Read more!

గ్లాస్‌ షీల్డ్‌ కవర్‌ వెనక నిమ్మగడ్డ ప్రెస్ మీట్! ఉద్యోగుల పరిస్థితి ఏంటంటున్న వైసీపీ 

తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఒక వైపు ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుంటూ పోతుండగా.. అధికార వైసీపీ నేతలు నిమ్మగడ్డ టార్గెట్ గా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ వివాదమంతా  కరోనా చుట్టే తిరుగుతోంది. టీకా వేసుకునే వరకు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తుండగా.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని ఎస్ఈసీ చెబుతోంది. అయితే  తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశం ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపింది. ఎన్నికలకు సహకరించబోమని చెబుతున్న ఉద్యోగ సంఘాలకు అస్త్రంగా మారుతోంది. 
   
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విలేకరుల సమావేశంలో  పూర్తి స్థాయిలో  కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌ ధరించి.. గ్లాస్‌ షీల్డ్‌ కవర్‌ వెనుక కూర్చుని ఆయన వివరాలు వెల్లడించారు.  కరోనాను చూసి భయపడవద్దని ఉద్యోగులు, జనాలకు చెప్పారు. మీడియా సమావేశంలో ప్రశ్నలు వేయరాదని ఆహ్వానపత్రంలో ముందుగానే సూచించారు. సమావేశానికి ముందు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేయించారు. నిమ్మగడ్డ తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల సమావేశానికే నిమ్మగడ్డ తన రక్షణ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. మరి లక్షల మంది ప్రజలతో ముడిపడ్డ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే  సిబ్బంది పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసే ప్రజల ఆరోగ్యం గురించి ఆయనకు బాధ్యత లేదా.. ఆయన ఒక్కరిదే ప్రాణం.. జనాలది కాదా అని విమర్శిస్తున్నారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలే జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 జూలైలో పంచాయతీ ఎన్నికలు.. 2014 మార్చిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం 2018 జూలైలో  పంచాయతీ ఎన్నికలు, 2019లో ఏప్రిల్ లో ప్రాదేశిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కాని అప్పటి ప్రభుత్వం వాటిని నిర్వహించలేదు. 2016 జనవరి 30న ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటైంది. అప్పుడే  ఏపీ తొలి ఎన్నికల కమిషనర్ గా 2016 మార్చిలో  నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించబడ్డారు. అంటే 2018,2019లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. నిమ్మగడ జరపలేకపోయారు. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ సైలెంట్ గా ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలోని మున్సిపల్, కార్పోరేషన్ల పరిస్థితి ఇంతే. విశాఖ నగరానికి 2007లో ఎన్నికలు జరిగాయి. అంటే 14 ఏండ్లుగా విశాఖ కార్పొరేషన్ కు పాలక మండలి లేదు.  
 
ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తోంది వైసీపీ. మూడేళ్ల పాటు నిద్రపోయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. మూడు నెలల కోసం ఎందుకు తొందరపడుతున్నారని, వ్యాక్సినేషన్‌  సమయంలో ఇంత మొండిగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నిమ్మగడ్డ సమావేశం పొలిటికల్‌ ప్రెస్‌మీట్‌లా ఉందని చెప్పారు.  2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?. ఎన్నికల నిర్వహణలో మూడేళ్లుగా ఈసీ ఎందుకు విఫలమైంది? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయిందని అంబటి నిలదీశారు. చంద్రబాబుకు అనుకూలమైన అధికారులతో..ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని అంబటి  తెలిపారు. వ్యాక్సినేషన్‌, ఎన్నికలు ఒకేసారి నిర్వహించటం సాధ్యం కాదని.. వ్యాక్సినేషన్‌ చేస్తే కోవిడ్‌ తగ్గుతుంది.. ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్‌ పెరుగుతుందన్నారు. నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఆయన  వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లు ఉన్నాయని  రాంబాబు మండిపడ్డారు. 

ఏపీలో 2020 మార్చిలో  స్థానిక సంస్థల ఎన్నికలకు ర్ణయించారు. ఓటర్ల జాబితా తయారు కాలేదంటూ ఎస్‌ఈసీ అప్పట్లో మెలిక పెట్టినా.. జగన్ సర్కార్ ముందుకు వెళ్లింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే దేశంలో కరోనా కేసులు నమోదు కావడంతో  స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.   గత అక్టోబర్ లో  మళ్లీ ఎన్నికల నిర్వహణలో వేగం పెంచారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. షెడ్యూల్ కూడా విడుదల చేశారు. స్థానిక ఎన్నికలు రాజ్యాంగ విధి అని.. సకాలంలో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి నిధులు రావని చెప్పారు నిమ్మగడ్డ.  అయితే స్థానిక ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి నిధులు రావంటున్న నిమ్మగడ్డకు 2018,19లో ఆ విషయం తెలియదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కరోనా సాకుతో మార్చిలో ఎందుకు వాయిదా వేశారో చెప్పాలంటున్నారు.  చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటూ నిమ్మగడ్డ.. ఎన్నికల కమిషన్ ను వివాదం చేశారని ఆరోపిస్తున్నారు.