Read more!

ఆయన నోట మళ్లీ ఢిల్లీ మాట! లైట్ తీసుకుంటున్న పార్టీలు

​దేశంలో గుణాత్మక మార్పు రావాలి.. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే.. ఆ పార్టీల వల్లే దేశం ఆగమైంది.. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తా.. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ గత రెండేండ్లుగా చెబుతున్న మాటలు. ఎన్నికల సమయాల్లోనూ, తనకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినపుడే, బీజేపీ, కాంగ్రెస్ లపై ఈ తరహా కామెంట్లు చేస్తూ వచ్చారు కేసీఆర్. ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. బీజేపీని టార్గెట్ చేస్తూ జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోందని తెలిపారు. చాలా మంది ప్రాంతీయ నేతలతో మాట్లాడానని చెప్పారు కేసీఆర్. 

 

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చేసిన తాజా ప్రకటనపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండేండ్ల నుంచి చెబుతున్న మాటలే మళ్లీ చెప్పారనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జాతీయ పార్టీలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ వల్లే దేశం అభివృద్దికి నోచుకోలేదని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు దేశానికి అరిష్టమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఢిల్లీ వెళ్తునున్నానని కూడా చెప్పారు గులాబీ బాస్. భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడారు. చెన్నె వెళ్లి స్టాలిన్ తో సమావేశమయ్యారు. కోల్ కతా వెళ్లి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీతోనూ మంత్రాగం చేశారు. లక్నో వెళ్లి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిని కలిశారు. దీంతో ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారనే అభిప్రాయం వచ్చింది. 

 

తర్వాత ఏమైందో ఏమోకాని తుస్సుమనిపించారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ మాట కూడా మర్చిపోయారు. అప్పటి నుంచి ఇంతవరకు ఆయన ఢిల్లీ వెళ్లింది లేదు.. ఫెడరల్ ఫ్రంట్ వచ్చింది లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో ఢిల్లీకి వెళ్లినా చేసేది ఏమి లేదని భావించిన కేసీఆర్ సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోతే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి హడావుడి చేయాలని చూశారని, మోడీ ప్రభంజనం వీచడంతో కేసీఆర్ ఆశలు ఆవిరయ్యాయనే ప్రచారం జరిగింది. కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ఏర్పాట్లకు సంబందించి మరో ప్రచారం కూడా జరిగింది. ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన టీడీపీ అధినేత,అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ , కోల్ కతాల్లో మమతా బెనర్జీలు నిరసనకు దిగితే అక్కడికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు. చంద్రబాబు దూకుడుతో లోక్ సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆయనే చక్రం తిప్పబోతున్నారనే ప్రచారం జరిగింది. చంద్రబాబుకు జాతీయ స్థాయిలో వస్తున్న క్రేజీని జీర్ణించుకోలేకే.. ఆయనకు పోటీగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెరపైకి తెచ్చారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

 

గత ఆగస్టులో మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన తెచ్చారు కేసీఆర్. మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ లోనే విపక్ష పార్టీలతో సమావేశం పెట్టబోతున్నానని, అన్ని ప్రాంతీయ పార్టీ నేతలను ఆహ్వానిస్తానని చెప్పారు. అప్పుడు కూడా కేసీఆర్ ఢిల్లీకి  వెళ్తారేమోనని జనాలు భావించారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి ఢిల్లీకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే చర్చ కూడా జోరుగా జరిగింది. కాని అప్పుడు కూడా కేసీఆర్ మాటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయి. హైదరాబాద్ లో సమావేశం జరగలేదు.. ఏ పార్టీ నేత వచ్చి కేసీఆర్ ను కలవలేదు. టీఆర్ఎస్ అధినేత కూడా ఏ లీడర్ తోనూ మాట్లాడలేదు. కనీసం ఫోన్ లో కూడా కేసీఆర్ ఏ ప్రాంతీయ పార్టీ నేతతోనూ మాట్లాడినట్లు కనిపించ లేదు. జీఎస్టీ బకాయిలను కేంద్రం విడుదల చేయడం లేదంటూ లేఖలు రాసి సెప్టెంబర్ లో మరోసారి హడావుడి చేశారు కేసీఆర్. కేంద్రం తీరుకు నిరసనగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ఆర్థికమంత్రులతో సమావేశం పెడతామని కూడా ప్రకటించారు. కాని అది కూడా జరగలేదు. 

 

తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల సన్నద్దత సమావేశంలో జాతీయ రాజకీయాలపై మాట్లాడారు కేటీఆర్. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని కేసీఆర్‌ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని, బడేభాయ్‌ వెంట చోటే భాయ్‌ అన్నట్లు దేశాన్ని సరైన దిశ చూపెట్టడంలో విఫలం అయ్యాయన్నారు. ఆ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని, అందుకు  హైదరాబాద్‌ నుంచే యుద్ధం ప్రకటిస్తామన్నారు. దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు  ప్రయత్నాలు చేస్తున్నామని  చెప్పారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే నేత స్టాలిన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌పవార్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడానని తెలిపారు. డిసెంబరు రెండోవారంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తామన్నారు కేసీఆర్. 

 

కేసీఆర్ తాజా ప్రకటనకు ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీ తమకు గట్టి పోటీ ఇస్తుండటంతో కారణమనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడంతో.. ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో గెలిచేందుకు ఇలా ఎత్తులు వేస్తున్నారని, గ్రేటర్ ఎన్నికలు ముగియగానే జాతీయ రాజకీయాలపై మళ్లీ కేసీఆర్ మాట్లాడరని చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఎప్పుడో ఆ పని చేసేవారంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ఉద్యమం చేస్తానంటున్న కేసీఆర్.. ఆ బిల్లులు పార్లమెంట్ ముందుకు వచ్చిన సమయంలో ఆ పని ఎందుకు చేయలేదనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మెజార్టీ బిల్లులకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు కేంద్రం ఏం చేయడం లేదని విమర్సిండంలో అర్ధం లేదంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేస్తున్న ప్రటనకను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.