Read more!

మూడు రాజధానుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో పిటిషన్

ఏపీలో మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం పొందడంతో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వం ఈ విషయంలో గెజిట్‌ను జారీ చేసింది. దీంతో రాజధాని రైతు పరిరక్షణ సమితి దీన్ని తీవ్రంగా తప్పుబట్టుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రాజధాని రైతు పరిరక్షణ సమితి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐతే ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. 

మరో పక్క ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది. దీంతో అమరావతి కేవలం శాసన రాజధాని గా మిగలనుంది. దీంతో ఆగస్టు 15 వరకు అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా విశాఖలో జరిపే అవకాశముందని సమాచారం. దీంతో ఇటు ప్రతిపక్షాలు అటు రాజధాని రైతు పరిరక్షణ సమితి ఓ వైపు నిరసనలు వ్యక్తం చూస్తూనే.. మరోవైపు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఐతే ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తోంది.