Read more!

మీ శ్రమ వృధాకాదు

చిన్న కథలైనా కొన్ని మనసుకి హత్తుకుపోతాయి. గుర్తుండిపోతాయి. అలాంటి ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఓ గురువుగారు తన పదిమంది శిష్యులతో కలసి దూర ప్రయాణం మొదలుపెట్టారు. చాలా రోజుల ప్రయాణం. కొండలు, గుట్టలు, అడవులు, సెలయేర్లు దాటాల్సి వుంటుంది అని ముందుగానే శిష్యులందర్నీ హెచ్చరించారు గురువుగారు. సరే అంటే సరే అంటూ శిష్యులంతా తలలూపారు. అన్ని రోజుల ప్రయాణానికి కావలసిన సరుకులని, తిండిగింజలని మూటకట్టి తటొకటి ఇచ్చారు గురువుగారు. దాంతోపాటు సుమారు ఆరడుగులు వున్న ఓ పొడవైన దూలంలాంటిదాన్ని కూడా ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఆ దూలం ఎందుకో శిష్యులకు అర్థం కాలేదు. కానీ గురువుగారిని అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. మొత్తానికి ఒకవైపున దూలం, మరో వైపు సరుకుల మూటలతో వారి ప్రయాణం మొదలైంది.

శిష్యులతోపాటు గురువుగారు కూడా సరుకుల మూటలు, దూలాన్ని మోస్తూ నడుస్తున్నారు. కొంతమంది శిష్యులు ఆ దూలాన్ని కూడా మేమే మోస్తాం ఇవ్వండి గురువుగారూ అని అడిగారు. అయినప్పటికీ గురువుగారు వద్దంటూ తానే ఆ దూలాన్ని మోస్తూ నడుస్తున్నారు. ఇలా కొంతదూరం నడిచారు. రోజులు గడుస్తున్నాయి. రాను రాను దూలాన్ని మోస్తూ నడవటం కష్టంగా మారిపోయింది శిష్యులకు. ‘‘అసలు ఈ దూలం ఎందుకు మనకి? అనవసరమైన బరువు తప్ప. ఆహారాన్ని మోస్తున్నామంటే అర్థం వుంది. ఈ గుదిబండ మోస్తూ కష్టపడటంలో అర్థం లేదు’’ అంటూ శిష్యులు తమలోతాము మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.  ఈ మాటలు గురువుగారి చెవిన కూడా పడ్డాయి. అయినా ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా వున్నారు. మళ్ళీ వారి ప్రయాణం మొదలైంది. పెద్ద ఎడారిలో వేడి ఇసుకలో పాదాలు కాలిపోతూ, భుజాలపై బరువుతో నెమ్మదిగా కాళ్ళు ఈడుస్తూ నడుస్తున్నారు శిష్యబృందం.

ఎడారిలో నడిచీ నడిచీ శిష్యుల్లో కొందరి ఓపిక అయిపోయింది. ఇన్నాళ్ళూ గురువుగారిపై గౌరవంతో  వాళ్ళు ఏం మాట్లాడకుండా వున్నారు. కానీ, ఇక ఆగలేక ధైర్యం చేసి గురువుగారిని అడిగారు. ఈ బరువు ఎందుకు అనవసరంగా. మోయలేకపోతున్నాం. ఈ దూలాన్ని ఇక్కడే వదిలేస్తాం అన్నారు. అది విన్న గురువుగారు నెమ్మదైన స్వరంతో దాని అవసరం వుంది కాబట్టే ఇంత దూరం మోశాం. వదలటానికి వీల్లేదు అన్నారు. దాంతో శిష్యుల్లో ఓపిక నశించింది. పోనీ కొంచెం పొడవు తగ్గిస్తాం. సులువుగా భుజం మీద మోయగలుగుతాం అన్నారు. గురువుగారు ఎంత చెప్పినా వాళ్ళు వినకపోవడంతో సరే మీ ఇష్టం అంటూ ముందుకు నడిచారు గురువుగారు. ఆయనతోపాటు మరో నలుగురు కూడా దూలాన్ని మోస్తూ ముందుకు నడిచారు. మిగిలిన ఆరుగురు మాత్రం వారి దూలాల పొడవు తగ్గించుకోవడం మొదలుపెట్టారు. 

దూలం పొడవు కొంచెం తగ్గించాక ‘హమ్మయ్య’ అనకుంటూ ముందుకు నడిచారు ఆ ఆరుగురు శిష్యులు. అయితే కొంచెం దూరం నడిచాక అది కూడా బరువుగా అనిపించి, మరికొంత కోద్దాం అనుకుని మరికొంత కోసేశారు. ఇలా చివరికి ఆ దూలం భుజం మీద పెట్టుకుని నడిచేందుకు వీలుగా ఓ అడుగు వరకు చేసుకున్నారు. దాంతో ఆ ఆరుగురు సులువుగా దాన్ని మోస్తూ, గురువుగారిని, మిగతా శిష్యలని దాటుకుని హుషారుగా ముందుకు వెళ్ళిపోయారు. గురువుగారు వారిని నిర్లిప్తంగా చూశారు. మిగిలినవాళ్ళు గురువుగారి మీద నమ్మకంతో ఆ బరువుని మోస్తూ ముందుకు నడుస్తున్నారు. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఎడారి పూర్తయి ఒక నది దాటాల్సి వచ్చింది. గురువుగారు, పూర్తి దూలాన్ని మోసిన నలుగురు శిష్యులు నదిలో తమ భుజాల మీద వున్న దూలాలను వేసి ఒక్కొక్కరు ఒక్కో దూలం మీద కూర్చుని అవతలి వైపుకి వెళ్ళిపోయారు. మిగిలిన ఆరుగురు వారి దగ్గరున్న అడుగు దూలంతో నదిని ఎలా దాటాలో తెలియక ఇవతలే ఉండిపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది గురువుగారు దూలం పొడవు ఎందుకు తగ్గించవద్దన్నారో.

అవతలి ఒడ్డుకు చేరిన గురువుగారు, నలుగురు శిష్యులు అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సాధన ప్రారంభించారు. నదికి ఇవతలే గురువు గారి వెంట వెళ్ళలేక నిలబడిపోయిన శిష్యులు బాధతో వెనక్కి తిరిగారు. ఇదీ కథ... చాలాసార్లు మనం మనకెదురయ్యే సమస్యలు, పరీక్షలకి విసిగిపోయి, నాకే ఎందుకిలా జరుగుతోంది. వీటన్నిటితో నేను ముందుకు ఎలా నడవాలంటూ బాధపడుతూ వుంటాం. అయితే మోసే ప్రతి బరువూ మనకు సహాయపడేదే అనుకుంటే అది బరువుగా తోచదు. అలాగే చాలాకాలంపాటు ఓపికపట్టి, చివరి నిమిషంలో నావల్ల కాదంటూ పక్కకి తప్పుకుంటాం. అంతవరకూ పడ్డ శ్రమకి విలువ లేకుండా చేసుకుంటాం. ప్రతీ అనుభవం మనకి ఎంతో కొంత నేర్పిస్తుంది. దానిని గ్రహిస్తూ మన వ్యక్తిత్వంలోకి చేర్చుకుంటూ ముందుకు నడిస్తే పరిపూర్ణమైన ఆ వ్యక్తిత్వం అనే దూలంతో మన లక్ష్యం చేరచ్చు.