Read more!

వారంలో 9 లక్షల కరోనా కేసులు.. మరో టీకాకు కేంద్రం అనుమతి 

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. రెండో దశలో మరింత వేగంగా విరుచుకుపడుతోంది. కేవలం వారం రోజుల్లోనే దేశంలో 9లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత  ఆరు రోజులుగా నిత్యం లక్షకు పైనే  కేసులు వస్తున్నాయి. ఏప్రిల్‌ 5 నుంచి ఏప్రిల్‌ 11 వరకు.. ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా 9,38,650 కొత్త కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 1.34లక్షల కేసులు వెలుగుచూస్తున్నాయి. అంతక్రితం వారంతో పోలిస్తే గతవారం కొత్త కేసుల సంఖ్య 70శాతం పెరిగింది.

దేశంలో తొలిసారి ఏప్రిల్‌ 4న రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 5 మినహా గత ఆరు రోజులుగా  లక్షపైనే కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో వైరస్‌ పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ ఆదివారం ఒక్కరోజే 62వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 83శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.   

దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12,01,009 క్రియాశీల కేసులున్నాయి. ఏప్రిల్‌ 5 నాటికి 7.41లక్షలుగా ఉన్న యాక్టివ్‌ కేసులు వారం రోజుల్లోనే నాలుగున్నర లక్షలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా తొలి దశ తీవ్రంగా ఉన్న గతేడాది సెప్టెంబరులో యాక్టివ్‌ కేసుల సంఖ్య గరిష్ఠంగా 10.17లక్షలకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టి.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న 1.33లక్షలకు పడిపోయింది. 

దేశంలో 24 గంటల్లో మరో 903 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1.70లక్షలు దాటింది. ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ ఇప్పుడే.  కరోనా తొలి దశ సమయంలో గతేడాది సెప్టెంబరులో అత్యధికంగా 1200ల రోజువారీ మరణాలు నమోదయ్యాయి. అంతక్రితం వారంతో పోలిస్తే మరణాల సంఖ్య కూడా 70శాతం పెరగడం కలవరపెడుతోంది. 

ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 6.32లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. భారత్‌లో ఆ సంఖ్య 1,68,912గా ఉంది. మొత్తం కేసుల్లో ఇది దాదాపు 27శాతానికి సమానం. ప్రపంచవ్యాప్తంగా తాజాగా నమోదవుతున్న ప్రతి ఆరు కరోనా కేసుల్లో ఒకటి భారత్‌లోనే ఉండటం ఆందోళనకరం. మొత్తం కేసుల పరంగా బ్రెజిల్‌ను దాటేసి భారత్‌ రెండో స్థానానికి చేరింది. వరల్డో మీటర్‌ గణాంకాల ప్రకారం.. అమెరికాలో అత్యధికంగా 3.19కోట్ల మందికి వైరస్‌ సోకగా.. భారత్‌లో ఆ సంఖ్య 1.35కోట్లుగా ఉంది. బ్రెజిల్‌లో 1.34కోట్ల మంది వైరస్‌ బారినపడ్డారు.   

భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి లభించింది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే, దేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ తర్వాత అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ అవుతుంది.  

రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘స్పుత్నిక్‌ వి’ టీకాపై మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది. ఆ పరీక్షల భద్రత, ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్ని ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసిన డాక్టర్‌ రెడ్డీస్‌‌.. టీకా ఉత్పత్తి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది. సోమవారం ఈ డేటాను కేంద్ర నిపుణుల బృందం విశ్లేషించి, అత్యవసర వినియోగానికి సిఫారసు చేసింది.