Read more!

ఫేక్ ఎమ్మార్పీ స్టిక్కర్లతో సేల్.. ఏపీలో మందుబాబులు నిలువు దోపిడి 

ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులు నిలువు దోపిడికి గురవుతున్నారు. జగన్ సర్కార్ కాసుల దందాతో ఇప్పటికే మద్యం రేట్లు డబుల్ అయ్యాయి. అసలే అధిక ధరలతో జేబుకు చిల్లుపడుతుంటే.. ఇప్పుడు నకిలీ ఎమ్మార్పీలతో మందబాబులను నిండా ముంచేస్తున్నారు. వైఎస్ జగన్ సర్కార్ రాగానే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. గతంలో మద్యం దుకాణాలను ప్రవేట్ వ్యక్తులు నడిపగా..  ప్రభుత్వమే నడపడంతో పాటు ధరలను పెంచుతూ కొత్త పాలసీని తీసుకువచ్చింది. మద్యం దుకాణాల సంఖ్యను 4,383 షాపు ల నుండి 2,900 షాపులకు తగ్గించింది. 

ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాతే అసలు కథ ప్రారంభమైంది.  ప్రభుత్వ మద్యం దుకాణాలలోని సిబ్బంది అక్రమాలకు తెర తీశారు, మొదట్లో బ్రాండెడ్ మద్యాన్ని బార్లకు, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తు కాసులు దండుకున్నారు. ఇప్పుడు ఆ పరిధిని కూడా దాటుకొని కొత్త దందాకు తెరతీశారు. నకిలీ ఎమ్మార్పీలతో  మందుబాబులను అడ్డంగా దోచుకుంటున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న చీప్ లిక్కర్ బాటిళ్లపై సొంత ఎమ్మార్పీ స్టిక్కర్లు అంటిస్తూ వస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం తమిరశ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. అక్కడ మద్యం షాపుల్లో కొత్త ఎమ్మార్పీ రేట్లతో లిక్కర్ సేల్ చేస్తున్నారు. దరలు ఒక్కసారిగా పెరగడంతో కొందరు మందుబాబులు ప్రశ్నించినా... రేటు పెరిగింది కావాలా వద్దా అంటూ బుకాయిస్తూ వచ్చారు మద్యం షాపు సిబ్బంది. 

అయితే ఇటీవల ఓ వ్యక్తి  దర తేడాను గమనించారు. ఇతర గ్రామాలకు తమిరశ షాపులో రూ.40 తేడా ఉంది. దీనిపై నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అతను ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గుడివాడ నుంచి వచ్చిన ఎక్సైజ్ అధికారులు దాడుల చేయగా.. 9 వేల ఎమ్మార్పీ స్టిక్కర్లు లభించాయి. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశారు. నకిలీ ఎమ్మార్పీ అంశంపై విచారణ చేయగా ఇది చాలాకాలంగా జరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు.

కొత్త లిక్కర్ పాలసీ ఎక్సైజ్ అధికారులు, మద్యం షాపులు నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. పలు చోట్ల షాపులు తగ్గడం, బార్లలో ధరలు ఎక్కువ ధరలు ఉండటంతో ప్రభుత్వ మద్యం షాపులపైనే మందుబాబులు ఆధారపడుతున్నారు. దీన్నే ఎక్సైజ్ సిబ్బంది అలుసుగా తీసుకొని జనాన్ని దోచేస్తున్నారు. ఒక్కో షాపు రోజుకు రూ.12 వేల వరకు ఆన్ ఆఫీషియల్‌గా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అంతా ఎక్సైజ్ అధికారుల సాయంతోనే జరుగుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ సంపాదనలో స్థానిక ఎక్సైజ్ సిబ్బందికి వాటాలు వెళ్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలకు కూడా అక్రమ సంపాదనలో వాటా వెళుతుందనే ప్రచారం జరుగుతోంది.