Read more!

ముఖ్యమంత్రి సీటుపై పంచాయితి! కుటుంబ సభ్యులతో  కేసీఆర్ కు తలనొప్పి? 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తుందా ? పదవుల విషయంలో కేటీఆర్, కవిత ఢీ అంటే ఢీ అంటున్నారా? పాలనలో మార్పులకు సిద్దమైన కేసీఆర్ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటీ? ఇవే ఇప్పుడు తెలంగాణతో పాటు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ కూడా ఏమి చేయలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే పాలనలో ప్రక్షాళనకు సిద్దమైన గులాబీ బాస్.. ఇప్పుడా ప్రయత్నాలను విరమించుకున్నారని సమాచారం.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. కీలకమైన మున్సిపల్, కమర్షియల్, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్.. పాలనలో అంతా తానే వ్యవహరిస్తున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. విదేశీ రాయబారులు, పెట్టుబడిదారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ప్రగతి భవన్ లో కేటీఆర్ తోనే సమావేశమై చర్చిస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగులన్ని కేటీఆర్ చెప్పినట్లే సాగుతుండటంతో ఉన్నతాధికారులంతా కేసీఆర్ కంటే కేటీఆర్ కే ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. షాడో ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ భావించారట. అయితే తన పదవిపై క్లారిటీ ఇవ్వాలని కవిత కోరుతుండటంతో ఇంట్లో గొడవ జరుగుతుందని తెలుస్తోంది.
 

2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కల్వకుంట్ల కవిత. ఆ సమయంలోనే మోడీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని, కవితకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని  ప్రచారం జరిగింది. కాని ఎందుకో అది జరగలేదు. 2019  ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరొచ్చినా కవితకు కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నారు. కాని అనూహ్యాంగా ఆమె ఎంపీగా ఓడిపోయారు. దీంతో షాకైన కవిత.. దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో కవితను రాజ్యసభకు పంపించి మళ్లీ యాక్టివ్ చేస్తారని, అవసరమైతే కేంద్ర కేబినెట్ లో చేరుస్తారని  చర్చ జరిగినా.. అది కూడా జరగలేదు. కేటీఆర్ వ్యతిరేకించడం వల్లే కవితను రాజ్యసభకు పంపలేదని టీఆర్ఎస్ లోనే చర్చ జరిగింది. కవిత కేంద్ర మంత్రి అయితే .. తర్వాత సీఎం రేసులో ఆమె తనకు పోటీగా వస్తారని భావించడం వల్లే కేటీఆర్ ఆమెకు మద్దతు ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్ ,కవిత మధ్య గ్యాప్ వచ్చిందంటున్నారు.  
           
ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించింది కవిత. ఆమె ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి  రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఖాయమన్న చర్చ మొదలైంది. ఇక్కడే కేసీఆర్ కుటుంబలో అసలు సమస్య వచ్చిందంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి పదవులన్ని ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనాల్లోనూ అలాంటి చర్చే జరుగుతోంది. ఈ సమయంలో కవితను కేబినెట్ లోకి తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ తో కేటీఆర్ వాదిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కవితకు మంత్రివర్గంలో చోటుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కేసీఆర్.. కేబినెట్ ప్రక్షాళనకు వెనుకంజ వేస్తున్నారని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగించి కొత్త వారిని తీసుకోవాలని దాదాపుగా నిర్ణయించినా.. కవిత విషయం తేలకపోవడం వల్లే మంత్రివర్గ ప్రక్షాళన విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు.

తనకు మంత్రిపదవి రాకుండా కేటీఆరే అడ్డుకుంటున్నారన్న భావనలో ఉన్న కవిత.. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటుపైనా పేచీ పెడుతున్నారని చెబుతున్నారు. కేటీఆర్ కు పాలనా పగ్గాలు ఇవ్వడానికి ఆమె అంగీకరించడం లేదని తెలుస్తోంది. అందుకే మార్చిలోపు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నా.. అలాంటిదేమి ఉండకపోవచ్చని తెలుస్తోంది. నిఘా సంస్థలు, సర్వేల పేర్లతో కొంత కాలం కేసీఆర్ సాగదీస్తారని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా కమలం కీలక నేతలు.. కేటీఆర్ కు ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. మొత్తంగా పదవుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో పెద్ద పంచాయతీ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరీ..