Read more!

తేనెటీగలూ నేర్పుతాయి తియ్యటి పాఠాలు

తేనెటీగలు అనగానే శ్రమ గుర్తుకువస్తుంది. చిటికెడు తేనె కోసం వందలాది తేనెటీగలు పడే కష్టం గుర్తుకువస్తుంది. కానీ తేనెటీగలు అంతకు మించిన పాఠాలెన్నింటినో నేర్పుతాయంటున్నారు. జీవితానికి ఉపయోగపడే సూచనలు ఎన్నింటినో ఇస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్ని...

 

కలిసికట్టుగా

శ్రమ విభజన గురించి చెప్పుకోవాలంటే తేనెటీగల గురించే చెప్పుకోవాలి. తేనెపట్టుని నిర్మించడం దగ్గర నుంచీ, అందులో భద్రపరచిన తేనెని రక్షించుకోవడం వరకూ... ప్రతీ తేనెటీగా తనదైన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇది ఎక్కువ పని, ఇది తక్కువ పని అని తేనెటీగలు చూసుకోవు. తాము ఉన్న జట్టుకి మేలు జరగడమే వాటి ఆశయంగా ఉంటుంది.

 

పరిస్థితులకు అనుకూలంగా

తేనెటీగల పని తేనెని సేకరించి భద్రపరచుకోవడమే కావచ్చు. అలాగని అవి కేవలం దట్టమైన అడవులలో మాత్రమే నివాసాన్ని ఏర్పరుచుకోవు. ఫలానా పూల దగ్గర తేనె ఎక్కువగా దొరుకుతుంది కదా అని అక్కడే తచ్చాడవు. ఏదో ఒక చోట తేనెపట్టుని ఏర్పరుచుకోవడం. అందులోకి తేనెని నింపేందుకు దూరదూరాల వరకూ తిరిగిరావడం... ఇదే వాటి పనిగా ఉంటుంది!

 

ప్రకృతికి సాయం

తేనెటీగలు తేనెని తీసుకోవడమే కాదు... అవి వాలిన పువ్వుల మీద ఉన్న పుప్పొడిని మరో మొక్క దగ్గరకు చేరవేస్తాయి. అలా పరాగసంపర్కానికి (pollination) దోహదపడతాయి. మనం తినే ఆహారంలో దాదాపు మూడో వంతు ఇలా pollination వల్లనే ఉత్పత్తి జరుగుతుందన్న విషయం మీకు తెలుసా! అలా తను ప్రకృతి మీద ఆధారపడుతూ, తిరిగి ఆ ప్రకృతికి ఎంతో కొంత ఉపకారం చేస్తూ జీవించేస్తుంటాయి తేనెటీగలు.

 

జ్ఞానాన్ని సంపాదించడం

తేనెటీగలు తేనె కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఓ రెండు చుక్కల కోసం ఎన్ని పూలనైనా చేరుకుంటాయి. జ్ఞానం కోసం తపించే వ్యక్తి కూడా జ్ఞానం ఉంటే అక్కడికి చేరుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా కాకుండా అహంకారంతో మంకుపట్టు పట్టి నాలుగు గోడల మధ్యే ఉండిపోతే జీవితం నూతిలో కప్పలాగా నిరర్థకమైపోతుంది.

 

ఆత్మరక్షణకు సాటిలేదు

తేనెటీగలు వాటంతట అవి ఎవరి జోలికి వెళ్లి దాడి చేయవు. కానీ తేనెపట్టుని కదిపితే మాత్రం వాటిని ఎదుర్కోవడం మానవుడి తరం కూడా కాదు. మరీ తేనెటీగలలాగా వేటాడి వెంటాడి దాడి చేయనవసరం లేదు కానీ, అనవసరంగా తమ జోలికి రావద్దన్న హెచ్చరికను మాత్రం శత్రువులకు అందించాల్సి ఉంటుంది.

- నిర్జర.