Read more!

ఫిబ్రవరిలో సీఎంగా కేటీఆర్!  క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్  

తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే బాధ్యతలను స్వీకరించబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మార్చి లోపే కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హింట్ కూడా ఇచ్చారు. తన కుమారుడికి పగ్గాలను అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగాన్ని సిద్దం చేశారని చెప్పారు.  అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు  టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్.  కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టత ఇచ్చారు. 

 ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన రాజేందర్..  కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని... ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఈటెల..  ప్రభుత్వంలోని  99 శాతం పనులకు కేటీఆరే హాజరవుతున్నారని... పలు కార్యక్రమాలకు కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరవుతున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరయ్యారని... దీనిపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.  కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు బదులుగా .. మంత్రిగా తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈటెల రాజేందర్. 

 కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే ముందు కేసీఆర్ మరోసారి యాగం కూడా చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలతో పాటు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శన యాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రతువు ముగిసిన తర్వాత తన కుమారుడు కేటీఆర్ కి సీఎంగా పట్టాభిషేకం చేసి, ఆ బాధ్యతల నుంచి కేసీఆర్ వైదొలగుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

 జనవరి మొదటి వారంలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. యాదాద్రి అలయాన్ని ప్రారంభించడంతో పాటు యాగం చేసిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయడం మంచిదని భావించినట్టు చెబుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ లోనూ కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ సీఎం అయితే... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు లేదా ఈటెల రాజేందర్ ను నియమించవచ్చని చెబుతున్నారు. ఇద్దరిని కూడా నియమించే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  గతంలో టీఆర్ఎల్పీ నేతగా పని చేశారు రాజేందర్.