Read more!

క్వారంటైన్ తో ప్రచారానికి డుమ్మా! వకీల్ సాబ్ పై రాజకీయ రచ్చ 

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఏపీలో రాజకీయ కాక రేపుతోంది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. లోక్ సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.. నియోజకవర్గానికే మంత్రిని ఇంచార్జ్ గా నియమించారు సీఎం జగన్. మండలానికో ఎమ్మెల్యేను మోహరించడంతో వారంతా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న రత్నప్రభ ప్రచారం మాత్రం మిగితా పార్టీలంతా స్పీడుగా సాగడం లేదని అంటున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  ఒక రోజు రోడ్ షో నిర్వహించి..  మళ్లీ తిరుపతి వైపు చూడటం లేదు. ప్రచార గడువు ముగుస్తున్న సమయంలో పవన్ హోం క్వారంటైన్ లో ఉన్నారని జనసేన ప్రకటన విడుదల చేయడంతో బీజేపీ ఒక్కసారిగా షాకైంది. 

తన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా సోకినందున డాక్టర్ల సలహా మేరకు పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లో ఉన్నారని జనసేన చెబుతోంది. అయితే కరోనా సాకుతో పవన్ కల్యాణ్ కావాలనే క్వారంటైన్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం ఇష్టం లేకే వకీల్ సాబ్ అలా ఉండిపోయారని సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. కరోనా భయపెడుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. తిరుపతిలో ప్రచారం చేసిన కొందరు టీడీపీ నేతలకు కరోనా నిర్ణారణ అయినా.. చంద్రబాబు మాత్రం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రోడు షోలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా జోరుగా జనాల్లోకి వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సాకుతో పవన్ కల్యాణ్.. తిరుపతి ప్రచారానికి దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మొదటి నుంచి బీజేపీ-జనసేన మధ్య విభేదాలు వచ్చాయి. తిరుపతిలో తామే పోటీ చేయాలని జనసేన గట్టిగా ప్రయత్నించింది. గత ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకంటే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ లెక్కలన్నీ ముందేసింది. ఢిల్లీకి వెళ్లి మరి పవన్ కల్యాణ్... బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. తిరుపతిలో పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. తర్వాత ఏమైందో ఏమో పవన్ వెనక్కి తగ్గారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. పోటీపై పవన్ వెనక్కి తగ్గడంపైనా పలు రకాల చర్చలు జరిగాయి. ఏపీ జనాలు బీజేపీపై గుర్రుగా ఉన్నందువల్లే తిరుపతిలో జనసేన పోటీ చేయలేదనే చర్చ జరిగింది. కొన్ని రోజుల తర్వాత బీజేపీతో జనసేనాని తెగతెంపులు చేసుకుంటారని చెప్పారు. ఇందుకు అనుగుణంగానే ఏపీలో రాజకీయ పరిణామాలు జరుగుతూ వచ్చాయి.

కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు.. బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీలు అవగాహనతో బరిలో నిలిచాయి. గోదావరి జిల్లాలో మంచి ఫలితాలు కూడా సాధించాయి. వకీల్ సాబ్ సినిమా విషయంలోనూ ఏపీ సర్కార్ తీరును ఎండగట్టారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ పై వైసీపీ కక్ష కట్టిందని మండిపడ్డారు.  తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీకి దూరంగా ఉండటమే బెటరన్న ఆలోచనకు పవన్ వచ్చారంటున్నారు. అందుకే కరోనాను సాకుగా చూపి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

 పవన్ కల్యాణ్ తాజా సినిమా వకీల్ సాబ్ వివాదం ఏపీలో రాజకీయంగా దుమ్ము రేపుతోంది. మూవీ రిలీజ్‌కు ముందే వకీల్ సాబ్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ సర్కారు. బెనిఫిట్ షోలు రద్దు చేసింది. సినిమా టికెట్ల రేట్లను పెంచకుండా చేసి రివేంజ్ తీసుకుంది. ఇది కూడా పవన్ కల్యాణ్ తిరుపతి ప్రచారానికి రాకుండా ఉండటానికి కారణమంటున్నారు. రాజకీయ వివాదాలతో తన సినిమా ఇబ్బందులో పడితే... సినిమా యూనిట్ కు నష్టాలు వచ్చే అవకాశం ఉందని కూడా పవన్ భావించారని అంటున్నారు. అందుకే తిరుపతి ప్రచారానికి దూరంగా ఉంటున్నారని అంచనా వేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. 

ఆంధ్రప్రదేశ్  బీజేపీలో రెండు వర్గాలున్నాయనే ప్రచారం ముందునుంచి సాగుతోంది. ఇందులో ఓ వర్గం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీపీపై ఆరోపణలు చేయడం ఈ వర్గం పని. వైసీపీకి అనుకూలంగా ఉండే వర్గం... తిరుపతిలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయకుండా కుట్రలు చేస్తుందని అంటున్నారు. వాళ్లే పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకుండా ఎత్తులు వేశారని చెబుతున్నారు.