Read more!

ప్రపంచమంతా సంక్రాంతి

 


సంక్రాంతి కేవలం ఒక సంప్రదాయం కాదు. అది ఓ జీవన విధానం. పంటలు ఇళ్లకి చేరుకున్నాయన్న సంబరానికి సూచన. సూర్యుని గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారనుందన్న విషయానికి ప్రతీక. అందుకనే సంక్రాంతిని పోలిన పంటల పండుగలు ప్రపంచంలో అనేక చోట్ల కనిపిస్తాయి. ‘హార్వస్ట్ ఫెస్టివల్స్’ పేరుతో వీటిని ప్రతి జాతివారూ జరుపుకొంటారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవిగో...

ఇండోనేషియా!!

ఇండోనేషియాలో పంటల పండుగ ఎప్పుడో మేలో వస్తుంది. మే 31, జూన్ 1.. ఈ రెండు తేదీలలోనూ వారు ఈ పండుగను జరుపుకొంటారు. మనం సంపదకీ, సమృద్ధికీ లక్ష్మీదేవిని ఎలా కొలుచుకుంటామో ఇండోనేషియా ప్రజలు దేవిశ్రీ అనే దేవతను కొలుస్తారు. ఈ పంటల పండుగనాడు ఆ దేవతను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీధుల్లో రంగురంగుల జెండాలను ఎగరవేస్తారు. పంటపొలాల్లో దిష్టిబొమ్మలను నిలుపుతారు. మన రాష్ట్రంలోలాగానే ఎడ్లపందాలను ఆడి సంబరపడిపోతారు.

ఆఫ్రికా!!

ఆఫ్రికా ఖండంలో అందునా ఘనా, నైజీరియా వంటి దేశాలలో యామ్ పండుగ అనే పంటల పండుని చేసుకుంటారు. యామ్ అనేది మన పెండలంలాంటి ఒక దుంప. ఆఫ్రికా ప్రజల ఆకలి తీర్చడంలో యామ్ది ముఖ్యపాత్ర. వర్షాకాలం ముగిసి ఆ యామ్ పంట చేతికి వచ్చే సమయంలో యామ్ ప్రజలు ఈ పండుగ జరుపుకొంటారు. ఇందులో పండుగ ముందురోజు పాత యామ్లని తిన్నంతగా తిని  పారేస్తారు. ఇక యామ్ పండుగ రోజుని కొత్త పంటతోనే ప్రారంభిస్తారు. వీటికి తోడుగా ఆటపాటలూ, విచిత్ర వేషధారణలూ ఎలాగూ ఉంటాయనుకోండి.

ఇంగ్లండ్!!

ఉత్తర ధృవంలోని ఇంగ్లండ్, ఐర్లాండ్ వంటి దేశాలలో లామాస్ పేరుతో పంటల పండుగను జరుపుకొంటారు. ఈ సమయంలో చేతికి వచ్చే గోధుమలతో రొట్టెలను చేసి వాటిని చర్చికి తీసుకువెళ్తారు. మన దేశంలో ఉత్తరాయణంతో పాటుగా మొదలయ్యే ఎండాకాలపు ప్రారంభంలో సంక్రాంతిని జరుపుకుంటాం. కానీ లామాస్ పండుగ మాత్రం ఇంగ్లండులో వేసవి ముగిసిపోయే సందర్భానికి సూచనగా భావిస్తారు.

చైనా!!

పంటల పండుగ గురించి చెప్పుకోవాలంటే చైనా, వియత్నాం దేశ ప్రజలు చేసుకునే లామాస్ గురించే చెప్పుకోవాలి. చైనీస్ కేలండర్లోన ఎనిమిదో నెలలోని పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకొంటారు. ఇది సుమారుగా ఆగస్టు లేదా సెప్టెంబరు మాసాలలో వస్తుంది. ప్రాచీన సంప్రదాయాలలో చంద్రుని పంటలకు అధిపతిగా భావిస్తారు కాబట్టి, చైనీయులు ఈ రోజుల్లో చంద్రుని ఆరాధిస్తారు. చంద్రుని ఆకారంలో చేసిన రొట్టెలను పంచుకుంటారు. రకరకాల చైనా లాంతర్లలో దీపాలను వెలిగించి ప్రతి ఇంటి ముందరా వేలాడదీస్తారు.

ఇజ్రాయేల్!!

ఇజ్రాయేల్ కాలమానం ప్రకారం వారి ఏడో నెలలో పదిహేనవ రోజున సుకోత్ అనే పంటల పండుగను చేసుకుంటారు. ఇది సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు మాసాల మధ్య వస్తుంది. వారంరోజుల పాటు ధూంధాంగా జరుపుకొనే ఈ పండుగకు మరో పరమార్థం కూడా ఉంది. ఈజిప్టు సామ్రాజ్యం కింద యూదులు దాస్య విముక్తిని సాధించిన ఘట్టానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకొంటారు. ఆ కాలంనాటి సంస్కృతిని ప్రతిబింబించే గుడారాలను వేసుకుని, ఆ కాలంనాటి దుస్తులను ధరించి గత స్మృతులలోకి జారిపోతారు.

- నిర్జర.