Read more!

ఆత్మన్యూనత అవసరమా?

 

అనగనగా ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడన్న పేరుండేది. ఆ భిక్షువు దగ్గర ఎలాంటి సమస్యకైనా సలహా లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో జనం ఆయన దగ్గర తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేవారు. ఆ సమస్యలకి భిక్షువు చెప్పే పరిష్కారాలు విని సంతోషంతో తిరిగి వెళ్లేవారు. అలాంటి భిక్షువు ఆశ్రమం ముందు ఒకరోజు రాచరికంతో ఉట్టిపడుతున్న గుర్రపుబగ్గీ ఆగింది. ఆ బగ్గీలోంచి ఆ దేశ సేనాపతులలో ఒకరు దిగారు. సేనాధిపతిని సకల మర్యాదలతో భిక్షువు దగ్గరకు తీసుకువెళ్లారు ఆశ్రమవాసులు.

 

భిక్షువుకి నమస్కరించిన సేనాపతి తన గోడునంతా ఒక్కసారిగా ఏకరవు పెట్టాడు- ‘స్వామీ! నేను గొప్ప వీరుడినని ఈ రాజ్యమంతా నమ్ముతుంది. ఆ నమ్మకానికి అనుగుణంగా నేను చాలా సాహసకార్యాలే చేశాను. ఎన్నో యుద్ధాలను ఒంటిచేత్తో గెలిపించాను. మరెన్నో ఆక్రమణలను తిప్పికొట్టాను. శత్రుదేశాల వారికి నేనంటే సింహస్వప్నం. రాజుగారికి నా మీద మహా అభిమానం. కానీ ఏం లాభం! నేనెందుకూ పనికిరానివాడినన్న ఆత్మన్యూనత నిరంతరం నన్ను వేధిస్తూ ఉంటుంది. నాకంటే శక్తిసంపన్నులైన రాజుగారిని చూసినా, నాకంటే తెలివితో ఉన్న మంత్రులను గమనించినా..... అంతదాకా ఎందుకు, దైవత్వం ఉట్టిపడే మీవంటి భిక్షువులను చూసినా నేను చాలా అధముడినన్న ఆలోచన బాధిస్తుంటుంది. దీనికి పరిష్కారమే లేదా?’ అంటూ బాధపడ్డాడు. సేనాపతి మాటలను చిరునవ్వుతో విన్న భిక్షువు- ‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. కానీ దీనికి జవాబుని వినేముందు నువ్వు కాస్త ఓపికపట్టాలి. ఇవాళ నాతో తమ బాధలను చెప్పుకొనేందుకు చాలామంది పౌరులు వచ్చారు. వారందరినీ పంపించాక తీరికగా నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఆ అతిథుల గదిలో విశ్రమించు,’ అంటూ సేనానిని పంపారు.

 

తన సమస్యకు భిక్షువు దగ్గర పరిష్కారం ఉందని తెలుసుకొన్న సేనాని అతిథి గదిలో నిశ్చింతగా విశ్రమించాడు. చుట్టూ ఉన్న ఆశ్రమ వాతావరణం, భిక్షువుల ఆధ్మాత్మిక సాధనలు, నిష్కల్మషమైన మనసుతో అక్కడికి చేరుకుంటున్నా పౌరులు... అతనిలోని అలజడిని కొంతవరకూ ఉపశమింపచేశాయి. ఇంతలో నిదానంగా చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆశ్రమమంతా వెన్నెల వెలుగుతో నిండిపోయింది. ఆ వాతావరణంతో మైమరచిపోయిన ఉన్న సేనాపతి గదిలోకి భిక్షువు అడుగుపెట్టాడు.

 

ఉదయం నుంచి అలుపెరగకున్నా కూడా భిక్షువు మొహంలో ఎలాంటి అలసటా కనిపించలేదు. భిక్షువు గదిలోకి అడుగుపెడుతుండగానే ‘నా సమస్య సంగతి ఏం చేశారు స్వామీ!’ అంటూ ఆత్రంగా అడిగాడు సేనాని. ‘ఇవాళ పౌర్ణమి! ఆ నిండు చందమామ ఇచ్చే వెన్నెలతో పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా!’ అన్నారు భిక్షువు.

 

‘నిజమే కానీ... ఆ వెన్నెల సంగతి కాస్త పక్కన పెట్టి నా సమస్య సంగతి చూడండి స్వామీ!’ అన్నాడు సేనాని అసహనంగా. ‘ఈ వెన్నెల మహా అయితే నెలకి ఓసారి వస్తుంది. అది కూడా తెల్లవారుజాముకల్లా సూర్యకిరణాల ముందు వెలవెలబోతుంది. చంద్రుడు ఎంత కాంతిని ఇచ్చినా అది సూర్యకాంతి ముందు దిగదుడుపే! అంతమాత్రాన చంద్రుడు పనికిరానివాడంటావా!’ అని అడిగారు.

 

భిక్షువు ప్రశ్నకి సేనాని నవ్వుతూ- ‘అలా ఎలా సాధ్యం గురువుగారూ! సూర్యడు, చంద్రుడు... రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న గ్రహాలు. దేని అందం దానిదే. దేని లక్షణం దానిదే. సూర్యడు మనకి జీవాన్ని అందిస్తే, చంద్రుడు రాత్రివేళ మనల్ని కాచుకుంటాడు. ఇక ఇలాంటి వెన్నెల రాత్రుల ముందు వంద సూర్యోదయాల అనుభూతి దిగదుడుపే కదా!’ అన్నాడు. ‘చూశావా! నీ సమస్యకి సమాధానం నీ నోటి వెంటే వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుని నీ ఉనికిని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. మంత్రి నీలాగా కత్తిపట్టలేడు, రాజు నీలాగా సాహసాలు చేయలేడు. కాబట్టి ఇలాంటి పోలికలని కట్టిపెట్టి నీ వ్యక్తిత్వం మీద శ్రద్ధ పెట్టు,’ అంటూ ముగించారు భిక్షవు. సేనాని జీవితంలో అది నిజంగా వెన్నెల కురిసిన రాత్రిగా మారింది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

..Nirjara