Read more!

సోదర ప్రేమకు చిహ్నాం

వేదకాలం నుంచి నేటివరకు మన జీవనవిధానంలో భాగంగా నిర్వహించే పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుటుంబవ్యవస్థ పునాదులపై విరాజిల్లుతున్న భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ఆత్మీయానురాగాలను పెంచేవే. సోదరప్రేమకు చిహ్నాంగా మనం జరుపుకోనే రాఖీ చరిత్ర పురాణాల నుంచే ప్రారంభమైంది. భారతీయ వారసత్వవైభవానికి ప్రతికగా నేటికీ కొనసాగుతోంది. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమిగా మన తెలుగు నాట పిలిస్తే  రక్షా మంగళ్‌, రక్షా దివస్‌, రాఖీ పూనవ్‌,  కజారి పౌర్ణమి, నారియల్ పౌర్ణమి, గ్రహ పౌర్ణమి, సలోని ఉత్సవ్‌ తదితర పేర్లతో దేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యవహరిస్తారు. పేర్లు ఎన్నైనా రాఖీ మనుషుల మధ్య, ప్రకృతికి, మనిషికి మధ్య అనుబంధాన్ని గుర్తుచేసే పర్వదినం. హిందువులు, సిక్కులు, జైనులు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకొంటారు. ‘రాకా’ అంటే నిండుదనం, సంపూర్ణత్వం. రాకా చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. ఈ పూర్ణిమనాడు ధరించే రక్షను రాఖీగా వ్యవహరిస్తారు. ఈ రోజు అక్కచెల్లెల్లు తమ అన్నాతమ్ముళ్లకు నుదట  తిలకం దిద్ది చేతికి రాఖీ కడితే వారికి ఎలాంటి ఆపదలు రావని నమ్ముతారు. రాఖీ కట్టించుకున్న సోదరులు తమకు అండగా ఉంటారని విశ్వసిస్తారు.

పురాణాల్లో.

యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తిరిగి విజయం సాధించేలా అతని భార్య  శచీదేవి శ్రావణపౌర్ణమి రోజు అతని చేతికి రక్ష కట్టగా దేవతలందరూ కూడా రక్షలను తీసుకువచ్చి కట్టారట. దాంతో రెట్టింపు శక్తితో యుద్ధరంగానికి వెళ్ళిన ఇంద్రుడు విజయుడై తిరిగివచ్చాడట.

శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని  శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడట. అందుకు ప్రతిగా కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపరణంలో ఆమెకు కృష్టుడు చీరలను ఇచ్చి దుశ్సాసనుడి  దురాగతం నుండి ఆమెను కాపాడాడని చెప్తారు.

చరిత్రలో..

ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న తపనతో భారతదేశం పైకి దండెత్తి వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ ప్రాణాలను రాఖీ కాపాడిందన్నవిషయం చరిత్ర పుటల్లో కనిపిస్తుంది. తక్షశిల రాజు పురుషోత్తముడు  అలెగ్జాండర్ పై యుద్ధం గెలిచినా అతడిని చంపకుండా వదిలేస్తాడు. ఇందుకు కారణం అలెగ్జాండర్ భార్య  రుక్సానా తన భర్తను చంపవద్దని కోరుతూ పురుషోత్తముడికి రాఖీ పంపుతుందట.

వివిధ రాష్ట్రాల్లో...

ఉత్తరభారత్ లో  చాలా పెద్దఎత్తున ఈ పండుగ చేస్తారు. తమ సోదరి ఇంటికి అన్మదమ్ముళ్లు ఊరేగింపుగా వస్తారు. సోదరితో రాఖీ కట్టించుకుని ఆమెకు కానుకలు ఇస్తారు. సముద్రతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, గుజిరాత్ లలోశ్రావణ పౌర్ణమిని నారియల్ పౌర్ణమిగా భావిస్తారు. పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థిస్తారు. అంతేకాదు మత్యకారులు సముద్రుడిని ప్రార్థించి ఈ రోజు తమ చేపల వేటను ప్రారంభిస్తారు.  జార్ఖండ్, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రంలో ఈ రోజు తమ పశుసంపదను అలంకరిస్తారు. వాటికి పూజలు చేస్తారు.

కరోనా వ్యాప్తి కారణంగా ఎక్కువ మంది తమ సోదరులకు రాఖీ స్వయంగా కట్టలేకపోయినా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.