పాటు స్పీకర్, మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా బయటపెట్టారు. ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు వెల్లడించారు. 

‘‘సీఎం విజయన్‌ అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్‌కు, సీఎం విజయన్‌కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ డీల్‌లో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారు.’’ అని కస్టమ్స్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

గతంలో తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు విలువచేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో కేరళను కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా ఆమె సీఎం విజయన్, స్పీకర్, మరో ముగ్గురు మంత్రుల పేర్లు చెప్పడం ఎన్నికల వేళ కేరళలో సంచలనంగా మారింది. బంగారం స్మగ్లింగ్ కేసు కేరళ ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో అనే ఆసక్తి పెరిగింది.