Read more!

జీవితమే ఒక ఆట అయితే

ఆటలు జీవితంలో ఒక భాగం కావచ్చు. శారీరక వ్యాయామానికో, మనసు సంతోషంగా ఉండటానికో వాటిని మనం ఆడుతూ ఉండవచ్చు. కానీ ఆ ఆటని కనుక నిశితంగా గమనిస్తే, అందులోంచి నేర్చుకునేందుకు ఎంతో కొంత ఉంది అనిపిస్తుంది.

 

స్పష్టమైన లక్ష్యం - ప్రతి ఆటగాడికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. బౌలర్ అయితే వీలైనంత త్వరగా వికెట్ తీయాలనుకుంటాడు. బ్యాట్స్మెన్ అయితే వీలైనన్ని పరుగులు చేయాలనుకుంటాడు. ఫుట్బాల్ ఆటగాడైతే గోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే గోల్ కీపర్ అయితే... ఇలా ప్రతి ఒక్కరికీ తనదైన లక్ష్యం ఉంటుంది. లేకపోతే ఆట వృధాగా మారిపోతుంది. జీవితం కూడా అంతే! ఏ లక్ష్యమూ లేని మనిషి, మైదానంలో అయోమయంగా తిరిగే ఆటగాడితో సమానం.

 

సమస్యని ఎదుర్కోవాల్సిందే - బరిలోకి దిగాక మన సత్తువనంతా ప్రదర్శించాల్సిందే! సమ ఉజ్జీలాంటి సమస్య ఎదురుపడినప్పుడు మన శాయశక్తులా పోరాడితేనే ఫలితం దక్కేది. కళ్లు మూసుకుని అది దాటిపోతుందిలే అనుకుంటే విలువైన అవకాశం కాస్తా చేజారిపోతుంది.

 

పైపై మెరుగులు పనికిరావు - ఆటలోకి దిగాక డాంబికాలతో ఫలితాలు రావు. ఏదో కాసేపు పని జరుగుతుందేమో కానీ ఆఖరు విజయం మాత్రం అర్హుడికే దక్కుతుంది.

 

గెలుపు ఓటములను స్వీకరించాలి - ఆడే ప్రతి ఆటలోనూ గెలుపు సాధ్యం కాదు. గెలిచేవాడుంటే ఓడిపోయేవాడు కూడా ఉండి తీరాల్సిందే. ఓడిపోయాను కదా అని క్రుంగిపోతే ఇక ఎప్పటికీ అతని మనసు గెలుపు మీద లగ్నం కాలేదు. గెలిచానని విర్రవీగినా అతనికి విలువ ఉండదు. ఓడినప్పుడు మరోసారి కసిగా ఆడేందుకు ప్రయత్నించాలి. గెలిస్తే వినయంతో దాన్ని స్వీకరించాలి.

 

జట్టు గురించి ఆలోచించాలి - తానొక్కడినే గెలవాలి అన్న స్వార్థం చివరికి వేదననే మిగులుస్తుంది. జట్టుతో కలిసి ఆడితేనే అసలైన విజయం లభిస్తుంది. Live and Let Live అన్న సూత్రంతోనే జీవితానికైనా, ఆటకైనా అర్థం ఉంటుంది.

 

లోపాలను జయించాలి - ఎంతటి ఆటగాడైనా కానీ ఓ చిన్నపాటి లోపం ఉంటే చాలు, అతనిలోని నైపుణ్యాలన్నీ పనికిరాకుండా పోతాయి. స్వీయవిశ్లేషణతో ఆ లోపాలను గ్రహించి, వాటిని అధిగమించినప్పుడే విజేతగా నిలవగలడు.

 

క్రమశిక్షణ - సచిన్, వినోద్ కాంబ్లి ఇద్దరూ సరిసమానమైన ఆటగాళ్లే. కానీ కాంబ్లి వెనకబడిపోవడానికి కారణం అతనిలోని క్రమశిక్షణాల లేమి అంటారు. ఆటైనా, జీవితమైనా తగిన క్రమపద్ధతిలో లేకుండా అరాచకంగా సాగిపోతే ఎదుగుదలలో ఎదురుదెబ్బలు తప్పవు.

- నిర్జర.