Read more!

అధ:పాతాళానికి తొక్కేస్తాం.. జగన్ గారూ మీకంత ధైర్యముందా? 

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడని ప్రశ్నించారు. గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు.. ఆయనను చంపేశారని అన్నారు. ప్రశ్నించే వారి కుటుంబాలను నాశనం చేయాలనుకుంటే కుదరదని, ఇలాంటి దారుణాలు ఎక్కువైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబుకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. అన్నా రాంబాబూ గుర్తుంచుకో.. నిన్ను అధ:పాతాళానికి తొక్కేస్తాం అని హెచ్చరించారు. జగన్ రెడ్డి గారూ మీ ఎమ్మెల్యే చేసిన పనికి ఆయనను శిక్షిస్తారా?.. అంత ధైర్యం మీకుందా? అని ప్రశ్నించారు.

 

కాగా, ఇటీవల ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనను దూషించాడని మనస్తాపం చెందిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం పారిశుధ్య సమస్యలపై ఎమ్మెల్యే అన్నా రాంబాబును వెంగయ్యనాయుడు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘‘నువ్వెవుడి రా నాకు చెప్పడానికి.. ఒళ్లు దగ్గర పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా?’’ అంటూ అందరి ఎదుట అతనిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన వెంగయ్య నాయుడు ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

 

ఈ ఉదయం జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. వెంగయ్య పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. అనంతరం ఒంగోలులో ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ ను పవన్ కలిశారు. జనసేన కార్యకర్త వెంగయ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి పవన్ ఫిర్యాదు చేశారు.